అమెరికాలో సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీస్ మాజీ అధికారి డెరిక్ చౌవిన్ కు ఇరవై రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష... తెలంగాణలో పోలీస్ కస్టడీలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్, పోలీసుల సస్పెన్షన్.. వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలు 'నేరం-న్యాయం-శిక్ష-పరిహారం'పై మరోసారి చర్చకు దారి తీశాయి. దళితులు, గిరిజనులు, ముస్లింలపై పోలీసుల వివక్షతోపాటు...చుండూరు లాంటి ఘటనల్లో బాధితులకు న్యాయం అందని ద్రాక్షగా మిగిలిన వాస్తవాలను మరోసారి గుర్తు చేశాయి.
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఘటన 25 మే 2020న జరగగా సరిగ్గా ఒక సంవత్సరం 32 రోజుల తరువాత తీర్పు వచ్చింది. 'ఈ తీర్పు భావోద్వేగాలతో, సానుభూతితో ఇచ్చింది కాదు. కానీ, ఫ్లాయిడ్ కుటుంబంతో పాటు అలాంటి ఎన్నో కుటుంబాలు అనుభవించిన తీవ్ర వేదనను గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు' అని జడ్జి పీటర్ కాహిల్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జార్జ్ ఫ్లాయిడ్ మరణం విషయంలో, సిటీ కౌన్సిల్ ఆఫ్ మిన్నియాపాలిస్, ఫ్లాయిడ్ కుటుంబం మధ్య ఒప్పందం జరిగింది. దీని కింద, సిటీ కౌన్సిల్ ఫ్లాయిడ్ కుటుంబానికి 27 మిలియన్ డాలర్లు (సుమారు రూ.196 కోట్లు) ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు, ముస్లింలపై వివక్షతో అనేక దాడులు జరిగాయి. కొన్నిసార్లు సామూహిక హత్యలకు దారి తీశాయి. అయితే చాలా కేసుల్లో వాటిని రుజువు చేయడంలో ఇబ్బందులు ఎదురవడంతో దోషులు బయటపడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ లోని హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య, రోహిత్ వేముల ఆత్మహత్య, తమిళనాడులో 17 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య, 2017లో సహ్రాన్‌పూర్ హింస...ఇలా ప్రతి సంవత్సరం సంచలనాత్మక కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే చాలా ఘటనలు వెలుగు చూడకుండానే కనుమరుగవుతున్నాయి.
దేశంలో బిజెపి అధికారం లోకి వచ్చాక దళితులు, గిరిజనులు, ముస్లింలపై దాడులు పెరిగిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. దళితులు, గిరిజనులు, ముస్లింలపై దాడుల్లో బాధితులకు అనుకూలంగా వచ్చిన తీర్పులు అంతంత మాత్రమేనని అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. కేసులు, చార్జ్‌షీట్ నమోదులో పోలీసుల వైపు నుంచి జరిగే జాప్యంతో నిందితులు తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. చుండూరు ఘటనపై వెల్లువెత్తున ప్రజాగ్రహం కారణంగా ఏర్పాటైన ప్రత్యేక కోర్టు 16 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం 2007లో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, ఏడేళ్ల తర్వాత ఎ.పి హైకోర్టు 21 మంది నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు తీర్పు ఇచ్చింది. దీంతో బాధితుల బంధువులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఇప్పటికీ కేసు నడుస్తోంది. కారంచేడు ఘటనలో గుంటూరు కోర్టు ఐదుగురికి యావజ్జీవ కారాగారశిక్ష, 46 మందికి 3 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. ఆ తర్వాత బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద 1998 జూలై 24న ఇచ్చిన తీర్పులో కింది కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్ట్ లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా, 2008 డిసెంబర్ 19న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికే పలువురు నిందితులు మరణించడంతో ఇక మిగిలిన వారిలో ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు, మరో 29 మందికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశంలో 20 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నట్టు దళిత సంఘాలు చెబుతున్నాయి. 2017-18 హోంమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం కేవలం 16.3 శాతం శిక్షలు పడినట్టు నమోదైంది. చాలా కేసుల్లో కింది స్థాయి న్యాయస్థానాలు విధించిన శిక్షలను హైకోర్టులు, సుప్రీంకోర్టులు కొట్టివేసి, నిందితు లను నిర్దోషులుగా వదిలిపెడుతున్నాయి. చాలా సందర్భాలలో సాక్ష్యాధారాలను రూపుమాపుతున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని, బలవంతపు రాజీలు చేస్తున్నారని, విచారణలు సక్రమంగా జరగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
భారతదేశంలో దళితులు, గిరిజనుల రక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా నిందితులు ఎలాగోలా తప్పించుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. కానీ వాటి అమలులోనే పాలకుల చిత్తశుద్ధిలేమి స్పష్టంగా కనిపిస్తోంది. నేరాలు జరగడం, కేసులు వీగిపోవడంలో రాజకీయాలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. న్యాయ, అన్యాయాలను ప్రభావితం చేస్తున్నాయి. ముందుగా పోలీసు వ్యవస్థలో మార్పు రావాలి. నేరాలను రికార్డు చేయడంతోనే సరిపుచ్చకుండా, దానిపై చర్యలు తీసుకోవడం, కఠినంగా వ్యవహరించడం ద్వారా పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చు. అంతేకాకుండా న్యాయం జరిగే వరకు బాధితులు, సాధారణ ప్రజలు, ఆందోళనకారులు ఒక్కటై ఉద్యమించి, ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముంది. రాజకీయ ప్రభావం లేని పాలకులు.. పాలకుల ఒత్తిడి లేని పోలీసులు.. దీనికి తోడు న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా నిలిచే ఉద్యమకారులు, ప్రజలు, పక్షపాతం-ఒత్తిడి లేకుండా తీర్పు చెప్పే న్యాయస్థానాలు ఉంటే భారతదేశంలో కూడా న్యాయం సత్వరం అందే అవకాశం వుంటుంది.
- మహమ్మద్ ఆరిఫ్,
సెల్ : 96184 00190










