Jun 02,2023 19:19

ఫ్లెక్సీని చూపుతున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
'పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం' అనే పేరుతో స్థానిక రాఘవేంద్ర సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఫొటోను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ బి.లక్ష్మన్న కోరారు. శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎఎస్‌ఐ ఆనంద్‌ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫ్లెక్సీలో వేసిన ఫొటో పవన్‌ కల్యాణ్‌ను కించపరిచే విధంగా ఉందని తెలిపారు. దాని కారణంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్‌ కల్యాణ్‌ అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో పల్లకిలో చంద్రబాబు నాయుడును, లోకేష్‌ను కూర్చోబెట్టుకొని పవన్‌ కల్యాణ్‌ మోస్తున్నట్లుగా చిత్రీకరించడం బాధాకరమన్నారు. ఒక పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ను అవమానించారని, జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్‌ కల్యాణ్‌ అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టినట్లు తెలిపారు. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని, ఫ్లెక్సీని తొలగిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. జనసేన పార్టీ కార్యకర్తలు ఏసోబు, వెంకటేష్‌, టిపి.రాఘవేంద్ర, బిబిసి చిన్న, కాశీం, ఉసేని, గురుస్వామి పాల్గొన్నారు.