
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద నిరనలో అంగన్వాడీలు, నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు : తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులతో ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా వ్యవహరిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి, ఇప్పుడు ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలకు పూనుకుంటుందని సిఐటియు, ఎఐటియుసి నాయకులు విమర్శించారు. అంగన్‌వాడీలపై నిర్బంధానికి వ్యతిరేకంగా మంగళవారం గుంటూరులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట, చిలకలూరిపేటలో నిరసన తెలిపారు. గుంటూరులో నిరసనకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి పి.దీప్తి మనోజ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే రూ.వెయ్యి అదనంగా అంగన్వాడీలకు జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి,విస్మరించిందన్నారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు ఐదు గ్రాముల నూనెతో పౌష్టికాహారం ఎలా అందించాలని ప్రశ్నించారు. అంగన్వాడి సెంటర్లలో మంచినీళ్లు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని, ఎప్పుడో 10-20 ఏళ్ల క్రితం వంట సామగ్రి ఇచ్చారని, కొన్ని సెంటర్లకు గ్యాస్ కనెక్షన్ ఒకచోట ఉంటే పంపిణీ ఒకచోట ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ దష్టికి తీసుకువచ్చేందుకు విజయవాడలో ధర్నాకు పిలుపునిస్తే అంగన్వాడి కార్యకర్తలు విజయవాడ రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ప్రభుత్వ దమన నీతికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ విధంగా నిర్బంధాలు ప్రయోగిస్తే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకష్ణమూర్తి మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయమని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీలపై పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించడం హేయమైన చర్యన్నారు. ఒకవైపు విజయవాడలో ధర్నా చేసుకునేందుకు పోలీసులు పర్మిషన్ ఇచ్చి, రెండో వైపు జిల్లాల నుండి కార్మికులు రాకుండా జిల్లాలలోనే అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. కార్మికులు, ప్రజలు తమ నిరసనను తెలియజేయకుండా ఈ ప్రభుత్వం వారి గొంతు నొక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎ.అరుణ్ కుమార్, సిఐటియు నగర తూర్పు, పశ్చిమ కమిటీల ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు ప్రసంగించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎం.హనుమంతురావు, నాయకులు కె.మాల్యాద్రి, ఆర్.అంజిబాబు, ఎం.శ్రీనివాసరావు, సిఐటియు నగర పశ్చిమ కమిటీ అధ్యక్షులు బి.సత్యనారాయణ, నాయకులు షేక్ ఖాసీంవలీ, ఆది నికల్సన్, కె.నళినీకాంత్, షేక్ ఖాసిం షహీద్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు చిన్న వెంకయ్యమ్మ, షేక్ బాజీబి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : అసెంబ్లీ సమావేశాల సందర్భంగానైనా అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తారనే ఉద్దేశంతో చలో విజయవాడకు పిలుపునివ్వకగా సమస్యలపై శ్రద్ధ లేని ప్రభుత్వం అంగన్వాడీలను ఎక్కడికక్కడే నిర్బంధించారని, అరెస్టులకు పూనుకుందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెపి మెటిల్డాదేవి, జి.మల్లేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులను ఖండిస్తూ పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో స్థానిక వినుకొండ రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మెటిల్డాదేవి, మల్లేశ్వరి మాట్లాడుతూ మహాధర్నాకు సంబంధించి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని, సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించామని, అయినా యూనియన్ నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలవలేదని అన్నారు. అంగన్వాడీల అక్రమ అరెస్టులు, నిర్బంధాలు నియంత పాలనకు నిదర్శనమన్నారు. మూడ్రోజులు ముందు నుంచే యూనియన్ నాయకుల ఇళ్ల ముందు పహారా కాసిన పోలీసులు ఎక్కడికక్కడే అంగన్వాడీలను అడ్డుకున్నారన్నారు. ఇంత నిర్బంధం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లతో అంగన్వాడీలు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్‌లలో పనిచేసేందుకే ఎక్కువ సమయం పడుతోందని, సెంటర్ల నిర్వహణ కష్టంగా ఉందని ఆవేదన వెలిబుచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయ నాయక్ మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల పోలీసుల తీరు హేయమన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని ముఖ్యమంత్రికి ధర్నాలను అడ్డుకోవడం, నిర్బంధాలు చేసే హక్కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కంటే మెరుగైన వేతనాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అంగన్వాడీలపై కక్ష సాధింపు చర్యలు రాజకీయ వేధింపులు ఆపకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరు కుమార్, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. యూనియన్ నాయకులు కవిత, బి.నిర్మల, మాధవి, రమణ, కమరున్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - చిలకలూరిపేట : సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ధర్నాకు వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు ఖండించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. యూనియన్ డివిజన్ అధ్యక్షులు జి.సావిత్రి, సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంగన్వాడీలను, సిఐటియు నాయకులు అర్ధరాత్రి పూట అరెస్టు చేయటం ద్వారా ఉద్యమాల్ని అపాలనుకుంటే అది పొరపాటన్నారు. ఇప్పటికే అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా పలు రూపాల్లో నిరసనలు తెలిపారని, విన్నవించారని, అయినా ప్రభుత్వంలో స్పందన లేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా అయినా సమస్యలను చర్చించి న్యాయం చేస్తారని భావిస్తే అర్థరాత్రిళ్లు అరెస్టులు, వాహనాల తనిఖీల ద్వారా నిర్బంధం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాయకులతో చర్చించాలని, సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని కోరారు. కార్యక్రమంలో షేక్ మీరాభి, జి.లక్ష్మీదేవి, విల్సన్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - అమరావతి : అంగన్వాడి వర్కర్స్ ఉద్యమాలని పోలీసు బలగాలతో అణిచివేయాలని ప్రభుత్వం చూస్తోందని సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. జగన్మోహన్ రడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తన పాదయాత్రలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి అణచివేతలకు పాల్పడి ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందని అన్నారు. సమావేశంలో సిఐటియు అధ్యక్షులు షేక్ రఫీ, ఎం.నవీన్, సయ్యద్ మొహిద్దీన్ వలి పాల్గొన్నారు.