Jun 07,2023 23:59

ఫ్రూట్‌ కవర్లలో పండిన మామిడి పండ్లు

ప్రజాశక్తి-కె.కోటపాడు
పండ్లలో రారాజు మామిడి... ఆ పండ్లను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు... వాటి రుచి అలాంటిది మరి. కాని కొన్నేళ్లుగా మామిడి పంటలో నాణ్యత తగ్గుతూ వస్తోంది. ప్రధానంగా బయటకు కాయ బాగానే కనిపిస్తున్నా లోపల పురుగు పట్టేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నాణ్యమైన మామిడి పండ్లు పండించేందుకు ఉద్యానవన శాఖ ఈ ఏడాది మండలంలోని కొన్ని తోటల్లో ప్రయోగాత్మకంగా ఫ్రూట్‌ కవర్లు పంపిణీ చేసింది. ఈ కవర్లు తొడిగిన పండ్లు మంచి రంగుతో చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఈ కవర్లు పూర్తిగా కలప గుజ్జుతో తయారై కాయలకు రక్షణగా నిలుస్తున్నాయి. నిమ్మకాయ సైజు పరిమాణంలో ఉన్నప్పుడు రైతులు ఈ ఫ్రూట్‌ కవర్లను తొడిగారు. 50 రోజులపాటు ఉంచి తీసి చూస్తే నాణ్యమైన బంగారు రంగుతో కూడిన కాయలు దర్శనమిచ్చాయి. సాధారణ కాయలకు, కవర్లు తొడిగిన కాయలకు ఎంతో వ్యత్యాసం కనిపించింది. సాధారణ కాయ సైజు కన్నా ఎక్కువ పరిమాణం పెరిగింది. కవర్లు తొడగటంతో మంచు, పురుగు, టెంక పురుగు, పండు ఈగలు శోకకుండా కాయలకు రక్షణ కలిగిస్తాయని స్థానిక ఉద్యానవన శాఖ అధికారి కిరణ్మయి తెలిపారు. తొడిములు దృఢంగా తయారై ఈదురుగాలులకు, తుఫానులకు కాయ కింద పడదని, ఎక్కువ రోజులు పండు నిల్వ ఉంటుందని చెప్పారు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనలతో మామిడి పంటలను అభివృద్ధి చేస్తే నాణ్యమైన పండ్లతో అధిక దిగుబడులు సాధించవచ్చునని ఆమె పేర్కొన్నారు. విచ్చలవిడిగా పురుగు మందులు వాడటం, మామిడికాయలకు రక్షణ లేకపోవడం తదితర కారణాలవల్ల మార్కెటింగ్‌ తగ్గుతుందని తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వచ్చే సంవత్సరం అధిక సంఖ్యలో మామిడి రైతులు ఫ్రూట్‌ కవర్ల విధానాన్ని పాటిస్తారని భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.