ప్రజాశక్తి - బాపట్ల రూరల్
సింగపూర్‌లో 2022 డిసెంబర్‌లో నిర్వహించిన ఏషియన్ ఫోటో పెస్టివల్‌లో మండలంలోని ముత్తయపాలెంకు చెందిన ఫోటో గ్రాఫర్ పివిఎస్ నాగరాజు బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారు. తాను అవార్డు అందుకున్న విషయాన్ని విలేకరులకు శనివారం తెలిపారు. మొత్తం 3వేల ఫోటోల్లో మొదటి 40ఎంపిక జరిగిందని తెలిపారు. అందులో తాను 24వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా తాను తీసిన ఫోటోకు ఓటు వేసి ప్రోత్సహించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాగరాజుకు అభినందనలు తెలిపారు. సాధారణంగా ఫోటోగ్రఫీ అనేది ఒక వృత్తి. కానీ ఫోటోగ్రఫీని స్ఫూర్తిగా తీసుకొని దాన్ని ఒక కళగా భావిస్తు, భిన్నమైన ఫోటోలను తీయటమే ఇష్టంగా నాగరాజు మార్చుకున్నారు. ఫోటోగ్రఫీలో ఎన్నో అవార్డులు సాదించి బాపట్ల కీర్తిని ఇనుమడింప చేస్తున్నాడు. తన ఫోటోల ద్వారా ప్రపంచవ్యాప్తంగా బాపట్లకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో ఆయన తీసిన ఫోటోలకు 150అవార్డులు దక్కాయి. ఎపి ఫోటోగ్రఫీ అకాడమీ, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, నేపాల్, సింగపూర్, ఫ్రాన్స్, కెనడా, చైనా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, కలకత్తా, బెంగళూరు, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.










