Apr 11,2021 06:52

   జ్యోతిరావ్‌ ఫూలే జీవితం ఒక చారిత్రక పరిణామానికి ప్రతీక. బానిస భావజాలాన్ని ప్రతిఘటించిన సామాజిక ఉద్యమకారుడాయన.
   మహారాష్ట్ర లోని పూనేలో గోవిందరావు, చిమ్నాబాయి దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దవాడు రాజారాం, చిన్నవాడు జ్యోతి. ఈయన 1837లో జన్మించాడు. తల్లిదండ్రులు ఆయనకు జ్యోతి అని పేరు పెట్టడంలో ఒక చైతన్యం ఉంది. జ్యోతి రావ్‌ ఫూలే మాలి కులానికి చెందిన వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవాడు. అసలు ఆయన ఇంటి పేరు గోరె. ఫూలే తాత సతారా లోని కాట్‌గూన్‌ అనే కుగ్రామంలో వెట్టివాడుగా పనిచేసేవాడు. కొద్దిపాటి పొలం మీద వచ్చే ఆదాయంతో జీవించేవాడు. ఒకసారి కులకర్ణి అనే బ్రాహ్మణ గ్రామ అధికారి ఆధిపత్యాన్ని ఎదిరించాడు. దానితో ఫూలే కుటుంబాన్ని కులకర్ణి నానా బాధలు పెట్టి హింసించేవాడు. ఆ బాధలు సహించలేక ఫూలే తాత కులకర్ణి ని హత్య చేసి పరారయ్యాడు. అలా ఫూలే తాత బ్రహ్మణాధిపత్యాన్ని ఎదిరించాడు. ఇక అక్కడి నుంచి ఫూలే కుటుంబం అనేక ప్రాంతాలకు వలస వెళ్లింది. వీరు చివరకు పూనాను పాలించే పీష్వాల దగ్గరకు చేరారు. పీష్వాల కోసం పూల దుప్పట్లు, తలగడ దిండ్లు, ఇతర వస్తువులు తయారు చేసేవాళ్ళు. వారి పనితనానికి మెచ్చి పీష్వా 35 ఎకరాల భూమిని ఈనాంగా ఇచ్చాడు. ఆ భూమిని సాగు చేసి పూలను పండించి పూల వ్యాపారులుగా ప్రచారం పొందడంతో వీరికి ఫూలే అనే ఇంటిపేరు స్థిరపడింది.
   అలా తాము చేసే పనినే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఫూలే తన ఏడవ సంవత్సరంలో బడిలో చేరాడు. ఆ రోజుల్లో శూద్రులు, అస్పృశ్యులు చదువుకోవడమంటే పెద్ద యుద్ధమే. ఈ రోజుల్లో మాత్రం... పల్లెల్లో ఎవరన్నా దళిత పిల్లాడు బడికి వెళుతుంటే ''నీకెందుకురా చదువు, ఏం కలెక్టర్‌ అవుతావా! ఏదో ఒక పని చేసుకొని బతక్క'' అని ఎద్దేవా చేసేవారున్నారు. బ్రాహ్మణులు ఫూలే తండ్రి మీద అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి ఫూలేని చదువు మాన్పించే విధంగా చేశారు. తండ్రికి చేదోడుగా వ్యవసాయ భూమిలో పని చేశాడు. ఫూలేకు 13 ఏళ్ళ వయసులో ఎనిమిదేళ్ళ వయసుగల సావిత్రీ బాయితో వివాహం అయింది. పగటిపూట పొలంలో కాయ కష్టం చేసి రాత్రిపూట గుడ్డి దీపం ముందు కూర్చొని చదువుకునేవాడు. ఫూలేకి చదువు పట్ల ఉన్న మమకారాన్ని, తెలివితేటల్ని గమనించిన గఫర్‌ మున్షి అనే ఉర్దూ టీచర్‌ తనని మళ్ళీ చదువుకోవాల్సిందిగా ప్రోత్సహించాడు.
   ఎట్టకేలకు ఫూలే మళ్ళీ పూనా లోని స్కాటిష్‌ మిషన్‌ హై స్కూలులో చేరాడు. సమాజం గురించి హేతుబద్ధంగా ఆలోచించడం అప్పుడే నేర్చుకున్నాడు. మెట్రిక్యులేషన్‌ పూర్తయిన తర్వాత, ధామస్‌ పెయిన్‌ రాసిన 'రైట్స్‌ అఫ్‌ మ్యాన్‌' అనే పుస్తకం చదివి ప్రభావితుడయ్యాడు. అప్పటి నుండి మానవ హక్కుల కోసం పోరాటమే మార్గంగా నడిచాడు.
   ఒక రోజు ఫూలే మిత్రుని వివాహం జరుగుతుంది. ఇతను బ్రాహ్మణుడు. ఇతని ఆహ్వానం మేరకు ఊరేగింపులో పాల్గొన్నాడు. వెనకబడిన కులానికి చెందిన ఫూలే ... బ్రాహ్మణుల పక్కన నడవడం ఎంతమాత్రం సహించలేకపోయారు. అక్కడికక్కడే అప్పుడే ఫూలేని తీవ్రంగా అవమానించి అక్కడ నుండి పంపించేశారు. నిజానికి ఈ సంఘటన ఫూలే జీవితంలో పెద్ద మలుపుకు దారి తీసింది. ఈ సంఘటన జరిగి 170 సంవత్సరాలు అయింది. ఇప్పుడైతే అలా జరగదు, సమాజం ఎంతో మారింది, అనుకుంటాం. కాని ఈ మధ్యనే మార్చి 11వ తేదీన ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ జిల్లా దాస్నా గ్రామం లోని దేవీ మందిరంలో కుళాయి నీళ్ళు తాగినందుకు ఓ ముస్లిం బాలుడిని చితకబాదారు. తమిళనాడు శివగంగరు జిల్లా తిరుప్పాకడి సమీపంలోని కచ్చనాథం గ్రామంలో... దళితులు తమ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారని ఆగ్రహించిన అగ్ర కులస్తులు ఆ గ్రామంపై దాడి చేసి... ఆర్ముగం, షణ్ముగం అనే ఇద్దరు దళితులను చంపేశారు. ఇంతే కాదు. దళితుడు గుర్రం మీద ఊరేగాడనో, అన్నం దొంగిలించాడనో, ఆవు మాంసం తిన్నాడనో చితకబాది హత్య చేస్తున్న పరిస్థితులను నేటి సమాజంలో చూస్తున్నాం. వివక్ష, అణచివేత భావజాల రూపం ఏమీ మారలేదని ఇలాంటి ఘటనలెన్నో రుజువు చేస్తున్నాయి. ఈ హైటెక్‌ కంప్యూటరీకరణ యుగంలో సాంకేతిక పరిణామం జరిగిందేమో కాని, సామాజికంగా ఫూలే కాలపు వివక్షతలు, రుగ్మతలు ఇంకా మన కళ్ళ ముందు కదలాడుతూనే వున్నాయి.
   ఫూలే తన సహచరులతో కలసి శూద్రులను అతిశూద్రులను బ్రాహ్మణీయ దోపిడీ నుండి విముక్తిగావించడమే లక్ష్యంగా 'సత్య సోధక్‌ సమాజ్‌'ను స్థాపించాడు. దీనిలో బ్రాహ్మణుల నుండి మహర్లు, మాంగ్‌ ల వరకు సభ్యులుగా ఉన్నారు. అట్టడుగు వర్గాల ఆత్మ గౌరవం కోసం, స్త్రీ విముక్తి కోసం ఆయన చేసిన కృషి కొనియాడదగింది. జాన్‌ స్టువర్ట్‌ మిల్‌ రాసిన 'ఆన్‌ లిబర్టీ' గ్రంథంలోని అంశాలు ఫూలేని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫూలే స్వయంగా రాసిన 'గులాంగిరి' గ్రంథాన్ని అమెరికాలో అమానవీయ బానిసత్వాన్ని నిర్మూలించిన ప్రజలకు అంకితం చేయడంలోనే విముక్తి ఉద్యమాల పట్ల ఆయనకున్న నిబద్ధత అర్ధమవుతుంది. తాను ఆశించిన విధంగా పోరాటమే జీవితంగా గడిపి 1890 నవంబర్‌ 28న ఫూలే మరణించాడు.
   బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ తనకు ముగ్గురు గురువులని... వారు బుద్ధుడు, కబీర్‌, ఫూలే అని ప్రకటించుకున్నాడు. అంబేద్కర్‌ రాసిన 'శూద్రులెవరు?' అనే గ్రంథాన్ని ఫూలే కు అంకితం ఇస్తూ ''ఆధునిక భారత సమాజంలో మహాత్మా ఫూలే అందరి కంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో ఆధిపత్య కులాల వారి బానిసలుగా బతుకుతున్న కింది కులాల వారిలో తమ బానిసత్వ విముక్తి కోసం చైతన్యాన్ని రగిలించాడాయన. విదేశీ పాలన నుండి విముక్తిని సంపాదించడం కంటే సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించటం ముఖ్యమని గొప్ప సందేశాన్ని ఆయన ఇచ్చారు'' అని పేర్కొన్నారు.
   ఫూలే ఆఖరి వరకు పరితపించిన బానిస భావజాల నిర్మూలనే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి.


/ వ్యాసకర్త సెల్‌ : 63038 47077 /

కళ్యాణ్‌ కత్తి