Dec 22,2022 21:45

భోరుమన్న కుటుంబ సభ్యులు, కార్మికులు
రూ.50 లక్షలు పరిహారమిచ్చేందుకు యాజమాన్యం అంగీకారం
ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి : సిఐటియు
ఘటనా స్థలిని సందర్శించిన డిప్యూటీ సిఎం కొట్టు, కలెక్టర్‌ ప్రశాంతి
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం

అంతా భయపడినట్లే అయ్యింది. తాడేపల్లిగూడెం పట్టణ శివారులో పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామ పరిధిలోని ఫుడ్‌ఫ్యాట్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ పరిశ్రమలోని ఎస్‌ఎఫ్‌-1 సాల్వెంట్‌ ప్లాంట్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో ఆచూకీ తెలియని కార్మికుడు ఆ మంటల్లోనే కాలి బూడిదైనట్లు గురువారం ఉదయం గుర్తించారు. ప్లాంట్‌లో నిపుణుల పర్యవేక్షణలో అధికారులు గాలింపు చేపట్టగా ఇనుప శిథిలాల కింద కాలి బూడిదైన కార్మికుడు గుడిగంట్ల మల్లికార్జునరావు అలియాస్‌ మల్లి (38) మృతదేహ అవశేషాలను గుర్తించారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన మృతునికి భార్య రామతులసి, కుమార్తెలు పావని, అక్షయ ఉన్నారు.
ఫ్యాక్టరీ వద్ద మృతుని కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మల్లికార్జునరావు మృతి చెందాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, కలెక్టర్‌ ప్రశాంతి సమక్షంలో యాజమాన్యం, కార్మిక సంఘాల నేతల మధ్య చర్చలు సాగాయి. మృతుడు మల్లికార్జునరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, భార్యకు ఉద్యోగం ఇస్తామని, పిల్లల ఉన్నత చదువుకు సహకరిస్తామని యాజమాన్యం అంగీకరించింది. ఈ చర్చల్లో భీమవరం ఆర్‌డిఒ దాసి రాజు, తహశీల్దార్‌ శేషగిరి, పరిశ్రమ యజమాని ఒపి.గోయెంకా, ప్రతినిధులు జనార్థన్‌, కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, పట్టణ కార్యదర్శి కె.రామకృష్ణ, ఫుడ్‌ఫ్యాట్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.గణేశ్వరరావు, కార్యదర్శి పి.శ్రీనివాసరావు, ఎఫ్‌ఐటియు నేతలు మూర్తి, భాస్కర్‌రావు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్‌ అండ్‌ సైంటిఫిక్‌ సెంటర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సురేష్‌ సందర్శించారు. ప్లాంట్‌ డిజిఎం సిహెచ్‌.శాస్త్రిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ, కలెక్టర్‌ ప్రశాంతి ప్రమాద స్థలిని సందర్శించి యాజమాన్య ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాలతో రాజమండ్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని యజమాన్యాన్ని కొట్టు సత్యనారాయణ ఆదేశించారు.
బాధితులకు పరిహారం చెల్లించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం
భీమవరం : ప్రతిపాడులోని ఫుడ్‌ఫ్యాట్స్‌ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంపై సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి తక్షణం పరిహారం చెల్లించడంతోపాటు అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించి వారిని అన్ని విధాలా ఆదుకుని, నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఫ్యాక్టరీల్లో తరచూ ప్రమాదాలు జరగడం కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడటం తీవ్ర ఆందోళన కల్గిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీల్లో ప్రభుత్వ పర్యవేక్షణ పెరగాలని, భద్రతా చర్యల్లో లోపాలు జరగకుండా చూడాలని కోరారు. కార్మికుల ప్రాణాలు, భద్రత పట్ల అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాలు పునరావతం కాకుండా చూడాలని బలరాం విజ్ఞప్తి చేశారు.
ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి
కార్మికులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలి : సిఐటియు
భీమవరం : పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని ఫుడ్‌ఫ్యాట్స్‌లో చోటుచేసుకున్న ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి కారణాలు వెలికి తీయాలని, ఈ ప్రమాదంలో బాధితులైన కార్మికులను అన్నివిధాలా ఆదుకోవాలని సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జెఎన్‌వి.గోపాలన్‌, కె.రాజారామ్మోహన్‌రారు ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ పరిశ్రమల్లో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలపై ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఫ్యాక్టరీస్‌, కార్మిక శాఖ సరైన పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం దారుణమన్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, కార్మిక చట్టాలు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలు, చట్టాలు అమలు చేయని పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.