Oct 19,2023 22:22

అంబేద్కర్‌ విగ్రహం వద్ద హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు

        అనంతపురం : విద్యార్థి సంఘాల పోరాటం ఫలించింది. విద్యార్థులు, అధ్యాపకులు లేరన్న సాకుతో తొలగించేందుకు సిద్ధం అయిన అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ కోర్సును యథావిధిగా కొనసాగించేలా ఎస్‌కె యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ విభాగాన్ని రద్దు చేస్తున్నట్లు వారం రోజుల క్రితం యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐఎస్‌ఎ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. యూనివర్సిటీ వద్ద రిలేనిరాహార దీక్షలనూ ప్రారంభించారు. అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులను కలుపుకుని ఉద్యమాన్ని తీవ్రతరం తరం చేశారు. విద్యార్థి సంఘాల పోరాటానికి దిగొచ్చిన యూనివర్సిటీ అడల్ట్‌ కోర్సును యథావిధిగా కొనసాగిస్తూ గురువారం నిర్ణయం వెలువరించారు. దీనిపై విద్యార్థి సంఘం నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణయ్య, కుళాయిస్వామి, ఎఐఎస్‌ఎ రాష్ట్ర అధ్యక్షులు వేమన్న, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి గిరి మాట్లాడుతూ శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఎ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ కోర్సును తీసివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, ఏఐఎస్‌ఎ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. యూనివర్సిటీలో గతంలో కూడా ఎల్‌ఎల్‌బి మూడు సంవత్సరాల కోర్సును ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి లా కోర్సును యధావిధిగా కొనసాగిచ్చేలా ప్రకటన చేసిందన్నారు. ఎంఎ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ కోర్సును ఎత్తివేయాలని కూడా యూనివర్సిటీ యంత్రాంగం ఉన్నత అధికారులకు లేఖ రాశారన్నారు. దీనిపై వామపక్ష విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేశాయన్నారు. ఈ పోరాటానికి తలొగ్గి ఎంఎ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ కోర్స్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం హర్షనీయం అని తెలిపారు. ఇదేవిధంగా ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేయడానికి కషి చేయాలన్నారు. యూనివర్సిటీలో సీటు పొందిన ప్రతి విద్యార్థికీ హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థులను ఫీజులు పేరుతో వేధింపులు ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ, నగర అధ్యక్షులు ఉమా మహేష్‌, నాయకులు మంజు, విశ్వ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సిద్దు, భీమేష్‌ పాల్గొన్నారు.