ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని రాజయ్యపేట సముద్రం తీరంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుకు స్థలం కేటాయింపునకు అనుమతులు ఇప్పించాలని కోరుతూ అడ్డురోడ్డులో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బాబురావుకు మంగళవారం జెడ్‌పిటిసి గోసల కాసులమ్మ, గ్రామ సర్పంచ్ తనయుడు పిక్కి కామేశ్వరరావు, మత్స్యకార నాయకులు వినతి పత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు కూడా మంజూరు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, రాజయ్యపేట సముద్రతీరంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి తీర ప్రాంతంలో అనుకూలంగా ఉన్న సిఆర్‌జెడ్, అటవీ శాఖకు చెందిన భూములు ఉన్నాయన్నారు. వీటిలో 4 ఎకరాల వరకు స్థలం కేటాయింపునకు అనుమతులు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు. ఫిష్ లాండింగ్ సెంటర్ లేకపోవడంతో ఈ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు వలసలు పోతున్నారని, రాజయ్యపేట తీరంలో ఏర్పాటు చేస్తే 30 వేల మంది మత్స్యకారులకు జీవనోపాధి కలిగించినట్లు అవుతుందన్నారు.మత్స్యకారుల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని స్థలం కేటాయింపునకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు మైలపల్లి సూరిబాబు, దేవుడు, నాగరాజు, పిక్కి కోదండరావు తదితరులు పాల్గొన్నారు.










