ప్రజాశక్తి - యంత్రాంగం
ఆరిలోవ : ముడసర్లోవ రిజర్వాయర్‌పై నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం మేయర్ గొలగాని హరివెంక కుమారి, డిప్యూటీ మేయర్ శ్రీధర్, జివిఎంసి కమిషనర్ రాజాబాబుతో కలిసి సందర్శించారు. ఈ నెల 28, 29 తేదీల్లో జి-20 సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో నగరానికి వచ్చే విదేశీ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును సందర్శించనుండటంతో మంత్రి ముందుగా పరిశీలించారు. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు విధానాన్ని, దానిని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ తదితర విషయాలను ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ పనులను పరిశీలించి, పనులు త్వరిత గతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
స్కాడా వాటర్ మానిటరింగ్ సిస్టమ్ పరిశీలన
కంచరపాలెం : జివిఎంసి 51వ వార్డు పరిధి రవాణాశాఖ కార్యాలయం సమీపంలో ఉన్న పంప్ హౌస్‌ను విదేశీ ప్రతినిధులు వీక్షించనున్న నేపథ్యంలో స్కాడా వాటర్ మానిటరింగ్ సిస్టమ్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం పరిశీలించారు. స్కాడా వాటర్ మానిటరింగ్ సిస్టమ్ పనితీరును మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, కమిషనర్ రాజాబాబు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ, నీటి విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్ రవి, జోన్ -5 కమిషనర్ ఆర్‌జివి.కృష్ణ, ఇఇ ఏడుకొండలు ఎఇ గణేష్ పాల్గొన్నారు.










