Nov 14,2023 21:50

బ్రిడ్జిపై గొయ్యిలను పూడ్చుతున్న విశ్రాంత ఉపాధ్యాయుడు భాస్కరరావు

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : స్థానిక ప్లైఓవర్‌ బ్రిడ్జిపై ఏర్పడిన గోతులను విశ్రాంత ఉపాధ్యాయుడు తూముల భాస్కరరావు మరమ్మతులు చేయించారు. సెప్టెంబర్‌ 25న ప్రజాశక్తిలో ప్రచురితమైన '' ఫ్లైఓవర్‌ గోతుల్లో తేలిన ఇనుప గజాలు'' అన్న వార్తకు ఆర్‌ అండ్‌ బి అధికారులు స్పందించనప్పటికీ పట్టణ నడిబొడ్డులో ఉన్న ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై ఏర్పడిన గోతులను మంగళవారం నిర్వాసితుల కాలనీ అయిన నవిరికి చెందిన భాస్కరరావు తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టి ఆర్‌ అండ్‌ బి అధికారులను ఆశ్చర్యపడేలా చేశారు. ఈ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదుగా ప్రతిరోజూ వందలాది భారీ వాహనాలతో పాటు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. వై ఆకారంలో ఉన్న ఈ ఫ్లైఓవర్‌పై పలుచోట్ల గోతులు ఏర్పడి ఇనుప చువ్వలు బయటకు వచ్చి వాహనాల మరమ్మతులకు గురవుతున్నప్పటికీ నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన ఆర్‌ అండ్‌ బి అధికారుల దృష్టికి పలువురు పలు సందర్భాల్లో తీసుకెళ్లినా కనీసం పట్టించుకోలేదు. దీంతో బ్రిడ్జిపై ఉన్న గుంతలను భవనిర్మాణ కార్మికులతో కప్పించడంతో మరమ్మతులు చేపట్టాల్సిన ఆర్‌ అండ్‌ బి అధికారులను స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తూ, ఆ ఉపాధ్యాయుని అభినందించారు.