Nov 01,2022 23:07

  •  జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు
  • ఘనంగా ప్రపంచ ఫొటో జర్నలిజం దినోత్సవ వేడుకలు
  • పది మందికి మెమోరియల్‌ అవార్డ్సు, మరో ఇద్దరికి లైఫ్‌లైమ్‌ ఎచీవ్‌మెంట్స్‌ అవార్డ్సు ప్రదానం

ప్రజాశక్తి-విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మకత , సంస్కృతి సమితి వారి సౌజన్యంతో ఇండియా ఇంటర్నేషనల్‌ పొటో గ్రాఫిక్‌ కౌన్సిల్‌, ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమి ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటో జర్నలిజం దినోత్సవ వేడుకలు స్థానిక బాలోత్సవ్‌ భవన్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమి ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పత్రికల్లో పని చేసే ఫొటో జర్నలిస్టుల ప్రతిభను గుర్తించి, ఇదే రంగంలో నిష్ణాతులు జర్నలిజంలో పేరుగాంచిన వారి పేరు మీద మెమోరియల్‌ అవార్డ్సును పది మంది ఫొటోజర్నలిస్టులకు, అలాగే మరో ఇద్దరు ఫొటో జర్నలిస్టులకు లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డ్సును అందజేశారు. అవార్డ్సు అందుకున్న వారిలో... నీలం రాజు మురళీధర్‌ మెమోరియల్‌ అవార్డును విశాఖపట్నంనకు చెందిన హిందూ పత్రిక చీఫ్‌ న్యూస్‌ పొటో గ్రాఫర్‌ కెఆర్‌ దీపక్‌కు, సి రాఘవాచార్యుల అవార్డును సాక్షి అసిస్టెంట్‌ చీఫ్‌ పొటో గ్రాఫర్‌ వంజా రూబెన్‌ బెసాలిల్‌కు, జి కృష్ణమెమోరియల్‌ అవార్డును అదిలాబాద్‌కుచెందిన ఈనాడు స్టాఫ్‌ ఫొటో గ్రాఫర్‌ పొలమూరు సింహాచలం, మండలి వెంకట కృష్ణారావు మెమోరియల్‌ అవార్డును విజయవాడకు చెందిన ఫ్రీలాన్స్‌ సీనియర్‌ ఫోటోజర్నలిస్ట్‌ సిహెచ్‌ విఎస్‌ విజయభాస్కరరావుకు, విఆర్‌ బ్రహ్మారెడ్డి మెమోరియల్‌ అవార్డును హైదరాబాద్‌కు చెందిన వెలుగు వి-6 తెలుగు డైలీఅండ్‌ న్యూస్‌ ఛానల్‌ సీనియర్‌ న్యూస్‌ ఫొటోగ్రాఫర్‌ ఎన్‌ శివకుమార్‌ మేరు, గోళ్ల రాధాకృష్ణమూర్తి మెమోరియల్‌ అవార్డును విజయనగరంనకు చెందిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ బండలుప్పి జోగారావుకు, పోలవరపు కోటేశ్వరరావు మెమోరియల్‌ అవార్డును విజయవాడ ఈనాడు స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ బండారు మరిడయ్యకు, మోటారు హనుమంతరావు మెమోరియల్‌ అవార్డును హైదరాబాద్‌కు చెందిన ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్ట్‌ ఎం అనిల్‌కుమార్‌కు, జి శ్రీనివాసులు మెమోరియల్‌ అవార్డును హైదరాబాద్‌కు చెందిన సీనియర్‌ పొటో జర్నలిస్ట్‌ ఎ రాధాకృష్ణకు, ఎంఎ రహీంమెమోరియల్‌ అవార్డును సిఎం ఫొటోగ్రాఫర్‌ అనుగుల సతీష్‌కు అందజేశారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్సును వార్త జాతీయ తెలుగు దినపత్రిక సీనియర్‌ న్యూస్‌ ఫోటోగ్రాఫర్‌ ఎం రవీంద్రనాద్‌, హైదరాబాద్‌కు చెందిన ద న్యూ ఇండియన్‌ ఎక్సెప్రెస్‌ చీఫ్‌ న్యూస్‌ ఫొటో గ్రాఫర్‌ ఆర్‌వి కోటేశ్వరరావుకు ఇచ్చారు. అవార్డ్సు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా విచ్చేసిన ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ... సమాజాభ్యున్నతికి, సమాజ మార్పుకు పొటో జర్నలిస్టులు గొప్ప సహకారాన్ని (కంట్రిబ్యూషన్‌) అందిస్తున్నారని, వారందరూ అభినందనీయులని పేర్కొన్నారు. నోబుల్‌ ఫ్రైజ్‌కు సమానమైన ఐఐపిసి ఫొటో జర్నలిస్టు, ఎఫ్‌ఆర్‌పిఎస్‌ టి శ్రీనివాసరెడ్డి మన తెలుగువారు కావడం ఎంతో గర్వించదగిన విషయం అని అన్నారు. ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమి ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు, అంతర్జాతీయ గుర్తింపు కల్గిన ఫొటో జర్నలిస్టు శ్రీనివాసరెడ్డి నేతృతృంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఒక సందేశాత్మకమైన, ఆలోచింప చేసే రీతిలో సమాజం ముందు ఒక మంచి పొటో తీయాలనే ఆతృత (క్యూరియాసిటీ) ఫొటో జర్నలిస్టులకు ఉండాల్సిన ప్రధాన అంశమన్నారు. నలుగురు తియ్యలేని పొటోను తాను తీయాలనే ఆలోచన, అతృత ఉంటే మంచి ఫొటో వస్తుందన్నారు. అంతేగాక తీసే పొటోల్లో కూడా సృజనాత్మకత ఉట్టిపడే విధంగా తీసినట్లయితే పది మంది చూసి ఆనందించడంతోపాటు ఆలోచింప చేస్తుందన్నారు. క్రియోటివ్‌టీతో పాటు నిబద్దత, కష్టపడే తత్వం కూడా ప్రతి పొటోగ్రాఫర్‌కు ఉండాలన్నారు. ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలని గొప్ప ఫొటో గ్రాఫర్‌ నిరంతరం యోచిస్తుంటారని అన్నారు. ఎంత రైటప్‌ ఉన్నా కానీ, మంచి ఇమేజ్‌ ఉండాలన్నారు. ఒక మంచి ఇమేజ్‌ (చిత్రం) ఒక అంశాన్ని చదవాల్సిన పని లేకుండానే పొటోచూస్తే తెలిసే విధంగా ఫొటో ఉంటే అటువంటి ఫొటోగ్రాఫర్లు తప్పని సరిగా రాణించడంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు, మన్ననలు అందుకుంటారని అన్నారు. ఫొటో కింద రాసే ఒకటి, రెండు లైన్లు క్యాప్షన్‌ చాలా మెసేజ్‌ నిస్తుందన్నారు. ఈ అవార్డ్సు స్వీకరించడానికి విచ్చేసిన వారందరూ ఫొటో జర్నలిజంలో మంచి ప్రతిభ, గుర్తింపుకల్గిన వారని, వారందరినీ ప్రపంచ ఫోటోజర్నలిజం దినోత్సవం నాడు అభినందిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ సభాపతి మండలి బుద్దప్రసాద్‌ మాట్లాడుతూ...నిష్ణాతులయిన జర్నలిజంలో పేరుగాంచినవారి పేరు మీద మెమోరియల్‌ అవార్డ్సు అందజేయడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. తనకు వారందరితో పరిచయాలు ఉండేవని, వారి గుర్తింపుగా ఈ వార్డ్సు స్వీకరిస్తున్న వారు కూడా ఆ స్థాయి వారై ఉంటారనే ఉద్దేశ్యంతోనే ఇస్తున్నారని అన్నారు.జర్నలిజంలో కానీ, ఫొటో జర్నలిజంలోకానీ ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఎంఎ రహీం, జి కృష్ణ తదితర అనేక మంది వారి వారి వృత్తిలో నిష్ణాతులుగా నిలిచారని గుర్తు చేశారు. ఫొటో జర్నలిజంలో నోబుల్‌శాంతి బహుమతికి సమానమైన దానిని సాధించుకున్న ఐఐపిసి, ఎఫ్‌ఆర్‌పిఎస్‌ శ్రీనివాసరెడ్డిన అభినందిస్తున్నట్లు తెలిపారు. తానా పూర్వ అధ్యక్షులు (యుఎస్‌ఎ) జంపాల చౌదరి, తెలుగు ఇండియా టుడే విశ్రాంత ఎడిటర్‌ జి రాజశుక తదితరులు మాట్లాడారు. అవార్డుల గ్రహీతలఛాయా చిత్ర ప్రదర్శన ఈ సందర్భంగా విశేషంగా ఆకట్టుకుంది. పొటోజర్నలిజం పితామహుడు అస్కార్‌ బర్నాక్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.