నిషేధం అమల్లోకొస్తే ఉమ్మడి జిల్లాలో ఐదు వేల మంది ఉపాధికి గండి
మరికొంత గడువు ఇవ్వాలంటున్న యాజమాన్యాలు
రూ.25 లక్షలు విలువచేసే మిషనరీ మూలకు
తమగోడు వినండంటున్న ఫ్లెక్సీల యాజమాన్యాలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
పుట్టిన రోజు నుంచి రాజకీయ కార్యక్రమాల వరకూ ఫ్లెక్సీ లేకుండా పూర్తికాని పరిస్థితి నెలకొంది. ఫ్లెక్సీ రంగం పెద్దఎత్తున విస్తరించడంతో ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. పట్టణ, మండల, గ్రామాల్లో సైతం ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్‌లు వెలిశాయి. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఒక్కసారిగా ఫ్లెక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో వేలాది మంది ఉపాధికి గండిపడటంతోపాటు ఫ్లెక్సీ ప్రింటర్స్ యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. తమకు కొంత సమయం ఇవ్వాలని యాజమాన్యాలు కోరినా పట్టించుకోకుండా ప్రభుత్వం నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్లెక్సీలపై నిషేధం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అన్ని వైపులా నుంచి ఒత్తిడి రావడంతో నిషేధం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సోమవారం రాత్రి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ప్లెక్సీల నిషేధంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది కుటుంబాలను రోడ్డున పడసే పరిస్థితి నెలకొంది. ఫ్లెక్సీల తయారీలో పని చేస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫ్లెక్సీ బేనర్ల నిషేధం వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అయితే నిషేధంపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి అధికారులకు, గ్రామ, వార్డు వాలంటీర్ల వరకూ ఆదేశాలు వచ్చేశాయి. దీంతో ప్రస్తుతమున్న ఫ్లెక్సీ బేనర్లను తొలగించడంతోపాటు తయారీ నిలిపివేయాలని ఫ్లెక్సీ ప్రింటర్స్ యాజమాన్యాలకు సైతం ఆదేశాలందాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 800 వరకూ ఫ్లెక్సీ ప్రింటర్స్ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఒక్క ఏలూరులోనే 32 ఫ్లెక్సీ ప్రింటర్స్ ఉండగా తణుకులో ఎనిమిది, భీమవరంలో 15 వరకూ ఉన్నాయి. ప్రతి మండల కేంద్రంలోనూ ఫ్లెక్సీ తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఫ్లెక్సీల తయారీ ఒక పెద్ద పరిశ్రమగా మారింది. ప్రతి ప్రింటర్ వద్ద దాదాపు ఐదు నుంచి పది మంది వరకూ పని చేస్తున్నారు. డిజైనర్, ప్రింటర్, ఫ్రేమ్‌లు తయారు చేసేవారు, వాటిని అంటించేవారు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసేవారు, ఇలా చాలామంది వివిధ రూపాల్లో ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో దాదాపు ఐదు వేల మందికిపైగా ఫ్లెక్సీ రంగంలో ఉపాధి పొందుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఫ్లెక్సీలపై నిషేధం అమలుతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. నిషేధంపై ప్రభుత్వం పునరాలోచించడంతోపాటు ఏడాదైనా సమయం ఇవ్వాలని యాజమాన్యాలు కోరుతున్నా పట్టించుకోకుండా కేవలం సుమారు మూడు నెలలే ఇవ్వడంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ.25 లక్షలు విలువ చేసే మిషనరీ మూలకు
ప్రభుత్వం ఫ్లెక్సీల స్థానంలో క్లాత్‌ను ఉపయోగించాలని సూచిస్తోంది. ప్రస్తుత యంత్రాలపై క్లాత్ ప్రింటింగ్‌కు అవకాశం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మిషనరీ పివిసి ఫ్లెక్సీ, పాలిస్టర్ క్లాత్ ప్రిటింగ్‌కు మాత్రమే సహకరిస్తాయంటున్నారు. కాటన్ క్లాత్ ప్రిటింగ్ చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని, అయితే తమ వద్ద ఉన్న యంత్రాలు వీటికి పనికి రావని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న మిషనరీకి రూ.25 లక్షలు వరకూ వెచ్చించామని, మళ్లీ ఇప్పుడు మిషనరీ మార్పు చేయాలంటే రూ.పది లక్షలకుపైగా ఖర్చవుతుందని చెబుతున్నారు. ప్రస్తుత మిషనరీ అంతా మూలన పెట్టాల్సి ఉంటుందని అంతా గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ప్లెక్సీల తయారికీ అడుగుకు రూ.ఏడు నుంచి రూ.ఎనిమిది వరకూ వసూలు చేస్తున్నామని, క్లాత్ బేనర్లకు అయితే అడుగుకు రూ.38 వరకూ వసూలు చేయాల్సి ఉంటుందని, అప్పుడు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి ఉండదని వారంతా లబోదిబోమంటున్నారు. ఫ్లెక్సీ పరిశ్రమలో పొందుతున్న ఉపాధిని సైతం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. కాటన్ క్లాత్ మిషనరీ ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీపై వడ్డీలేని రుణాలు వంటివి ఇచ్చి తర్వాత నిషేధం అమల్లోకి తేవాలని వారంతా కోరుతున్నారు. లేకపోతే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీల నిషేధం నిర్ణయంపై పలు యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి. దీనిపై ఈ నెల రెండో తేదీన విచారణ జరగనున్నట్లు చెబుతున్నారు. దీంతో ఫ్లెక్సీలపై నిషేధం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలనే డిమాండ్ గట్టిగా విన్పిస్తోంది.










