ప్రజాశక్తి - కలెక్టరేట్ : సృష్టికి ప్రతిసృష్టిగా ఫొటోగ్రఫీ నిలుస్తుందని, చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచిపోతుందని శాసనమండలి సభ్యురాలు వరుదు కల్యాణి అన్నారు. శుక్రవారం విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, వైజాగ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్‌లు సంయుక్తంగా రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ అవార్డు గ్రహీతలను అతిథుల చేతులు మీదుగా సత్కరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అత్యంత శక్తివంతమైనదని, అత్యంత కీలకమైనదని, వృత్తి ధర్మంతో కూడుకున్నదని, రాత్రికి రాత్రే ఎంతో మంది తలరాతలు మార్చేటటువంటిదని అన్నారు. రాత్రీ, పగలూ తేడా లేకుండా కుటుంబాలను సైతం పక్కన పెట్టి ఫొటో జర్నలిస్టులు అన్ని కార్యక్రమాలకూ హాజరై సేవలందిస్తున్నారన్నారు. వారికి నచ్చిన, మెచ్చిన ఫొటో దొరికే వరకూ తగ్గేదేలే.. అన్నట్లు పనిచేస్తారన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జివిఎంసి కమిషనర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో ఫొటో జర్నలిస్టులు పాత్ర అత్యంత ప్రశంసనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఫొటోగ్రఫీ దోహదం చేస్తుందన్నారు. అహోరాత్రులు శ్రమించి పనిచేసే ఫొటో జర్నలిస్టులను సత్కరించుకోవడం అభినందనీయమన్నారు. అందరి సహకారంతోనే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రధానంగా ప్లాస్టిక్ నియంత్రణకు నగర ప్రజల సహకారం అద్భుతమని కొనియాడారు. 26న సాగర తీరంలో వేలాది మంది వాలంటీర్లతో ప్లాస్టిక్ నియంత్రనకు సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ నిరంతరం ఫొటోగ్రాఫర్లతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా ఫొటో జర్నలిస్టులకు తమ ఫోరం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గౌరవ అతిథులుగా హాజరైన జనసేన డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బొడ్డేపల్లి రఘు, వైసిపి నేత కాయల నూరారెడ్డి తదితరులు అవార్డులు అందుకున్న ఫొటో జర్నలిస్టులను అభినందించారు. విజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్, కార్యదర్శి దాడి రవికుమార్, ఫొటో జర్నలిస్టుల అసోషియేన్ అధ్యక్షులు పిఎన్.మూర్తి, కార్యదర్శి తిరుపతిరావు, ఫోరం కార్యవర్గ సభ్యులు ఈరోతి ఈశ్వరరావు, పి.దివాకర్, ఎమ్‌ఎస్‌ఆర్.ప్రసాద్, దొండ గిరిబాబు, సనపల మాధవరావు, గయాజ్, శేఖర్ మంత్రి పాల్గొన్నారు.
అవార్డు గ్రహీతలకు ఘన సత్కారం
జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డుల గ్రహీతలు పి.లీలామోహన్, ఎమ్‌డి సవాజ్, జె.అప్పలనాయుడు, దీపక్, వి.పెద్దిరాజులను ఈ సందర్భంగా సత్కరించారు. తొలుత ప్లాస్టిక్ నియంత్రణకు సంబంధించి కమిషనర్ అధ్వర్యంలో జర్నలిస్టులు గుడ్డ సంచులను ఆవిష్కరించారు.










