Jul 05,2023 22:24

మారిన పోలవరం కాంటూరు లెక్కలు
41.15 కాంటూరులోకి 19 గ్రామాలు చేరిక
3,480 కుటుంబాలకు ఊరట
పరిహారంగా నిర్వాసితులకు అందనున్న రూ.238.69 కోట్లు
సిపిఎం మహా పాదయాత్రతో దిగొచ్చిన ప్రభుత్వం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

సిపిఎం చేపట్టిన 'పోలవరం పోరుకేక' మహా పాదయాత్రతో ప్రభుత్వం దిగొచ్చింది. పోలవరం కాంటూరు లెక్కల్లో పలు గ్రామాలకు సంబంధించిన మార్పులపై స్పష్టమైన ప్రకటన చేసింది. ఇప్పటి వరకూ 45.72 కాంటూరులో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 19 గ్రామాలను 41.15 కాంటూరులో చేర్చింది. చేర్చిన వాటిలో వేలేరుపాడు మండలంలో తొమ్మిది గ్రామాలు, కుక్కునూరు మండలంలో పది గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో మొత్తం గిరిజన కుటుంబాలు 1,443, గిరిజనేతర కుటుంబాలు 2,037 ఉన్నాయి. కాంటూరు మార్పుతో రెండు మండలాల్లో మొత్తం 3,480 కుటుంబాలకు ఊరట లభించనుంది. పరిహారం కింద రూ.238.69 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం మూడు కాంటూరులుగా విభజించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంత గ్రామాలను మొదటి కాంటూరులో చేర్చగా రెండో విడత ఖాళీచేసే గ్రామాలను 41.15 కాంటూరులో, మిగిలిన గ్రామాలను 45.72 కాంటూరులో చేర్చింది. 2022 వరదలకు ప్రభుత్వం ప్రకటించిన కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా గ్రామాలన్నీ ముంపునకు గురయ్యాయి. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో లైడార్‌ సర్వేతో కాంటూరు లెక్కలు మరోసారి తేలుస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
లైడార్‌ సర్వే అనంతరం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 18 గ్రామాలను 41.15 కాంటూరులో చేరుస్తున్నట్లు ప్రకటించి కొద్దిరోజుల తర్వాత మళ్లీ మాటమార్చింది. దీంతో నిర్వాసితుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ జూన్‌ 20న అల్లూరి జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక నుంచి ప్రారంభమైన సిపిఎం మహాపాదయాత్ర ఈ నెల నాలుగో తేదీన విజయవాడ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నేతృత్వం వహించారు. రాజకీయ పార్టీల నుంచి, ప్రజాసంఘాల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించింది. రాష్ట్ర, జాతీయ నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. దీంతో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది. 45.72 కాంటూరులో ఉన్న 19 గ్రామాలను 41.15 కాంటూరులో చేరుస్తున్నట్లు బుధవారం స్పష్టమైన ప్రకటన చేసింది. ఇంకా నిర్వాసితులకు సంబంధించిన అనేక అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.
పోరాట ఫలితమే మొదటి పరిహారపు జాబితాలోక 41.15 కాంటూరులో చేర్చిన గ్రామాలు
వేలేరుపాడు మండలంలోని గ్రామాలు;
1.కాకిసనూరు, 2.పెదమానుకొల్లు, 3.తూర్పుమెట్ట, 4.టేకూరు, 5.కాచారం, 6.ఎర్రమెట్ట, 7.యడవల్లి, 8.పేరంటాలపల్లి, 9.టేకుపల్లి
కుక్కునూరు మండలంలోని గ్రామాలు;
1.కౌండిన్యముక్తి, 2.మాధవరం, 3.యల్లప్పగూడెం, 4.బెస్తగూడెం, 5.ఆంబోతులగూడెం, 6.చెరువుకొమ్ముగూడెం, 7.ఎర్రబోరు, 8.గుండమ్మబోరు, 9.ముత్యాలంపాడు, 10.రావిగూడెం
వరద ముంపు ఆధారంగా గ్రామాలను గుర్తించాలి
ఎ.రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి

ఇప్పటికైనా ప్రభుత్వం పలు ముంపు గ్రామాలకు సంబంధించి కాంటూరు మార్పు చేయడం మంచి పరిణామం. ముంపు గ్రామాల ఎంపిక అశాస్త్రీయంగా కాకుండా శాస్త్రీయంగా చేపట్టాలి. 1986, 2022 వరదల ప్రాతిపదికన ముంపు గ్రామాల గుర్తింపు జరగాలి. గుర్తించని గ్రామాలను వెంటనే చేర్చాలి.                   నిర్వాసితులకు పరిహారం వెంటనే అందించాలి
యర్రంశెట్టి నాగేంద్రరావు, సిపిఎం కుక్కునూరు మండల కార్యదర్శి

సిపిఎం పోరాట ఫలితంగా 10 గ్రామాలు మొదటి పరిహారపు (41.15 కాంటూరు) జాబితాలోకి చేర్చారు.దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. మండలం మొత్తాన్ని యూనిట్‌గా తీసుకుని పరిహారం చెల్లించాలి. గోదావరి వరదలకు దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలి. నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరించాలి.