Sep 24,2023 21:38

బ్రిడ్జిపై ఏర్పడ్డ గోతులు

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : పట్టణంలోని దీప్తి లాడ్జి కూడలి నుంచి, అటు శ్రీకాకుళం రోడ్‌ వైపు, ఇటు బైపాస్‌ రోడ్డు వైపు ఉన్న ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి మీద పలుచోట్ల గోతులు ఏర్పడి పైకి ఇనుప గజాలు తేలిపోయి ప్రమాదకరంగా మారాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా వాహనాలు నడిపినా వాహనాల టైర్లు గోతుల్లో ఉన్న ఇనుప గజాలకు గుచ్చుకొని టైరులు పంచర్లు అవుతున్నాయి. వీటితో పాటు ఏ మాత్రం చిన్నపాటి వర్షం కురిసినా గోతుల్లో వర్షపు నీరు చేరి ఉండడంతో రాత్రి వేళల్లో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగించే వాహన చోదకులు భయం భయంగా వాహనాలను నడుపుతున్నారు. ఫ్లైఓవర్‌ పై రాకపోకలు సాగించాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలో ఆర్‌ అండ్‌ బి అధికారులు ఉన్నప్పటికీ బ్రిడ్జి మీద ఏర్పడే గోతులకు కనీస మరమ్మతులు చేయకపోవడమేమిటని సంబంధిత అధికారులను వాహన చోదకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సంబంధిత ఆర్‌ అండ్‌ బి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఫ్లై ఓవర్‌పై ఏర్పడిన గోతులకు మరమ్మతులు చేయించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.