Oct 06,2023 21:26

స్పందన కార్యక్రమంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర రాహుల్‌ కుమార్‌ రెడ్డి


ఫిర్యాదులను ప్రత్యేక దృష్టితో పరిష్కరించండి
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
- స్పందన కార్యక్రమంలో పాల్గొన్న
నంద్యాల ఎంపీ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

         మండల స్థాయి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉయ్యాలవాడ మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి, డిఆర్‌ఒ పుల్లయ్య ఇతర జిల్లా అధికారులు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజేంద్రనాధ్‌ రెడ్డి, జలవనరుల శాఖ ఛైర్మన్‌ కర్రా గిరిజా హర్షవర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చి మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ మేరకు స్వీకరించిన విజ్ఞప్తులను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుని బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎలోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. మండల స్థాయి స్పందనకు 63 దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటినీ క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకొని మరీ పరిష్కరిస్తున్నారన్నారు. సమస్యలు ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తుడుములదిన్నె రజకులు గ్రామంలో బట్టలు ఉతకడానికి దోబి ఘాట్‌, బట్టలు అరబెట్టడానికి ఖాళీ స్థలం కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తును సమర్పించుకున్నారు.