Oct 09,2023 20:19

మెట్టుదిగని గీత.. మాట నిలబెట్టుకోని అశోక్‌

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  విజయనగరం నియోజకవర్గంలో టిడిపి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంతా కలిసి పనిచేద్దామంటూ మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు రాయబారం పంపిన అశోక్‌ అంతలోనే ప్లేటు ఫిరాయించారట. విషయం తెలుసుకున్న గీత మెట్టుదిగని పరిస్థితి నెలకొంది. అశోక్‌ కోటరీ నుంచి స్పష్టమైన వైఖరి తెలియజేస్తే తప్ప కలిసిపని చేద్దామనే రాజీధోరణ వద్దని గీత ఆనుయాయులు భీష్మించినట్టుగా తెలుస్తోంది.
విజయనగరంలో టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు మధ్య విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అంతా బంగ్లా కనుసన్నల్లో మెలగాలన్న వైఖరి ఆమెకు నచ్చలేదు. ప్రజలకు సందేశమివ్వాలన్నా, మీడియాతో మాట్లాడాలన్నా టిడిపి జిల్లా కార్యాలయం ముసుగులో బంగ్లాకు వచ్చి తీరాలని అశోక్‌ మెలికపెట్టారు. ఇలా ఇద్దరూ ఒకరికొకరు దూరం కావడంతో పార్టీలో రెండు శిబిరాలు నడుస్తూ వచ్చాయి. చివరకు గీత నియోజకవర్గం పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలతోపాటు ఇతర కార్యకలాపాలు కూడా గీత తన అనుయాయులతోనే నడుపుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో మెజార్టీగా వున్న కాపు సామాజికవర్గం నాయకులు ఎక్కువగా గీతతోనే నడుస్తున్నారు. అటు అశోక్‌ కూడా కొంతమంది నాయకులతో బంగ్లా కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నారు. ఇటీవల చంద్రబాబు జైలుకు వెళ్లాక పార్టీ చెక్కుచెదిరిపోకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే విజయనగరంలో కూడా గీతను కలుపుకుని వెళ్లాలంటూ రాష్ట్ర కేంద్రం నుంచి అశోక్‌కు ఆదేశాలు అందినట్టు సమాచారం. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పెద్దగా అంతా కలిసిపని చేద్దామంటూ గీతతో రాయభారానికి పార్టీ సీనియర్‌ నేత, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, మరో నాయకుడు కనకల మురళీమోహన్‌లను నాలుగు రోజుల క్రితమే పంపారు. వీరిద్దరూ గీత ఇంటికి వెళ్లి మరీ బంగ్లాకు ఆహ్వానించినట్టు సమాచారం. 'వేర్వేరుగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ప్రతిపక్షానికి లోకువైపోతాం. అందుకే ఇక నుంచి అంతా కలిసి పనిచేద్దాం, ఇదే విషయాన్ని అశోక్‌ కూడా తమరికి చెప్పమన్నారు' అంటూ గీతకు వివరించినట్టు తెలిసింది. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందిస్తునే తనను నమ్మకుని పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలతో కూడా సంప్రదించాక, కలిసి పనిచేయడానికి తనకు ఇబ్బందులేవీ లేవని చెప్పినట్టు సమాచారం. రాయబారానికి వెళ్లిన నాయకులు వెనుదిరుగుతూ 'నియోజకవర్గపార్టీ బోర్డును కూడా తీసేయండి' అంటూ విన్నవించడంతో గీత ఒకింత డైలామాలో పడ్డారు. అది కూడా ఆలోచిద్దాం అంటూ నాయకులను సాగనంపిన మరుచటి రోజే గీత తన కేడర్‌తో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంగతి కాస్త అటుంచితే రాయభారానికి పంపినట్టే పంపిన అశోక్‌ 'మనం ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదూ' అంటూ బంగ్లాలోని తనకేడర్‌తో చిట్‌చాట్‌ చేసినట్టుగా సమాచారం. ఇదే విషయం గీత కేడర్‌కు తెలియడంతో అశోక్‌ వైఖరిపై అగ్గిమీద గుగ్గిలమయ్యారట. బోర్డు తీసేయాలన్న షరతుపైన కూడా గీత గ్రూపు నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిలిచినట్టే పిలిచి ఇదేమి పితలాటం అంటూ సమావేశంలో మండిపడ్డారు. స్వతంత్రంగానే పార్టీకోసం పనిచేయాలని, స్పష్టమైన వైఖరి తెలుసుకోకుండా వెళ్తే మళ్లీ లోకువైపోతామని, ఇదే పరిస్థితి ఏర్పడితే బిసిలకు ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి దూరం కావాల్సి వస్తుందని కేడర్‌ చర్చించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గీతకు సీటు కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలన్నది ఆమె కేడర్‌ లోగుట్టుగా తెలుస్తోంది. అశోక్‌ ఈసారి పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరంటూనే ఆయన కేడర్‌ ప్రచారం చేస్తోంది. అశోక్‌ మాత్రం తాను కాకపోతే బిసిల్లోనే వేరొక సామాజికవర్గానికి ప్రాధాన్యతనిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీకి చెందిన కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఈనేపథ్యంలో విజయనగరం నియోజకవర్గ టిడిపి అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగాను, రసవత్తరంగానూ మారాయి.