May 12,2021 07:29

   కోవిడ్‌-19పై పోరులో ప్రధానంగా మహిళలే ముందున్నారు. వైద్యులతో పాటు, నర్సులు, ఆశా కార్యకర్తలు నిరంతరం శ్రమిస్తూ కరోనా రోగులను గుర్తించడంతో పాటు, వారికి మందులు సరఫరా చేయడం, అవసరమైతే ఆసుపత్రికి తరలించి సేవలు చేయడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. సాధారణంగా మనకి అనారోగ్యం వస్తే వైద్యుడిని కలుస్తాము. ఒకవేళ అనారోగ్యంతో హాస్పిటల్‌ లో ఉండాల్సి వస్తే మనకి వైద్యునితో పాటు, నర్సులు కూడా విశేష సేవలు అందిస్తారు. మనం డాక్టర్లని గుర్తుపెట్టుకుంటాం కానీ, నర్సుల సేవలను అంతగా గుర్తుపెట్టుకోము. వైద్యుల సేవలని కొనియాడటానికి ఒక రోజు ఉన్నట్లే, నర్సుల సేవలని గుర్తుపెట్టుకోవడానికి ఒక రోజు ఉంది. అదే మే 12. మనం ప్రతి సంవత్సరం మే 12 న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటాము. ప్రముఖ సామాజిక సేవకురాలు ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ జయంతిని నర్సుల దినోత్సవంగా జరుపుతారు. నైటింగేల్‌ ఆధునిక నర్సింగ్‌ వ్యవస్థకి నాంది పలికింది. 1820 మే 12న జన్మించిన ఫ్లోరెన్స్‌ ఆనాటి సమాజంలో ఉన్న కట్టుబాట్లని ఛేదించి నర్స్‌గా సేవలు అందించింది. 1854-56 మధ్య జరిగిన క్రిమియా యుద్ధంలో గాయపడిన సైనికులకు విశేష సేవలందించి ''ది లేడీ విత్‌ ద ల్యాంప్‌''గా పేరు పొందింది. ఆమె స్ఫూర్తితో ఎందరో యువతులు నర్సింగ్‌ వృత్తిని ఎంచుకున్నారు. వారు ఓపికగా రోగులకు సేవలందిస్తున్నారు. అనేకమంది మహిళలు నర్సులుగా రాణిస్తున్నారు. రోగి కేస్‌ స్టడీ డాక్టర్‌ కంటే నర్సులకే ఎక్కువ తెలుస్తుంది. వారి చిరునవ్వు రోగులకు కొండంత ధైర్యానిస్తుంది. వారి సేవలు శ్లాఘనీయం. నర్సుల దినోత్సవం సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం.
 

యమ్‌. రామ్‌ ప్రదీప్‌, తిరువూరు.
సెల్‌ : 94927 12836