Mar 04,2022 07:06

    జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ ఫోకస్‌ పేపర్‌ 2022-23ను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తమ ప్రభుత్వ విధానంగా ప్రకటించిన గ్రామ స్థాయి సంస్కరణలు ఎవరికి మేలు చేకూర్చడానికోనన్న సందేహాలు కలుగుతున్నాయి. సాధారణంగా ఫోకస్‌ పేపర్‌లో సంబంధిత రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అనుసరించవలసిన వ్యూహం, అందుకు ప్రభుత్వాలు, బ్యాంకులూ చేపట్టవలసిన చర్యలను నాబార్డు సూచిస్తుంది. అయితే, వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో సన్న చిన్నకారు రైతులను, కౌలుదార్లను ఆదుకోవడానికి సంబంధించి పటిష్ట చర్యలు ప్రకటించడం, వాటి అమలుకు గట్టిగా కృషి చేయవలసిందిపోయి రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాధాన్యతలను ఎంచుకోవడం విజ్ఞత అనిపించుకోదు. ఇంకా చెప్పాలంటే సర్కారు గురి (ఫోకస్‌) మళ్లినట్టు భావించవలసి వస్తుంది.
     వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామంటూ ఆర్‌బికెల స్ధాయిలో డ్రోన్లు తీసుకు వస్తామని, వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామ స్ధాయిలోనే అభివృద్ధి చేస్తామనీ ముఖ్యమంత్రి ఘనంగా చెప్పారు. ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు, గౌడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటుతో పాటు వ్యవసాయ ఉపకరణాల్లాంటివి ఏర్పాటు చేస్తామన్నారు. గంటకు పదెకరాలు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో పురుగు మందు చల్లడం, ఇతర ఆపరేషన్లు చేసే డ్రోన్లను ఎవరు వాడగలరు? భూస్వాములు లేదా భూఖండాలను లీజుకు తీసుకుని పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ఆసాములకు తప్ప సాధారణ రైతాంగం వీటితో ఏం బావుకుంటుంది? గత ప్రభుత్వం 'రైతు రథం' పేరిట తెచ్చిన పథకం తమ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు ఎలా 'ఉపయోగ పడిందో' చూశాం. ఉమ్మడి రాష్ట్రంలో కంబైన్‌ హార్వెస్టర్లు, ఇతర యాంత్రీకరణ పథకాలూ ఎవరికి లబ్ధి చేకూర్చాయో జగద్వితమే! నిజానికి ఆధునిక యంత్రాలు, కోల్డ్‌ స్టోరేజి వంటి మౌలిక సదుపాయాలు వినియోగించుకోవాలంటే సహకార వ్యవసాయ పద్ధతులను ముందుగా అమలు లోకి తేవాలి. అప్పుడు మాత్రమే సన్న చిన్నకారు రైతాంగానికి లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రంలో సహకార పరపతి సొసైటీలే శల్యావస్థలో వున్న నేపథ్యంలో వాటికి జవసత్వాలు కల్పించేందుకు సర్కారు తీసుకున్న చర్యలు పూజ్యం.
    కరోనా వేవ్‌ల ప్రభావంతో రైతులు ఆర్థికంగా చితికిపోయి పంటల సాగుకు పెట్టుబడులు వెతుక్కుంటున్న సమయంలోనే రాష్ట్రంలో వ్యవసాయ రుణ వితరణ తగ్గిపోవడం బాధాకరం. ఈ ఏడాది ఖరీఫ్‌లో బ్యాంకులు నిర్దేశించుకున్న సాగు పరపతి లక్ష్యంలో రూ.16 వేల కోట్లు పంపిణీ చేయలేదు. భూమిపై వాస్తవంగా శ్రమ చేసే కౌలు రైతులకు పరపతి మరీ తక్కువగా ఉంది. లక్షలాదిగా కౌలు రైతులుండగా, సర్కారు నాలుగు లక్షల వరకు పంట సాగుదారు హక్కు (సిసిఆర్‌సి) కార్డులివ్వగా, కేవలం 83,435 కార్డుదారులకు రూ.871 కోట్లు రుణమిచ్చారు. కొన్నేళ్లుగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) పంట రుణ లక్ష్యంలో పది శాతం కౌలు రైతులకు కేటాయిస్తూ వచ్చారు. గతేడాది ఆ ఆనవాయితీ తప్పింది. ఖరీఫ్‌, రబీ కలుపుకొని పంట రుణాల లక్ష్యం రూ.94 వేల కోట్లు కాగా కౌల్దార్లకు రూ.9,400 కోట్లు ప్రతిపాదించాల్సి ఉండగా రూ.6,500 కోట్లకు తగ్గించారు. 2021-22లో మొత్తం పంట రుణాల లక్ష్యం రూ.1.10 లక్షల కోట్లకు పెరగ్గా, కౌలు రైతులకు కేటాయింపు రూ.4,100 కోట్లకు దిగజారింది. మొత్తంగా ఇచ్చింది రూ.996 కోట్లు. గ్రామ సీమల అభివృద్ధికి సన్న చిన్నకారు రైతులు, కౌలుదార్లకు వ్యవసాయ, అనుబంధ వృత్తుల్లో అవసరమైన చేయూతనిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తన విధానాలను పునర్నిర్ణయించుకోవడం అవసరం. ఆ వైపు గురి (ఫోకస్‌) పెట్టకపోతే వ్యవసాయ రంగం లోతైన సంక్షోభంలో కూరుకుపోయి, గ్రామ సీమలు మరింత కళా విహీనమయ్యే ప్రమాదముంది. వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఉన్నప్పుడు 'ఫోకస్‌' తప్పితే పర్యవసానాలు తొలుత గ్రామీణ ప్రజానీకానికి, ఆ తరువాత మొత్తం రాష్ట్రానికి నష్టదాయకంగా పరిణమిస్తాయని సర్కారు గమనించాలి.