Jan 09,2023 23:37

భాషా వాలంటీర్లుకు స్వీటును తినిపిస్తున్న అప్పలనర్స

ప్రజాశక్తి-పాడేరు: పాడేరు ఏజెన్సీలోని ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న మాతృభాష వాలంటీర్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. ఐటీడీఏ అలక్ష్యం మూలంగా రెండేళ్లుగా భాషా వలంటీర్లు విధులకు దూరంగా ఉన్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో పలుసార్లు ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో భాషా వాలంటీర్లు తమను కొనసాగించాలని కోరుతూ ఆందోళనలు కొనసా గించారు. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ చొరవతో భాషా వాలంటీర్లు విధుల్లోకి చేరేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఆదివాసి మాతృభాష విద్య వాలంటీర్లు విధుల్లోకి చేరాలని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి వచ్చిన మౌలిక ఆదేశాల మేరకు గిరిజన సంఘం కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏపీ గిరిజన సంఘం నేతలతో కలిసి భాష వలంటీర్లు మిఠాయిలు పంచుకొని విజయోత్సవం జరుపుకున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి:
గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అప్పలనరస
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అప్పలనరస మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో ఆదివాసి మాతృభాష విద్యా వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని, గత రెండు సమస్యల నుండి నిర్వహించిన సుదీర్ఘ పోరాట ఫలితంగా విధుల్లోకి తీసుకోవాలని తెలిపారు. రెండేళ్లుగా భాష వాలంటీర్లను కొనసాగించక పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 39 వేల మంది ఆదివాసి చిన్నారులకు మాతృభాష విద్యా బోధన అందని ద్రాక్షగా మారిందని, 1200 మంది మాతృభాషా విద్యా వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరిని 2019లో విధుల నుండి తొలగించారని, నిధులు లేవంటూ విధుల్లోకి తీసుకోకుండా గత రెండు సంవత్సరాల నుండి ఆదివాసి మాతృభాష వాలంటీర్లను నానా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ ముట్టడి, 24 గంటల దీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ కూడా నిర్వహించిన ఫలితంగా ఎట్టకేలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసి మాతృభాషా విద్యా వాలటీర్లను విధుల్లోకి తీసుకున్నారని, ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, అల్లూరి జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఆదేశాలను అనుసరించి మాతృభాష విద్యా వాలంటీర్లు విధుల్లోకి చేరాలని, విద్యాశాఖ కార్యాలయం నుండి మౌలిక ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. జనవరి నెల జీతాలు చెల్లిస్తామని, భవిష్యత్తులో పాడేరు ఐటిడిఏకి కేటాయించిన కోటి 89 లక్షలతో జీతాలు ఇస్తామని జిల్లా కలెక్టర్‌ ఆదివాసి మాతృభాష వాలంటీర్లకు తెలియజేశారన్నారు. ఉన్నత విద్యావంతులైన ఆదివాసి మాతృభాష విద్యా వాలంటీర్లు మారుమూల ప్రాంతాల్లో కూడా ఆదివాసి చిన్నారులకు విద్య అందించే సమర్థవంతమైన బాధ్యతను నిర్వహిస్తున్నారని, వారికి కనీస వేతనం ప్రభుత్వ నిబంధన ప్రకారం చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఐఏఎస్‌ అధికారులు ఉండగా సలహాదారుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వృధా ఖర్చు పెడుతుందని, భాషా వాలంటీర్లకు నిధులు లేవని చెప్పడం సరికాదన్నారు.