ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని రాజయ్యపేట సముద్రం తీరంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు స్థలం కేటాయింపునకు అనుమతులు ఇప్పించాలని కోరుతూ అనకాపల్లిలో ఎంపీ సత్యవతికి సోమవారం రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో జెడ్ పిటిసి గోసల కాసులమ్మ, గ్రామ సర్పంచ్ తనయుడు పిక్కి కామేశ్వరరావు. మత్స్యకార నాయకులు పిక్కి కోదండరావు వినతిపత్రం అందజేశారు. ముందుగా రాజయ్యపేటలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ మంజూరు చేయడానికి కృషి చేసినందుకు గాను ఎంపీ సత్యవతికు కృతజ్ఞతలు తెలిపారు.పాయకరావుపేట నియోజక వర్గంకు సంబంధించి సుమారు 30 వేల మంది మత్స్యకారులు సముద్రం పై ఆధారపడి చేపలు వేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఈ ప్రాంతంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ మంజూరు చేసి ఇందుకు సంబంధించిన నిధులను కూడా మంజూరు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. రాజయ్యపేట సముద్రతీరంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి తీర ప్రాంతంలో అనుకూలంగా ఉన్న సి ఆర్‌జెడ్, అటవీ శాఖకు చెందిన భూములు కలవని, ఆ స్థలంలో 4 ఎకరాల వరకు స్థలం కేటాయింపునకు అనుమతులు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఫిష్ లాండింగ్ సెంటర్ లేకపోవడంతో ఈ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు వలసలు పోతున్నారని, రాజయ్యపేట తీరంలో ఏర్పాటు చేస్తే 30 వేల మంది మత్స్యకారులకు జీవనోపాధి కలిగిం చినట్లు అవుతుందన్నారు. సిఆర్‌జెడ్, అటవీ శాఖ స్థలంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ స్పందనలో అధికారులకు కూడా వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల శాఖ అధ్యక్షులు పొడగట్ల పాపారావు, నాయకులు మణిరాజు, భార్గవ్, సురేష్ వర్మ, బుజ్జి, మత్స్యకార నాయకులు గంగరాజు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.










