Oct 28,2022 22:47

అవగాహన కల్పిస్తున్న జెడ్‌సి కృష్ణ

ప్రజాశక్తి -ములగాడ : సీజనల్‌ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికున్‌ గునియా వంటి ప్రాణంతకర వ్యాధులకు కారణమైన దోమలు, వాటి లార్వాల నుంచి రక్షణ పొందేందుకు ప్రతిశుక్రవారం డ్రైడే పాటించాలని ఐదో జోన్‌ కమిషనర్‌ ఆర్‌జివి.కృష్ణ, 40వ వార్డు కార్పొరేటర్‌ గుండపు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం 40వ వార్డు ఎకేసీ కాలనీ, రాజీవ్‌ కాలనీ, ఎఎస్సీ కాలనీ తదితర ప్రాంతాలలో మల్కాపురం ఏరియా మలేరియా విభాగం, సచివాలయాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రైడే-ఫ్రైడే కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ ఇళ్లు, పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, మూడురోజులకోసారి నీటి నిల్వలన్నీ ఖాళీచేసి, మళ్లీ తాజాగా నీరు నింపుకోవాలన్నారు. దోమల నివారణ చర్యలకు సహకరిస్తే, వ్యాధులన్నీ దూరమైనట్టేనన్నారు. కార్యక్రమంలో జోన్‌ ప్రజారోగ్య శాఖ సహాయ వైద్యాధికారి రాజేష్‌, ఎస్‌ఎస్‌ జనార్ధన్‌, ఎఇ కనకరాజు, జోన్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ నల్ల శ్రీనివాస్‌యాదవ్‌, సూపర్‌ వైజర్‌ దుల్లా శ్రీనివాసరావు, మలేరియా సిబ్బంది లలితకుమారి, శ్రీదేవి, జివిఎంసి, సచివాలయ, వైద్య సిబ్బంది, వాలంటీర్లు ఆశాలు పాల్గొన్నారు.