May 22,2023 23:47

​​​​​​​ అరకులో మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి-పాడేరు:తమ వేతన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పాడేరు డివిజన్లోని ప్రభుత్వ ఆసుపత్రుల శానిటేషన్‌ కార్మికులు చేపట్టిన సమ్మె సఫలీకృతం అయ్యింది. గత మూడు రోజులుగా పాడేరు చింతపల్లి, అరకు, ముంచింగ్‌పుట్‌ ఆసుపత్రుల శానిటేషన్‌ కార్మికుల సుమారు 56 మంది విధులు బహిష్కరించి సమ్మె చేపట్టిన సంగతి విధితమే. గత కొన్నాళ్లుగా వేతన సమస్యలు ఎదుర్కొంటున్న ఈ శానిటేషన్‌ కార్మికులు ఎట్టకేలకు సమ్మె చేపట్టి తమ సమస్యలు పరిష్కరించుకోవడంలో విజయం సాధించారు. ఆసుపత్రి పారిశుధ్య కార్మిక యూనియన్‌ నాయకులు, సీఐటీయూ నాయకులతో కాంట్రాక్టర్‌ (టివిటి) నారాయణ కార్మికుల సమస్యలపై గత రెండు రోజులు చర్చలు జరిపారు. ఎట్టకేలకు సమస్యలపై సానుకూలంగా స్పందించారు. అరకు, పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలోని కార్మికులకు నెలకు రూ.500 వేతనం, ముంచింగ్‌పుట్‌, చింతపల్లి ఆసుపత్రి కార్మికులకు నెలకు వేతనం రూ.700 పెంచడానికి అంగీకారం తెలిపారు. ప్రతి నెల కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించడానికి, అదనపు సిబ్బందిని నియమించడానికి, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సమస్య ల పరిష్కారానికి, వేతనంతో కూడిన సెలవులు మంజూరుకు, కార్మికులకు డ్యూటీ యూనిఫాంలు, పని సామగ్రి పరికరాలు ఇచ్చేందుకు కాంట్రాక్టర్‌ అంగీకరించారు. రాతపూర్వకంగా శానిటేషన్‌ కార్మికుల యూనియన్‌ నాయకులతో.ఆమోదం తెలిపి తమ ఒప్పందాలను లిఖిత పూర్వకంగా కాంట్రాక్టర్‌ అందజేశారు. దీంతో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను విరమించి 22 తేదీ సోమవారం నుండి ఆసుపత్రుల్లో శానిటేషన్‌ కార్మికులు తమ విధుల్లోకి ఉపక్రమించారు. సమ్మె విజయవంతానికి కృషి చేసిన కార్మికులకు సిఐటియు నాయకులకు ఆసుపత్రి పారిశుద్ధ కార్మిక సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్‌.సుందర్రావు, కార్మికుల సంఘం నాయకులు ముత్యాలమ్మ, ఘటి, సుధారాణి, సింహాచలం, శివ, కాంట్రాక్టర్‌ నారాయణ, కిరణ్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. చర్చలు సఫలం కావడంతో పారిశుధ్య కార్మికులు విధుల్లో చేరారు. తాత్కాలికంగా సమస్యలు పరిష్కారం అయినప్పటికీ భవిష్యత్తులో కనీస వేతంన రూ.26000 ఇవ్వాలని పారిశుధ్య కార్మికులు కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం సర్పంచ్‌ కె.త్రినాథ్‌, సిఐటియు ఉపాధ్యక్షులు పి.భీమరాజు, గిరిజన సంఘం మండల కార్యదర్శి కే.నర్సయ్య, పి.రామదాసు, పారిశుద్ధ కార్మికులు సుబ్బలక్ష్మి, గాసన్న, కౌసల్య, నారాయణ, దేవి, వసంత, గిరిజన మహిళ సంఘం అధ్యక్షులు విజయ, ఈశ్వరి, మీనా, రాధా పాల్గొన్నారు.
అరకులోయ రూరల్‌:అరకు ఏరియా ఆసుపత్రి పారిశుధ్య కార్మికులు సోమవారం సమ్మె విరమించి విధుల్లోకి చేరారు. సమ్మె విజయవంతానికి కృషి చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, నేతలకు ఆసుపత్రి పారిశుద్ధ కార్మిక సంఘం అభినందనలు తెలిపింది. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికుల సంఘం నాయకులు రఘు, ద్రౌపతి, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.