Aug 15,2021 12:36

  • ఈ నెల 19 అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం..

ఫొటోగ్రాఫర్‌ మాత్రమేకాదు వెంకటేష్‌ రంగస్థల నటుడు కూడా.. నాటకాలు అంతరించినా.. గోడకు ఏకపాత్రాభినయ ఫొటోలతో పాటు అతని జులపాలజుట్టు కూడా ఇంకా అలానే వేళాడుతోంది.. వయస్సు 35 ఏళ్లలోపే ఉంటుంది. అతని బక్కపలుచని దేహం ఏ పాత్రకైనా నప్పుతుంది.. వేసిన ప్రతిపాత్రలో ఒదిగిపోతుంది.. నూటముప్పరు రెండుకోట్ల పాత్రల్లో 90 శాతం పేద, మధ్యతరగతి ముఖాలవే కదా...
రేఖలు స్పష్టంగా కనపడుతున్న రెండు అరచేతుల ఫొటోను చూడగానే వెంకటేష్‌కు తన ప్రేమకాలం గుర్తొచ్చింది.. ఆమెకు అతను ఇచ్చిన మొదటి కానుక అది... మూడురోజులపాటు సమ్మక్క, సారక్క జాతర్లో ఫొటోలు తీస్తున్నాడు వెంకటేష్‌... తన స్నేహితురాళ్లతో కలిసి ఆ జాతరకొచ్చిందో అమ్మారు.. వెంకటేష్‌ను దాటి ముందుకెళ్లి మళ్లీ ఒక్కడుగు వెనక్కేసి 'బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలే తీస్తవా' అంది అతని ముఖంలోకి చూస్తూ.. ఆమె అలా అనగానే స్నేహితురాళ్లు పకపకా నవ్వారు..
ఇంటికెళ్లాక కెమెరా శుభ్రం చేస్తుండగా.. ఆమె మాటలు, ఆమె స్నేహితురాళ్ల నవ్వు వెంకటేష్‌ చెవుల్లో ధ్వనించారు... కెమెరా అక్కడ పెట్టి లేచి అద్దంలో చూసుకున్నాడు... బ్రష్‌తో ముఖానికి రంగేసుకొని తృప్తిపడ్డాడు. ఆ తరువాత చేతులు చూసుకుంటూ ఉసూరుమన్నాడు.
గుడిసె అక్కడక్కడ కురుస్తోంది.. బయట వర్షం నోరుతెరిచి అరుస్తోంది.. 'అమ్మా నేనెందుకే కర్రిగున్నా.. అని తల్లినడిగాడు.. 'ఒక్క నువ్వేనా అగో.. మీనాయిన, మీ తాత మొత్తం మన వంశపురంగే అంత, నలుపు మన గుర్తింపు... మనదే ఈ దేశపు అసలు రంగు.. అంటూనే నీ చెవి ఇటుపడెరు' అన్నట్టు సైగ చేసేసరికి వెంకటేష్‌ ఆసక్తిగా ముందుకు వంగాడు.. 'తెలుపు, ఎరుపు గోధుమ రంగోళ్లంతా ఇంగిలీసోడికో.. డచ్చోడికో.. ఎవడికి పుట్టారో తెలియని సంకర రకాలు' అంది... ఢాం అని పెద్ద ఉరుము శబ్దం వినపడటంతో... అర్జున, అర్జునా అని అరిచారెవరో..
ఆ మరుసటిరోజు జాతరలో రంగు రంగుల పూలపూల డ్రెస్‌ వేసుకున్నాడు వెంకటేష్‌.. బారు జెడ చేతిలో పట్టుకొని వడిసెల తిప్పినట్టు తిప్పుకుంటా వస్తూ.. దూరం నుంచే అతన్ని ఓరకంట చూస్తోంది నిన్న కనిపించిన అమ్మారు.. అతన్ని దాటుకొని వెళ్లి ఆగింది.. శరీరం కదల్చకుండానే మెడ వెనక్కి తిప్పి వెంకటేష్‌ను చూస్తూ 'కలర్‌ ఫొటోలూ తీస్తావన్నమాట' అంటూ అప్పటివరకూ చేతిలో ముందున్న జడను విసురుగా వెనక్కు తోసేసరికి ఆమె జడగంటలు అతని గుండెకు తాకారు..
వెళ్తోన్న ఆమెకు వినబడేలా 'పిల్లా' అని అరిచాడు.. అదివిని ఆమె వెనక్కు తిరిగింది.. ఏంటీ అన్నట్టు ఆగి చూస్తుండగా నీపేరేంది అని అరిచాడు వెంకటేష్‌.. 'పిల్లా అనే పిలుచుకో బానే ఉంది' అంటూనే అటుగా వస్తోన్న ఇంకో అతని జేబులో పెన్ను చేతిలోకి తీసుకుంది.. అటు తిరిగి వెళ్లిపోతుండటంతో 'హే..చెప్పి వెళ్లు' అని మరింత గట్టిగా అరిచాడు వెంకటేష్‌.. ఆమె అతనివైపు తిరుగుతూ తన అరచెయ్యి చూపింది.. దానిపై పద్మ అని రాసుంది... అలా ఆ సంతలో వెంకటేష్‌ తననుండి తాను తప్పిపోయాడు.. జాతర వాళ్లిద్దరి మధ్య ప్రేమకు ఆ తర్వాత పెళ్లికి కారణమయ్యింది..
మరుసటి రోజు.. భుజాన కెమెరా బ్యాగుతో రమణగుట్ట దిగుతున్నాడు వెంకటేష్‌. 'ఈసారి ఫొటో కాంపిటీషన్లో ఈ మెట్లు ఫొటోతీసి 'ఎ హైట్‌ గ్యాప్‌ అనో, బిట్వీన్‌ ద రిచ్‌ అండ్‌ పూర్‌'..అనో క్యాప్షన్‌ పెట్టాలి అని మనసులో అనుకుంటూ..దిగుతున్నాడు..
కూలి పనులు చేసుకొనే పేదలు.. నేలమీద గజం భూమి కొనలేని బడుగు బలహీన జనాలకు ఆ గుట్ట ప్రత్యామ్నాయం.. గుట్ట మీద ఆరేడు వందల ముఖాలున్నా.. అదేం చిత్రమో అందులో ఒక్క అగ్రకుల ఫొటో కూడా ఉండదు..
'ఏం పోగ్రాం బిడ్డా అని ఎవరో మందలిస్తే..'పెండ్లి పోగ్రాం బాబారు' అనుకుంటూ గుట్ట మెట్లు దిగుతున్నాడు.. వెంకటేష్‌ చెన్నరు దగ్గర పల్లెటూరు నుండి బతుకు తెరువుకోసం పదేళ్ల క్రితమే ఇక్కడికొచ్చాడు. అందుకే అతని మాటలో తమిళ యాస ఉంటుంది.
అతను వెళ్లినచోట పెళ్లివారిల్లు యమా కలర్‌ఫుల్‌గా ఉంది.. 'స్మైల్‌ ప్లీజ్‌' కంటికి కెమెరా అడ్డం బెట్టుకుంటూ తనపనిలో నిమగమయ్యాడు వెంకటేష్‌...
ఆ రాత్రి.. చాపమీద పడుకున్నారు. వెంకటేష్‌కు చెరోపక్క ఇద్దరు కూతుర్లు, ఆ పక్కనే భార్య పద్మ పడుకుంది.. ఎఫ్‌ఎంలో నుంచి హిందీ సినిమా పాటలు మంద్ర స్వరంతో వినవస్తున్నారు...
'నాన్నా స్కూల్‌ ఫీజ్‌ వారంరోజుల్లో కట్టకపోతే ఆన్‌లైన్‌ క్లాస్‌లకు అలో చెయ్యమని టీచర్‌ వార్నింగ్‌ ఇచ్చారు' అని ఐదో తరగతి చదువుతున్న పెద్దకూతురు అతనిమీద చెయ్యేస్తూ అంది.. సరే అమ్మా అని అంటుండగా..'నాన్నా నాబర్త్‌ డే ఇంకో టెన్‌ డేసే ఉంది.. మంచి డ్రెస్‌ తీసుకుంటావా' అని గారాలుపోతూ అంది చిన్న కూతురు.. తనకు సమాధానం చెప్పబోతుండగా.. 'ఇప్పటికే రెండు నెలలు బాకీ ఉన్నాం.. కిరాణా కొట్టు బాబారు ఆగేటట్టు లేడు.. పాలోడైతే మరీ పరువు తీస్తున్నాడు'.. అంది భార్య అటువైపు తిరిగి చేతులు తలకింద పెట్టుకుంటూ.. తనకేం సమాధానం చెప్పకపోవటంతో చిన్న కూతురు అతనివంక సీరియస్‌గా చూసింది.. ఆమె చూపులో భావాన్ని గ్రహించి 'ఓకే' అని తలాడిస్తూ తనని నవ్వించే ప్రయత్నం చేశాడు..
'కుంభరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది.. రాబోయే కాలమంతా పట్టిందల్లా బంగారం'.. అని టీవీలో రాశిఫలాలు చెబుతున్నారు.. పిల్లలు హోంవర్క్‌ చేసుకుంటూ..' నాన్నా నీది కుంభరాశే కదూ' అన్నారు.. భార్య వంటింట్లో టీ చేస్తోంది.. తలస్నానం చేసినట్టున్నాడు వెంకటేష్‌.. అతని పొడవు జుట్టు ఫ్యానుగాలికి ఎగురుతోంది.. చొక్కా వేసుకుంటూ.. 'కరోనా వల్ల పోయినేడంతా పనిసాగక అందరికీ అప్పు పడ్డాం.. వచ్చేది పెండ్లిళ్ల సీజనే.. ఇవ్వాళ రేపట్లో ఆర్డర్లు మొదలైతరు.. అన్ని బాకీలూ తీరుద్దాం అన్ని ఖర్చులూ ఎల్లదీద్దాం' అని భార్యతో అన్నాడు..
'లాక్‌ డవున్‌ మళ్లీ ఏస్తే'.. అని పద్మ అంటుండగా పాప హాచ్‌మని తుమ్మింది.. ఆఖరు గుండీ పెట్టుకుంటున్న వెంకటేష్‌ 'దివాళ తీయటం అంటే గవర్నమెంటుకు కూడ తెలిసొచ్చింది.. ఇంకోసారి లాక్‌డవున్‌ పెట్టదు... కరోనా తోటి సహజీవనం తప్పదని కూడా చెబుతున్నారుగా' అన్నాడు..
కెమెరా బ్యాగు భుజాన తగిలించుకొని గుట్ట దిగుతున్నాడు వెంకటేష్‌.. 'ఏం పోగ్రాం కొడుకా' అని ఎవరో అడిగేసరికి 'పుట్టిన రోజు పోగ్రాం' అమ్మా అనుకుంటా ముందుకుపోయిండు..
'స్మైల్‌ ప్లీజ్‌'.. అంటూ తాను ఫొటో తీయబోతున్న వాళ్ల ముఖాల్లో నవ్వు పువ్వు పూయించే యత్నం చేస్తున్నాడు వెంకటేష్‌..
ఇంట్లో.. కట్టెలపొయ్యిమీద అన్నం వండుతోంది పద్మ.. చిన్న కూతురు అతని భుజమ్మీద చేతులేసి ఉయ్యాలూగుతోంది.. పెద్ద కూతురు ఏదో పనిలోఉంది.. ఇంతలో టీవీలో బ్రేకింగ్‌ సౌండ్‌తో 'రాష్ట్రంలో రేపటి నుంచి లాక్‌ డవున్‌'.. అని చెబుతుండేసరికి షాక్‌కు గురయ్యాడు వెంకటేష్‌.. న్యూస్‌ యాంకర్‌ వార్తలు చెప్పుకుపోతోంది.. వెంకటేష్‌ భార్య భయం భయంగా టీవీవైపు చూస్తోంది.. ఇంతలో అన్నం పొంగి పొయ్యిపాలయ్యింది..
తెల్లారి యధాప్రకారం కెమెరాబ్యాగు తగిలించుకొని 'పోయొస్తా' అని చెప్పుకుంటా గడపదాటుతుండగా 'గీ లాక్‌ డవున్ల యాడికి పోవుడూ' అని అతని భార్య అడిగేసరికి 'V్‌ా్మ'.. అని నిట్టూర్చాడు వెంకటేష్‌.. గుట్ట మెట్లు దిగుతున్నా ఆరోజెవరూ పలకరించలేదు..
మెయిన్‌ రోడ్‌లో హ్యాప్పీ స్టుడియో వెలవెలబోతోంది.. లోపల స్టాండ్‌ లా, బేబీ లైట్‌లా. కర్టెన్‌లా ఒక్కడే కూర్చొని ఉన్నాడు వెంకటేష్‌.. డార్క్‌ రూంని మించిన డార్క్‌నెస్‌ అతని మనసులో ఆవరిస్తోంది..
ఇంటికొచ్చేసరికి చిమ్మ చీకటిగా ఉంది.. 'కరెంటు బిల్‌ ఆదా చేస్తున్నారు.. ఆ డబ్బుతో కారు కొనొచ్చు' అని అంటుండగా..'అంత సీన్‌ లేదు' అని అంది చిన్న కూతురు.. 'ఏం' అని అన్నాడు వెంకటేష్‌.. 'ప్యూజ్‌ పీక్కెళ్లారు.. నీ మొఖం అందంగా ఉంటుంది కదా.. చూస్తారట.. రేపొకసారి వాళ్లాఫీసుకు రమ్మన్నారు..' అని అంది పెద్ద కూతురు.. 'ఇంగో గివి దీస్కపోయి కరెంట్‌ బిల్‌ కట్టు' అంటూ తన చెవి దిద్దులిచ్చింది అతని భార్య..
మరుసటి రోజు..'లాక్‌ డవునేకదా.. ఇక్కడేం చేద్దాం.. మా ఊరెల్దాం' అని అన్నాడు వెంకటేష్‌.. 'ఎన్నాళ్లని ఎల్తాం ఊరు.. ఇక్కడ ఇంటద్దె, షాప్‌ అద్దె కట్టాల్సిందేకదా'.. అని అందామె.. 'తిండికి కూడా ఇబ్బందైతంది కదా'.. అని అతనన్నాడు...
'వచ్చేయండిరా బిడ్డ మీకోసమే ఎదురు చూస్తున్న, కలోగంజో తిని బతుకుదాం' అని వెంకటేష్‌ తల్లి ప్రేమగా అంది... పిల్లలు పల్లెలో ప్రశాంతతని అనుభవిస్తున్నారు.. ఆ ఊరి తమిళ్‌ సంప్రదాయ కట్టు బొట్లు వింతగా ఉన్నారు.. బయటికెళ్లొచ్చిన వెంకటేష్‌తో తమిళ్‌లో ఏదో ప్రశ్నించింది పెద్ద కూతురు.. అది విని ఆశ్చర్యపోయాడతను.. పిల్లలు తల్లి దండ్రులవద్ద పడుకున్నారు.. గదిలో వెంకటేష్‌ పద్మ పడుకున్నారు.. ఆమె అతని దగ్గరికి జరుగుతూ చెవిలో ఏదో అడిగింది గుసగుసగా.. భార్య కూడా తమిళ్‌ నేర్చుకునే సరికి మరింత షాక్‌ అయ్యాడు వెంకటేష్‌.. వారం రోజుల తరువాత ఒక రోజు అతని తల్లికి విపరీతమైన జ్వరమొచ్చింది.. పరీక్షించిన ఆర్‌ఎంపీ డాక్టర్‌.. అర్జంట్‌గా సిటీకి తీసుకెళ్లండి అని తొందరపెట్టాడు.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండటంతో.. తన మెడలో తాళిబొట్టు తీసిచ్చింది పద్మ..
మరుసటి రోజు ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాడు వెంకటేష్‌.. అతని భార్య ఒట్టి టీ గ్లాస్‌ చేతికిచ్చేసరికి.. టీ ఏది అని అడిగాడు.. ఆమె కళ్లెత్తి చూడలేదు.. కిందకు చూస్తూనే తమిళ్‌లో ఏదో అంది.. పార్శిగుట్టకొచ్చేశాం అన్నాడతను.. కిందికి వెళ్లేందుకు గుట్ట మెట్లు దిగుతుండగా.. 'పాతబాకీ చెల్లు చేసేదాక పాలుపోయనన్నాడు.. అని ఇందాక అతని భార్య చెప్పిన మాటలు చెవుల్లో ధ్వనించాయి..
స్టుడియోలో కూర్చోనుండంగ.. సెల్లు రింగ్‌ అయ్యింది...పెండ్లి ఆర్డరేమో అని ఆశగా ఫోన్‌ ఎత్తిండు.. 'స్టుడియో ఎక్విప్‌మెంట్‌ కొనేటందుకు డబ్బు తీసుకున్నవ్‌.. కిస్తీలు కడతలేవ్‌.. గిట్లైతే అచ్చి సామానేస్కపోత'.. అని అప్పిచ్చినతని హెచ్చరిక వినిపించింది.. అది కట్‌ చేసి పక్కన పెట్టాక కొద్దిసేపటికి ఫోన్‌ మళ్లీ రింగయ్యింది.. లిఫ్ట్‌ చేయగానే.. 'మడిగె కిరాయి మూడు నెలల్నుంచి కడ్తలేవు.. గీ పస్టుకు గిన కట్టకపోతే మంచిగుండది చెప్తన్న' అంటూ ఓనర్‌ వార్నింగ్‌ వినిపించింది..
ఆ సాయంత్రం గుట్ట మెట్లెక్కుతుంటే ఫోన్‌ రింగయ్యింది.. జేబులో నుంచి బయటకు తీసి లిఫ్ట్‌ చేస్తే.. 'నా ఇంటి అవసరాల నిమిత్తం అని ప్రాంసరీ నోటు రాసిచ్చావ్‌.. ఇందుకు సాక్షులు ఎద్దుమూతి ఎంకన్న, పిల్లితోక రాములు అన్నావ్‌, నూటికి రెండు రూపాయల వడ్డీతో ఎప్పుడు తీరుస్తావయ్యా.. నా రెండు లక్షల అప్పు'.. అని ఎవరిదో గొంతు వినిపించింది.. కట్‌ చేసి జేబులో వేసుకొని ఇంటికి వెళ్లి చొక్కా విప్పుతుండగా.. పిల్లల మొఖాలు విచారంగా ఉన్నట్టు అనిపించింది.. 'ఏమైందమ్మా.. అందరూ ఎట్లనో ఉన్నరు.. కొంపదీసి గా సీరియల్‌ అయిపోయిందా'.. అని అంటుండగా.. 'నోటికొచ్చిన బూతులు తిట్టి.. ఇప్పుడే వెళ్ళారు కిరాణ కొట్టోళ్లు..' అంది వెంకటేష్‌ భార్య జెడ కొప్పుచుట్టుకుంటూ.. ఆమె అలా అంటుండగా పిల్లల కళ్లల్లో నుంచి కన్నీరు కారుతుంటే వెంకటేష్‌ వాళ్ల దగ్గరికెళ్లి కన్నీరు తుడుస్తూ..'స్మైల్‌'.. అంటూ నవ్వించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవటంతో.. వాళ్ల నోటిని నవ్వు షేప్‌లోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాడు..
అందరూ చాపమీద పడుకున్నారు.. ఆరోజు ఏ ఒక్కరిలోనూ నవ్వు భంగిమలేదు.. ఇంతలో వెంకటేష్‌ భార్య మాట్లాడటం మొదలుపెట్టింది.. 'తాళిబొట్లు, ఉంగరాలు అన్నీ తాకట్టు పెట్టేశావ్‌.. నేను, పిల్లలు ఇంక మేమే మిగిలాం'.. అని అంటుండటంతో వెంకటేష్‌ బాధతో విలవిల్లాడాడు.. తనకేదో చెప్పేందుకు నోరు తెరుస్తుండగా.. 'ఇద్దరూ ఆడపిల్లలే పుట్టటం నీకు మేలే అయ్యింది'.. అని అంది.. ఆమె అలా ఎందుకు అన్నదో అని ఆలోచిస్తుండగా.. 'మమ్మల్ని తాకట్టు పెట్టకు' అంది.. 'ఉఫ్‌'.. అని నిట్టూరుస్తుండగా.. 'పూర్తిగా అమ్మేరు, మేం అనుకోవట్లేదు.. మళ్లీ నీదగ్గరకు రావాలని' అని కటువుగా అంటూ అటువైపు తిరిగింది...
అందరూ నిద్రపోయాక వెంకటేష్‌ లేచి నిలుచున్నాడు..గోడమీద తగిలించి ఉన్న తన నాటక ఫొటోల మీదుగా అద్దంలోకి చూస్తున్నాడు.. అతని ముఖమూ విచారంగానే ఉండటంతో.. మరింత దగ్గరికెళ్లి.. 'స్మైల్‌' అన్నాడు.. భంగిమ మారకపోవటంతో 'స్మైల్‌ ప్లీజ్‌' అన్నాడు.. అయినా లాభంలేకపోవటంతో.. సొరుగులోనుంచి లిప్‌స్టిక్‌ తీసి అద్దంమీద దిద్దాడు.. కొంతసేపటి తరువాత అద్దంలో అతని ముఖం జోకర్‌లా అనిపించింది.. కానీ స్మైల్‌ రాలేదు.. 'నేను చేతగానోడ్నికాదు.. నన్ను చేతగానోడిగా మార్చిందీ లాక్‌డవున్‌ అని గట్టిగా అరిచాడు'..
ఆ ఉదయం.. మెట్ల వైపు నడుస్తుంటే ఏడుస్తున్న పిల్లలు అతన్ని చూసి ఏడుపు మరుస్తున్నారు.. ఇంకొందరు వింతగా చూడసాగారు.. మెట్ల మధ్యకు వచ్చాక అతను.. ఒక కాలు కొద్దిగా మడిచి మరోకాలు నిటారుగా నిలిపి రెండు చెతులూ గాల్లోకెత్తాడు.. ఒక సిగరెట్‌ తీసి వెలిగించి.. మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్‌ కోసమన్నట్టుగా తోచిన స్టెప్పులు వేస్తున్నాడు.. అలా అతను గతంలోకెళ్లాడు..
అతని చిన్నప్పుడు.. పిల్లలు మైదానంలో క్రికెట్‌ ఆడుతున్నారు.. వెంకటేష్‌ ఫెన్సింగ్‌కు అవతలనుండి చూస్తున్నాడు.. కొట్టిన షాట్‌కి వాళ్లబంతి దొర్లుకుంటూ ఫెన్సింగ్‌ దగ్గరికొచ్చింది.. దాన్ని వాళ్లకు అందిచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. 'ముట్టుకోకు' అన్న అరుపు వినపడింది.. వెంకటేష్‌ అటువైపు చూడగా ఒక పిల్లోడు 'చెప్పులు కుట్టుకునేవాడి కొడుకువి, డప్పు కొట్టుకొనేవాడి మనవడివి నువ్వు మా బాల్‌ ముట్టుకోకూడదు' అని హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు.. ఆ సాయంత్రం వెంకటేష్‌ తండ్రి చెప్పు కుడుతుండగా, తాత డప్పుకు నిప్పు కాపుతున్నాడు.. దిగులుగా కూర్చున్న వెంకటేష్‌ను చూస్తూ 'ఊకోరా.. కడజాతోడివి కనుకే కంచీకడున్నావ్‌ లేకుంటే ఆళ్లతోనే ఆడకపోదువా.. అయినా ఈరాతలు ఇప్పటియి కాదులేరా... ఆపిల్లల మీద పగపెట్టుకోబాక.. కోడి, మేక నరాలు కోసినట్టు మనకుతి్తక కోసి ఆళ్ల కులాలకు బలిచ్చినట్టున్నార్రా.. మనతలలు అందుకే కిందికి వేళాడుతున్నారు, తలల్ని తిట్టుకోటం కాదు తలరాతల్ని మార్సుకోవాలి.. అటొక చెప్పు ఇటొక చెప్పు కుత్తికెకు కుట్టుకోనైనా సరే మన తలల్ని ఎర్రజెండాల్లా ఎగరేయ్యాల్రా'..అన్నాడు.. తాత మాటలు అర్థమయ్యే వయస్సు కాదు కనుక ఆ మాటలు అతని బాధను పోగొట్టలేకపోయారు.. విచారంతో నడుస్తుండగా ఒక చెత్త కుండీ ముందు దిబ్బలో ఎవరో పారేసిన జోకర్‌ బొమ్మ కనపడింది.. దానిని చూడగానే అతనిలో దిగులు ఎగిరిపోయింది. పెదవుల్లో నవ్వు అలుముకుంది.. ఆ తరువాత ఆ జ్ఞాపకాల్లో నుంచి బయటికొచ్చాడు వెంకటేష్‌..
సన్నగా వర్షం మొదలయ్యింది.. ఉన్నట్టుండి చొక్కా గాల్లోకి విసిరేసి.. ఒక స్లోగన్‌ బోర్డ్‌ చేతుల్లోకి ఎత్తి పట్టుకొని మెట్ల మీదుగా పరుగుతీశాడు.. కొద్దిసేపటి తరువాత అతను స్టుడియో ముందు నిర్జీవ స్థితిలో పడిపోయి ఉన్నాడు.. అతని పక్కనే 'సేవ్‌ స్మైల్స్‌, సేవ్‌ ఫొటోగ్రాఫర్స్‌, సేవ్‌ పూర్‌ పీపుల్‌' అనే బోర్డులు పడి ఉన్నాయి.. లాక్‌ డవున్‌ సడలింపు టైం కావటంతో దారిన పోతున్న వాళ్లు అక్కడ ఆగుతున్నారు.. కొందరు గొడుగులు, కొందరు ప్లాస్టిక్‌ కవర్లు వేసుకొని ఉన్నారు.. వాళ్ల చూపులు ఆబోర్డుల మీద కాకుండా అతని వేషం మీద పడుతుండడంతో.. అందరూ నవ్వుతున్నారు.. కానీ మన పెదవుల్లో నవ్వు మొలిపించటం అంటే.. చీకటింట్లో దీపం వెలిగించటం... ఈసారి జాగ్రత్తగా గమనించండి.. మన కుటుంబ నవ్వుల చిత్రం కోసం కెమెరా వెనుక దాక్కునే ఫొటోగ్రాఫర్‌ ముఖంలో అనందముందో.. లేదో..
కరోనా అతన్ని వృత్తికి అంటరానోడిని చేసింది.. బతుక్కి అంటరానోడిని చేసింది.. పేదోళ్ల ఆకలికి, కనీసావసరాలకు కూడా లాక్‌డౌనుంటే ఎన్ని వృత్తి జీవితాలు బతికేవో..!
 

శ్రీనివాస్‌ సూఫీ..
93466 11455