Apr 25,2021 14:45

అవినాష్‌ వస్తున్నాడుట అమెరికా నుంచి. మీరు నిద్రట్లో ఉండగా ఫోను చేశాడు' రేవతి చెప్పింది.
మనవడొస్తున్నాడని తెలియగానే సంబరపడ్డాడు రంగనాథóం. 'ఎప్పుడొస్తున్నాడుట? ఎన్నిరోజులుంటాడు? గది శుభ్రం చేయించావా? ఏ.సి. పనిచేస్తోందా?' ప్రశ్నల వర్షం కురిపించాడు.
'అబ్బబ్బ! ప్రశ్నలతో చంపేస్తున్నారు. రేపు ఫ్లయిట్‌ ఎక్కుతున్నాడు. హైదరాబాద్‌లో దిగి, కార్లో వస్తాడుట. ఇప్పుడేగా ఫోనొచ్చింది. నెమ్మదిగా అన్నిపనులూ అవుతాయి! నన్ను కంగారుపెట్టి, చంపకండి' అని విసుక్కుంది రేవతి.
'వాడికి నేతిబొబ్బట్లు, చేగోడీలు, జంతికలు, కారప్పూస అంటే చాలా ఇష్టం. అవి చేసిపెట్టు!' అన్నాడు రంగనాథóం.
'సర్లేండి! సరుకుల లిస్టు రాసిస్తాను, మార్కెట్‌కి వెళ్ళి పట్రండి!' అని, పనిలో పడిపోయింది రేవతి.

                                                        ***
అవినాష్‌ రాకకోసం వీధి అరుగుమీద పచార్లు చేస్తూ ఎదురుచూస్తున్నాడు రంగనాథం. చిన్నప్పుడు వాడు వేసవి సెలవులకి వచ్చినప్పుడు ''తాతు! తాతు!'' అంటూ ముద్దుగా పిలిచేవాడు. ఉద్యోగ రీత్యా కొడుకు శరత్‌ అమెరికా వెళ్లిపోయాక అవినాష్‌ రావడం తగ్గిపోయింది. కానీ వారంలో కనీసం మూడుసార్లయినా వీడియోకాల్‌ చేసి, గంటల తరబడి మాట్లాడతాడు. కారు ఆగిన శబ్దానికి ఆలోచనల్లోంచి బయటకి వచ్చాడు.
'తాతు! వచ్చేసాను!' అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు అవినాష్‌. వాడి ఆలింగనం రంగనాథానికి అనిర్వచనమైన ఆనందం కలిగించింది.
'ఎలా ఉన్నావురా కన్నా!? అని మరింతగా హత్తుకున్నాడు. రేవతికి మనవణ్ణి చూడగానే ఆనందం, దు:ఖం ఒక్కసారిగా వచ్చేశాయి. ఆర్తిగా దగ్గరకు తీసుకుని, నుదుట ముద్దు పెట్టుకుంది.
'ఎలా ఉన్నావ్‌ డార్లింగ్‌?' అంటూ బుగ్గలు చేత్తో నిమిరాడు. రేవతి మనవడి ప్రేమకి ఉబ్బితబ్బిబ్బైపోయింది.
అవినాష్‌ ట్రాలీ బ్యాగ్‌ బెడ్‌రూంలో పెట్టి, వాష్‌రూముకి వెళ్లి వచ్చాక, భోజనం వడ్డించింది. భోజనం చేస్తున్నంతసేపు 'వావ్‌ ! సూపర్‌ డిషెస్‌ డార్లింగ్‌!' అంటూ పొగుడుతూ బామ్మకి ముద్దులు పెడుతుంటే, రేవతికి సంతోషంతో కడుపు నిండిపోయింది.

                                                       ***
తెలతెలవారుతోంది. తాత, మనవళ్ళిద్దరూ ట్రాక్‌సూట్లు వేసుకుని, గోదావరి ఏటి గట్టుమీద వాకింగ్‌కి బయలుదేరారు. అవినాష్‌తో సమానంగా అంగలు వేసుకుంటూ వడివడిగా నడిచే రంగనాథాన్ని చూసి, 'హె! యంగ్‌ మ్యాన్‌! వాటే స్టామినా!' అని అవినాష్‌ ఆశ్చర్యపడ్డాడు.
'ఇదొక లెక్కా? నీ వయస్సులో ఉన్నప్పుడు అవలీలగా పదిమైళ్ళు పరుగెత్తేవాణ్ణి తెలుసా? గోదారి ఈ గట్టు నుంచి ఆ గట్టుకి ఈదేవాడిని' అన్నాడు నవ్వుతూ రంగనాథం.
'యూ ఆర్‌ అమేజింగ్‌ తాతు!' అని రంగనాథం భుజం మీద తట్టాడు.
'ఇంతకీ లూసీ ఎవర్రా కన్నా?' అడిగాడు రంగనాథం. తాత హఠాత్తుగా అడిగిన ప్రశ్నకి జాగింగ్‌ చేస్తున్న అవినాష్‌ ఆగి, ఆశ్చర్యంగా చూశాడు.
'నీకెలా తెలుసు తాతు?'
'చెప్పరా కన్నా! నీ విషయాలన్నీ నాకు తెలుస్తాయిరా!'
'అబ్బ! వదిలేయి తాతు!' అని తేలిగ్గా తీసేశాడు.
ఇద్దరూ అలసిపోయి, సేదతీరడానికి పచ్చిక మీద కూర్చున్నారు.
'నీకు బ్రేకప్‌ చెప్పి, మళ్ళీ నీ వెంట పడుతోందిటగా!' మళ్ళీ ఆరా తీయబోయాడు.
'తన సంగతి నీకెలా తెలిసింది? ఇక్కడ కూర్చుని, నా పర్సనల్‌ విషయాలు తెలుసుకుంటున్నావా?' చిరుకోపంతో అడిగాడు.
'ఇంకా చాలా తెలుసురా కన్నా! మరో పిల్ల జానూ! నువ్వంటే పడి ఛస్తోందని, ఆ అమ్మాయిని నువ్వు పట్టించుకోవడం లేదని కూడా తెలుసు'.
'అయ్యబాబోరు తాతూ! నా లైఫ్‌ హిస్టరీలో ప్రతి పేజీ చదివేశావా? ఓహో! తాన్వి మొత్తం చెప్పిందా?' అన్నాడు కోపంగా.
'దాన్నేం అనకురా పాపం! అన్నయ్య డిసైడ్‌ చేసుకోలేక కన్ఫ్యూజ్‌ అవుతున్నాడని చెప్పిందిరా!'.
'ఎస్‌ గ్రాండ్‌ పా! సమ్‌ థింగ్‌ ఈజ్‌ గోయింగ్‌ ఆన్‌! బట్‌ ఇది నా పర్సనల్‌' అన్నాడు అమెరికన్‌ కల్చర్‌ని గుర్తుచేస్తూ.
'అఫ్‌కోర్స్‌ మై గ్రాండ్‌సన్‌! ఇది నీ వ్యక్తిగతమే! కాదనను. నా అభిప్రాయాన్ని నీ మీద రుద్దను. నువ్వు అనుసరించవచ్చు లేదా వదిలేయవచ్చు నీ ఇష్టం!' అని నవ్వాడు రంగనాథం. 'కానీ లైఫ్‌ పార్టనర్‌ని ఎంచుకునే విషయంలో తీసుకున్న స్థిరమైన నిర్ణయం, మన భవిష్యత్తు జీవితాన్ని ఆనందంగా నడిపిస్తుంది' అన్నాడు.
'కానీ దిసీజ్‌ జస్ట్‌ డేటింగ్‌ తాతు! ఇంతవరకు నేను ఎవ్వరి గురించి అంత డీప్‌గా ఆలోచించలేదు. ఎందుకంటే నాకు కొన్ని అభిప్రాయాలున్నట్టే, గాళ్స్‌కీ ఉంటాయి కదా!'.
'ఓకే! ఓ.కే! నువ్వు చెప్పింది కరక్టే! నువ్వు వేసే అడుగులో ఏదైనా ప్రాబ్లం వస్తే, మానసికంగా గందరగోళంలో పడతావేమోననే భయం నాది రా కన్నా !' అన్నాడు రంగనాథం.
'లీవ్‌ ఇట్‌ తాతు! ఆ సిట్యుయేషనే వస్తే, సలహా అడిగే మొదటిఫ్రెండ్‌ నువ్వే!' అంటూ రంగనాథం లేవడానికి చెయ్యి అందివ్వబోయాడు.
'నో! నీడ్‌ !' అని అవినాష్‌ చేతిని పుచ్చుకోకుండా తనంతట తానే హుషారుగా లేచాడు.
'యూ ఆర్‌ సూపర్‌ తాతు!' అని షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు అవినాష్‌.

                                                         ***
అవినాష్‌ వచ్చి పదిహేను రోజులవుతోంది. తన రూంలో కంప్యూటర్‌ ముందు కూర్చుని, ఎవరితోనో ఛాటింగ్‌ చేయడం గమనించాడు రంగనాథం. అందులోంచి ఆడపిల్లల గొంతులు గట్టిగా వినబడుతున్నాయి. ఇన్ని రోజుల్లో అవినాష్‌ తన గర్ల్‌ఫ్రెండ్స్‌ గురించి మాట్లాడే అవకాశం తాతకు ఇవ్వలేదు. ఎలాగైనా సరే ఈ రోజు వాడితో మాట్లాడాలి అనుకున్నాడు రంగనాథం. మనవడు బయటకు వస్తాడేమోనని ఎదురుచూసి, ఆకలికి ఆగలేక భోజనానికి కూర్చున్నాడు.
'కన్నా! భోజనానికి రా!' అని రేవతి పిలుపుకి గదిలోంచి బయటకి వచ్చాడు. డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వస్తూ.. 'నేను చూడడం మిస్‌ అయ్యాను డార్లింగ్‌! నువ్వు నవ్వితే డింపుల్స్‌ భలే పడుతున్నాయి'. అంటూ బామ్మ బుగ్గలు తడిమి, చిలిపిగా నవ్వుతూ తాతకేసి చూశాడు అవినాష్‌.
'ఊరుకో కన్నా !' అని సిగ్గుగా ముసిముసి నవ్వులు నవ్వింది రేవతి.
'ఏరా! నీ గాళ్‌ ఫ్రెండ్‌లో ఎవ్వరికైనా అలా డింపుల్స్‌ పడతాయిరా? ట్వింకిల్స్‌లా మెరుస్తాయా!'.. మరింత చిలిపిగా అడిగాడు రంగనాథóం.
'తాతు! నువ్వు నన్ను టోటల్‌గా స్కాన్‌ చేసేస్తున్నావు!' అంటూ మాట మార్చాడు అవినాష్‌. వెంటనే రంగనాథం ఆ అవకాశాన్ని వదులుకోకుండా 'నీ ఫస్ట్‌క్రష్‌ ఎవర్రా?' అనేసి, కంచంలో తలదూర్చాడు ఏమీ ఎరగనట్టు.
కర కర నములుతున్న అప్పడం మధ్యలో వదిలి, ఠక్కున తలెత్తాడు అవినాష్‌.
'తాతు! నెట్‌ పిక్స్‌ చూసి.. బాగా డెవలప్‌ అయ్యావు! మనం సెపరేట్‌గా మాట్లాడుకుందాం'.. అంటూ తన గదిలోకిి వెళ్ళిపోయాడు. ఉసూరుమంటూ లేచాడు రంగనాథం.

                                                         ***
'చలి బాగా ఎక్కువగా ఉంది ఎందుకండి బయటకి? మీకసలే చలి పడదు!' అంటూ రేవతి వారించినా వినకుండా ఇద్దరూ నడక మొదలెట్టారు.
'కన్నా! నీ ఫ్రెండ్‌ లూసీ ఏం చేస్తూంటుందిరా?' వేగంగా నడుస్తూ అడిగాడు రంగనాథం.
'ఒక ఎమ్‌ ఎన్‌ సిలో టీమ్‌ లీడర్‌. చాలా తెలివైంది. కానీ డామినేటింగ్‌ అండ్‌ ఇగోయిస్టిక్‌ గాళ్‌. ఫాదర్‌ బిజినెస్‌ మ్యాన్‌. అతను మొదటి భార్యకు డైవర్స్‌ ఇచ్చి, లూసీ వయసున్న అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు. తండ్రి మీద కోపం వచ్చి సెపరేట్‌గా ఉంటోంది.'
'ఈ విడాకుల కల్చర్‌ వెస్ట్రన్‌ కంట్రీస్‌లో ఎక్కువ. ప్చ్‌!' అంటూ బాధపడ్డాడు రంగనాథం.
'అక్కడే కాదు! ఇక్కడా ఎక్కువైంది కదా తాతు! మొన్న ఒక సర్వేలో తెలిసింది ఇండియాలోనూ ఒకరంటే ఒకరికి పడక ఒంటరిగా ఉండాలని ఆలోచించే జంటలు ఎక్కువయ్యాయట కదా! ఈ గ్లోబలైజేషన్‌లో అది క్వైట్‌ నాచురల్‌! ఈ దేశం, ఆ దేశం అనిలేదు తాతు!' అని తేలిగ్గా అన్నాడు.
రంగనాథం మనవడికి సమాధానం చెప్పలేకపోయాడు. వాడు బాగా ఎదిగిపోయాడని అర్థమయ్యింది. 'అవును! స్వతంత్ర భావాలు, డబ్బు సంపాదన పెరిగిపోవడం వల్ల, ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. పెద్దవాళ్ళ మాట వినడం లేదు' అన్నాడు రంగనాథం బాధగా.
'ఇంకా ఈ కాలంలోనూ ''ఆ అమ్మాయిని చేసుకో! ఈ అమ్మాయిని చేసుకో!'' అంటూ మీ నిర్ణయాన్ని మా మీద రుద్దడం ఎంతవరకు రైటు?' అడిగాడు అవినాష్‌.
'మరి మీ అంతట మీరు సెలక్ట్‌ చేసుకున్నవాళ్ళు మూడుముళ్లు పడ్డ కొద్దిరోజులకే ఎందుకు విడిపోతున్నారు?' ఘాటుగా స్పందించాడు రంగనాథం.
'పెళ్లి గురించి అంత తీవ్రంగా ఆలోచించే సమయం నేటి జనరేషన్‌కి లేదు తాతు!' అన్నాడు అవినాష్‌.
'భలేవాడివిరా! పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. మన అనుకునే వాళ్ళు జీవితాంతం ఉంటారని అనుకుంటున్నావా? లైఫ్‌ పార్ట్‌నర్‌ మాత్రమే మనతో జీవితాంతం ఉంటుంది. అలాంటి అమ్మాయినే ఎంచుకోవాలి! పొద్దున్నే నీకు బోరు కొట్టిస్తున్నానా?' అడిగాడు రంగనాథం.
'లేదు!' అంటూ తలూపాడు అవినాష్‌.
'ఇక జాను సంగతి చెప్పు కన్నా!' అని భుజం మీద చెయ్యేశాడు ఆప్యాయంగా. జాను పేరు వినగానే అవినాష్‌ ముఖంలో వెలుగు గమనించాడు రంగనాథం.
'ఊ......షీ ఈజ్‌ గుడ్‌! బట్‌ వెరీ కంపోజ్డ్‌. చాలా నెమ్మది. బ్యూటిఫుల్‌ ఎట్‌ హార్ట్‌. షి ఈజ్‌ ఎ సైకియాట్రిస్ట్‌.'
'వాళ్ళ అమ్మానాన్న ఎవరు?' వివరాలు నెమ్మదిగా అడిగాడు రంగనాథం.
'అమ్మానాన్న ఇండియన్సే. ఎప్పుడో వచ్చి, అమెరికాలో సెటిలయ్యారు. జాను బోర్న్‌ అండ్‌ బ్రాటప్‌ అక్కడే. ఏం ఎందుకు ఈ వివరాలన్ని? వచ్చిన దగ్గర నుండి చంపేస్తున్నావు' చిరుకోపంగా అడిగాడు.
'నీకు పెళ్లి వయసు వచ్చింది కదా! నువ్వు డేటింగ్‌ చేసే అమ్మాయిలు ఎలాంటివాళ్ళా అని జస్ట్‌ చిన్న ఇంటరెస్ట్‌. అయినా నీకు ఎవరు నచ్చితే వాళ్ళనే సెలెక్ట్‌ చేసుకో! నచ్చడం అంటే నువ్వంటే ఇష్టపడేవాళ్ళు, నిన్ను మన:స్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు అని అర్థం. నీ ఆనందంలోనే కాదు, బాధలోనూ నేనున్నాననే ధైర్యాన్నిచ్చే వాళ్ళు మన సోల్‌మేట్‌ అవ్వాలి. నువ్వూ అలా ఉండాలి మరి. పెళ్ళంటే ఇద్దరి మధ్య ఒప్పందం కాదు! ఎందుకంటే ఇది బిజినెస్స్‌ కాదు కనుక. నీ రాగ ద్వేషాలను ఆ అమ్మాయి, తన ఫీలింగ్స్‌ని నువ్వు అర్థం చేసుకుని, మసలుకోవాలి. అలా తారసపడిన అమ్మాయే ''ఫస్ట్‌ క్రష్‌'' అవుతుంది!' అన్నాడు రంగనాథóం.
తాతయ్య అన్న మాటలు అవినాష్‌ మనసులో అలజడి రేపాయి. ఇన్ని రోజులూ లూసీ, జానూలకు ఒకరికి తెలియకుండా మరొకరిని మేనేజ్‌ చేస్తూ వచ్చాడు. దానికి కారణం, ఎవరు తనమీద నిజమైన ప్రేమ చూపిస్తున్నారో తెలుసుకోలేకపోవడమే తప్ప, మోసం చేద్దామని కాదు అనుకున్నాడు. లూసీ, జానులో ఎవర్ని చూస్తే తనకి ప్రేమ అనే ఫీలింగ్‌ కలిగింది? ఇద్దరిలో ఎవ్వరికి తనంటే నిజమైన ప్రేమ ఉంది? కాసేపు ఆలోచించాడు. ఆ ఆలోచనల్లో ఉండగా..
'ఏరా ఇంటికి వెడదామా?' అంటూ గట్టు మీద కూర్చున్న రంగనాథం వేగంగా, హఠాత్తుగా లేవడంలో చిత్తడిగా ఉన్న మట్టిలో వేసిన కాలు జారింది.
''తాతు!'' అని గట్డిగా అరిచి, అవినాష్‌ పట్టుకునేలోపే కిందపడిపోయాడు రంగనాథం. కాలు బెణికినట్టనిపించింది. నడుం దగ్గర నొప్పితో బాధపడ్డాడు.
'అయ్యో! నేను జస్ట్‌ మిస్‌ అయ్యాను. సారీ తాతు!' అని బాధపడ్డాడు అవినాష్‌.
'ఫర్వాలేదురా చిన్న పెయిన్‌' అని అవినాష్‌ భుజాన్ని ఆధారంగా చేసుకుని, ఇంటివైపుకి నడవడం మొదలుపెట్టాడు.

                                                        ***

ఆటోలోంచి నెమ్మదిగా దిగుతున్న రంగనాథాన్ని చూసిన రేవతి 'అయ్యో! ఏమైందండి?' అంటూ కంగారుపడుతూ వచ్చి, మరోచెయ్యి తన భుజం మీద వేయించుకుని, నడిపించుకుని లోపలకి తీసుకెళ్ళింది. జరిగింది తెలుసుకుని 'ఎందుకండీ! ఈ వయస్సులో కుర్రాడితో సమానంగా పరుగులు! కుదురుగా ఒకచోట కూర్చోలేరూ!' అని గోల పెట్టింది.
'తాతు తప్పు ఏంలేదు బామ్మ! అనుకోకుండా కాలు జారింది' అని సర్దిచెప్పాడు అవినాష్‌.
ఇద్దరూ కలిసి రంగనాథాన్ని మంచంమీద పడుకోబెట్టారు. కాలికి, నడుంకి ఆయింటుమెంటు రాశారు. నొప్పికి టాబ్లెట్‌ వేసింది రేవతి. అవినాష్‌కి అమెరికా నుంచి కంపెనీ కాల్స్‌ రావడంతో ఆన్‌లైన్లో బిజీ అయిపోయాడు.
రేవతి భర్తను ఒంటరిగా వదలకుండా పగలూ, రాత్రి సపర్యలు చేసింది. నాలుగు రోజులు తర్వాత కోలుకున్నాడు రంగనాథం.
'ఏరా కన్నా! బయటకి వెడదామా?' అని నవ్వుతూ అడిగాడు అవినాష్‌ని రంగనాథం.
'యూ ఆర్‌ గ్రేట్‌ తాతు! భలే రికవరీ అయ్యావు' అని మెచ్చుకున్నాడు.
'నా గొప్పతనం కాదురా! ఇరవై నాలుగు గంటలూ ఏ క్షణంలో ఏ అవసరం వస్తుందో అని నిద్ర కూడా పోకుండా అంటిపెట్టుకునే ఉండి, సేవ చేసిందిరా మీ బామ్మ. మై ఫస్ట్‌క్రష్‌! ఏభై ఏళ్ళ నుంచి నాతో పాటు పయనిస్తోంది' అని రేవతి చేతులు పుచ్చుకుని, మొహంలో దాచుకున్నాడు ఆర్ద్రతగా.
ఆ సన్నివేశం చూడగానే అవినాష్‌కి అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. వాళ్ళిద్దరూ చూడకుండా కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకున్నాడు. ఇద్దరి దగ్గరకు వెళ్ళి 'కూల్‌ తాతు! కూల్‌ డార్లింగ్‌' అని కౌగిలించుకున్నాడు.

                                                          ***
అవినాష్‌ అమెరికా వెళ్ళిపోయాక రంగనాథానికి, రేవతికి ఇల్లు చిన్నబోయినట్టు అనిపించింది. ఇద్దరికీ ఏ పనీ చేయబుద్ధి కాలేదు. మనవడు వదిలిన జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఇంతలో ఫోన్‌ రింగయింది.
ఫోను ఎత్తిన రంగనాథానికి అవినాష్‌ గొంతు హుషారుగా వినిపించింది.
'తాతు! విష్‌ మై ఫస్ట్‌క్రష్‌ జాను. పూర్తిపేరు జానకి. మా ఇద్దరికి బ్లెస్సింగ్స్‌ ఇవ్వు' అన్నాడు ఆనందంగా. రంగనాథం, రేవతీల సంతోషానికి పట్టాపగ్గాలు లేవు. ఇద్దర్నీ ఆశీర్వదించారు.
మరో నాలుగు రోజులకు రంగనాథానికి కొడుకు శరత్‌ ఫోన్‌ చేశాడు.
'నాన్న! పెళ్లి విషయంలో అవినాష్‌ సరైన నిర్ణయం తీసుకునేలా మీరు చాలా కష్టపడ్డారు. ఎలా ఉంది మీకిప్పుడు?'.
'నాకేం! ఉక్కు పిడిలా ఉన్నా!' అన్నాడు రంగనాథం.
'హమ్మయ్య! మేం అందరం చాలా కంగారుపడ్డం. నాన్న! నీకో శుభవార్త! అవినాష్‌ తన పెళ్లి మన ఊరిలో, మీ ఇద్దరి సమక్షంలోనే చేసుకుంటానంటున్నాడు. అమ్మకీ చెప్పండి. మీతో ఆ విషయాలన్నీ మళ్ళీ మాట్లాడతా! ఆఫీసుకి టైమవుతోంది' అన్నాడు హడావుడిగా.
'అలాగే శరత్‌! అందరూ నెలరోజుల ముందే వచ్చేయండి!' అని ఫోను కట్‌ చేసి, ఆనందంగా 'ఏమేవ్‌! నీ మనవడి పెళ్లి ఇక్కడేట!' అన్నాడు రంగనాథం.
'ఇది బాగా ఓల్డ్‌ న్యూస్‌ మై డియర్‌ ఓల్డ్‌ మ్యాన్‌! నాకు ఎప్పుడో తెలుసు, నా మనవరాలు తాన్వి మీకన్న ముందే చెప్పిందోచ్‌!' అని నవ్వేసింది రేవతి.

చాగంటి ప్రసాద్‌
9000206163