ప్రజాశక్తి- కవిటి: మండలంలో ఇప్పుడిప్పుడే పొలం పనులు జరుగుతుంటే ఇలాంటి సమయంలో ఉపాధి పనులు చేపడితే ఇక రైతుల పని ఎవరు చేస్తారని పిఎసిఎస్ అధ్యక్షుడు దేవరాజు సాహు ఎపిఒ భాస్కరరావుని ప్రశ్నించారు. ప్రజలకు పనిలేని సమయంలో, ప్రజలు తమకు పని కావాలని అడిగిన సందర్భంలో ఉపాధి హామీ ద్వారా వారికి పని కల్పించాలని సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి ఎంపిపి కడియాల పద్మ అధ్యక్షతన శనివారం మండల సమావేశం నిర్వహించారు. ఎన్‌ఆర్‌జిఎస్, విద్యుత్ శాఖల తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. దేవరాజు సాహు మాట్లాడుతూ ఉపాధి హామీ సిబ్బంది ఇటీవల మాణిక్యపురం పంచాయతీలో ఒడియా ప్రజలను, భాషను కించపరిచే విధంగా మాట్లాడారని, దానికి పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అన్నారు. ఇకపై ఇలాంటివి జరిగితే చర్యలు తీవ్రస్థాయిలో ఉంటాయని ఎపిఒ భాస్కరరావుని హెచ్చరించారు. ఎంపిటిసి సభ్యుడు దుద్ది సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌జిఎస్ ద్వారా అందించే కొబ్బరి మొక్కలు నాటేందుకు తీసే గాతలు ఉపాధి హామీ ద్వారా చేపట్టాలని కోరారు. అలాగే వ్యవసాయ పనులకు ఉపాధి హామీ అనుసంధానం చేస్తే రైతులకు మేలు చేకూరుతుందని సూచించారు. మరోవైపు విద్యుత్‌శాఖ ఎఇ నేతాజీ తీరుపై వైస్ ఎంపిపి పూడి నేతాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో విద్యుత్ శాఖ పనితీరు బాగులేదని, కనీసం దాని గురించి మాట్లాడుదామని ఎఇకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని అన్నారు. పొలం పనుల సమయంలో రోజంతా విద్యుత్ నిలిపివేసి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఎఇ పనితీరు మార్చుకోవాలని సూచించారు. అనంతరం విద్య, వైద్యం, వ్యవసాయ, ఉద్యాన తదితర శాఖలపై సమీక్షించారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు కడియాల ప్రకాష్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు పూడి లక్ష్మణరావు, కో-ఆప్షన్ మెంబర్ పాండవ శేఖర్, ఎఎంసి వైస్ చైర్మన్ యలమంచి నీలయ్య, తహశీల్దార్ పి.శేఖర్, ఎంపిడిఒ సూర్యనారాయణరెడ్డి, మండల పరిషత్ ఎఒ కె.శ్రీనివాసరావు, సంతోష్, ఆర్‌ఐ రమణమూర్తి పాల్గొన్నారు.










