ప్రజాశక్తి-హిందూపురం : వైసిపి హిందూపురం ఇన్‌చార్జిగా దీపిక, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ మధ్య నెలకొన్న కోల్డ్ వార్‌కు తెరపడింది. దీపిక ఇన్‌ఛార్జిగా వచ్చినప్పటి నుంచి నెలకొన్న కోల్డ్‌వార్‌లో భాగంగా దీపిక సై అంటే ఇంద్రజ సైసై అంటూ కొనసాగింది. చైర్‌పర్సన్ తనకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా అద్యక్షులు, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణతో పాటు అనంతపురం ఎంపీ రంగయ్యకు వివరించింది. వారి సూచనల మేరకు వాల్మీకి, బోయ కార్పొరేషన్ ఛైర్మన్ పొగాకు రామచంద్ర, వైసిపి నాయకులు వేణు రెడ్డి, బాబు రెడ్డి బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని చైర్‌పర్సన్ చాంబర్‌లో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించాయి. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతు తమ పార్టీలో వర్గాలు లేవన్నారు. అందరిది ఒకే లక్ష్యం అని 2024 ఎన్నికల్లో టిడిపి కంచుకోటలో వైసిపి జెండా ఎగర వేసి దీపికను గెలిపించుకుంటామని అన్నారు. హిందూపురం నియోజకవర్గం ఇప్పటి వరకు టిడిపికి అడ్డాగా ఉందని అయితే దీనిని జగన్ అడ్డాగా మారుస్తామని అన్నారు. ఇప్పటికే చెలివెందుల ఎన్నికల్లో గెలిచి చూపించామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మారుతీరెడ్డి, అయూబ్, ముస్తక్, రహమత్ బి, నాయకులు బాబు, షఫి, మార్కెట్ చాంద్ బాష, సిఎన్‌పి నాగరాజు, సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










