పదహారణాల ప్రజాస్వామ్యానికి భారతదేశం పెట్టింది పేరని కీర్తి కండూతిలు మూటగట్టుకోగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం క్రమంగా కుంచించుకుపోతోందని అమెరికాకు చెందిన మానవ హక్కుల పర్యవేక్షణ వేదిక 'ఫ్రీడమ్ హౌస్' నివేదిక విస్పష్టం చేసింది. దేశంలో ప్రజాస్వామ్య పతనం 2014లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక మొదలవగా 2019లో రెండవ తడవ గద్దెనెక్కాక వేగవంతమైందని 'ఫ్రీడమ్ హౌస్' ఉదాహరణలతో సహా కుండబద్దలు కొట్టింది. కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాదీ ప్రపంచంలో ప్రజాస్వామ్యం అమలవుతున్న తీరుపై సదరు సంస్థ నివేదికలు వెలువరిస్తుండగా, తాజాగా 2021 నివేదిక విడుదల చేసింది. రాజకీయ హక్కులు, పౌర హక్కులు ప్రామాణికాల ఆధారంగా భారత్ స్కోర్‌ను లెక్కించగా నిరుటి కంటే నాలుగు పాయింట్లు తగ్గి 71 నుంచి 67వ స్థానానికి దిగజారింది. ఆ రిపోర్టులో మిక్కిలి ఆందోళనకర విషయమేమంటే, ఇప్పటి వరకు మన దేశం హోదా పూర్తి స్థాయి 'స్వేచ్ఛ' కేటగిరిలో ఉన్నది కాస్తా 'పాక్షిక స్వేచ్ఛ' కేటగిరికి పడిపోయింది. అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య పద్ధతులను, సంప్రదాయాలను అనుసరించే దేశంగా సేవలందించే బదులు తిరోగమనం వైపు పయనిస్తోందని, నియంతృత్వం దిశకు నెట్టబడుతోందన్నది 'ఫ్రీడమ్ హౌస్' ఉద్ఘాటన. కరోనా లాక్‌డౌన్‌లో ప్రభుత్వం సృష్టించిన గందరగోళం కారణంగా లక్షలాది వలస కార్మికులకు ప్రమాదం ఏర్పడటం, ఉద్దేశపూర్వకంగా ముస్లింలను బలిపశువులను చేయడం, విమర్శించే వారిపై అణచివేత చర్యలకు పాల్పడటం వంటి వాటిని 'ఫ్రీడమ్ హౌస్' తన నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించి వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టింది.
'ఫ్రీడమ్ హౌస్' నివేదికను మోడీ ప్రభుత్వం తిరస్కరించడంతో పాటు పబ్లిక్ ఆర్డర్, పోలీస్ రాష్ట్రాల పరిధిలోనివిగా పేర్కొనడం కచ్చితంగా తప్పించుకోడానికే. బిజెపి వచ్చాక దేశంలో ఫెడరల్ వ్యవస్థకు, రాష్ట్రాల హక్కులకు ఎంతగా చేటు తలపెట్టిందో చెప్పడానికి పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, వ్యవసాయ చట్టాల వంటివి మచ్చు తునకలు. కేంద్రం వాదన నుంచి చూసినా బిజెపి, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే పౌర హక్కులకు, ప్రజాస్వామ్య విలువలకు పాతర వేయడాన్నే చూస్తున్నాం. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఎన్‌ఐఎ వంటివి రాష్ట్రాల్లోకి చొచ్చుకెళ్లి ఏ విధంగా అరెస్టులు చేస్తున్నాయో చెప్పనవసరం లేదు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన వారిపై కరోనా అని కూడా చూడకుండా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల ఏ విధంగా అక్రమ నిర్బంధానికి కేంద్రం ఒడిగట్టిందో యావత్ దేశం చూసింది. గోరక్షణ పేరుతో ముస్లింలు, దళితులపై అల్లరి మూకల దాడులు, కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమంటూ నిరాధార ఆరోపణలు వ్యాప్తి చేసి భౌతిక హింసకు పాల్పడిన ఉదంతాలు కోకొల్లలు. ఇవన్నీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసే చర్యలు.
రాజ్యాంగం పౌరులకు కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించే ప్రభుత్వ బరితెగింపులు ఈ కాలంలో కొదవే లేదు. వ్యక్తుల వ్యక్తిగత కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లపై సైతం నిఘా పెట్టి విచారించే అధికారాన్ని 'సిబిఐ, ఎన్‌ఐఎ, రా' వంటి దర్యాప్తు సంస్థలకు కేంద్రం దఖలు పర్చింది. ప్రభుత్వ విధానాలపై అసమ్మతిని, వాస్తవాలతో కూడిన విమర్శనాత్మక వార్తలను ప్రజలకు అందిస్తున్న జర్నలిస్టులపైనా, ఆన్‌లైన్ మీడియా సంస్థలపైనా అక్రమ కేసులు బనాయించింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనల వార్తలను నియంత్రించేందుకు ఏకంగా 'ఐ.టి రూల్స్ 2021' తీసుకొచ్చింది. హక్కుల సంఘాల నేతలు, కార్యకర్తలు, కవులు, కళాకారులు, మేధావులపై నిర్బంధాలు లెక్కే లేదు. రైతు ఆందోళనల వార్తల కట్టడికి మంత్రుల కమిటీ చేసిన సిఫారసులను గమనిస్తే ప్రభుత్వ ఉద్దేశం అర్థమవుతుంది. కోర్టులు సైతం పలు సందర్భాల్లో ప్రభుత్వ నిరంకుశ చర్యలను ఎండగడుతున్నా మార్పు శూన్యం. చర్చ, సంప్రదింపులు, అసమ్మతి ఈ మూడు ఉంటేనే ప్రజాస్వామ్యం అవుతుంది. వీటికి బిజెపి సర్కారు బద్ధ వ్యతిరేకి. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న హక్కులను ప్రజలందరూ సమిష్టిగా గొంతెత్తి కాపాడుకోవాల్సిన తరుణమిది. ఈ కార్యాచరణ తాజా 'ఫ్రీడమ్ హౌస్' హెచ్చరిక ద్వారా మరొకసారి నిర్దేశమైంది.










