పజాశక్తి-పాడేరు: స్పందనలో అందిన ప్రతి ఫిర్యాదును విచారణ చేసి పరిష్కరించాలని జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐటిడిఎ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఫిర్యాదును విచారణ నిర్వహించేందుకు ఒక విచారణ అధికారిని నియమించాలని, అనంతరం తగు పరిష్కారం చేయాలని సూచించారు. శుక్రవారం స్పందన కార్యక్రమం ద్వారా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి 96 ఫిర్యాదులను స్వీకరించారు.కొయ్యూరు మండలం బూదరాళ్ళ పంచాయతి గొర్రెల మెట్ట నుండి అన్నవరం గ్రామానికి రోడ్డు నిర్మించాలని ఆ గ్రామ గిరిజనులు కోరారు. తన కుమార్తె మెడిషన్ చదవడానికి ఆశక్తి ఉన్నప్పటికీ స్థోమత లేనందున విశాఖపట్నం కార్పోరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివించటానికి ఆర్ధికంగా సహాయం చేయాలని పాడేరు మండలం గుత్తులపుట్ట గ్రామానికి చెందిన కే.రోజారమణి దరఖాస్తు సమర్పించారు. కొయ్యూరు మండలం మటంభీమవరం పంచాయతి కొమ్మనూరు, ఉడుత గ్రామాలకు చెందిన 35 మంది చిన్నారులు, 12 మంది గర్భిణీలు నివాసం ఉంటున్న తమ గ్రామానికి అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయా గ్రామ ప్రజలు వినతి సమర్పించారు. పాడేరు మండలం వి.కొత్తూరు గ్రామానికి సరైన రహదారి లేక పిల్లలు పాఠశాలకు, పంటలను సంతలను తీసుకెళ్లేందుకు, రేషన్ బియ్యం వాహనం రావడానికి సమస్యలు ఎదురవుతున్నాయని వి.కొత్తూరు గ్రామ సమన్వయ సంఘం అభ్యర్ధించింది. పాడేరు మండలం గిరిజన రైతు తనకు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పవర్ వీడర్ సబ్సిడీ పై సరఫరా చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. పాడేరు మండలం గొట్టులపుట్టు పంచాయతి గోపాలపురం గ్రామానికి చెందిన వంతల లక్ష్మణబాబు తనకు కేటాయించిన అటవీ హక్కు భూమిలో సిల్వర్ ఓక్ చెట్లు, మిరియాలు, కాఫీ సాగు గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేసినందున, భాద్యులను గుర్తించి శిక్షించాలని, తనకు నష్ట పరిహారం అందజేయాలని కోరుతూ దరఖాస్తు చేసారు.
రూ.1.24 కోట్ల బ్యాంకు లింకేజి
స్పందన కార్యక్రమంలో భాగంగా కొయ్యూరు మండలం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో కోయ్యురుకు చెందిన 48 మహిళా సంఘాలకు రూ.1.24 కోట్ల బ్యాంకు లింకేజి చెక్కును జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ లబ్దిదారులకు అందజేశారు. మహిళా సంఘాలు బ్యాంకు లింకేజిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలక్టర్ కోరారు.
ఐటిడిఎ క్వార్టర్లలో నివాసం ఉంటున్న పలువురు అధికారులు, ఉద్యోగులు గత కొంత కాలంగా క్వార్టర్ అద్దె చెల్లించలేదని, ఈ మేరకు కొన్ని నెలలుగా అద్దె వసూలు కానందున సుమారు రూ. 8.5 లక్షలు బకాయిలు పేరుకు పోయాయని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్ తెలిపారు. బకాయి అద్దెలు చెల్లించాలని ఆదేశించారు. కలక్టర్ స్పందిస్తూ అత్యధిక కాలంగా బకాయిలు చెల్లించని వారి క్వార్టర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో సంయుక్త కలక్టర్ జే. శివశ్రీనివాసు, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్, సహాయ కలక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డిఆర్‌ఓ పి. అంబేద్కర్, వివిధ శాఖల జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.










