Oct 09,2023 00:40

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ప్రజాశక్తి- పిఎం పాలెం : చంద్రంపాలెం పాఠశాలలో పోస్టల్‌ శాఖ ఆధ్వర్యాన దీన్‌ దయాల్‌ స్పర్మ్‌ యోజన ఫిలాటెలీ క్విజ్‌ పరీక్షలు ఆదివారం నిర్వహించారు. విశాఖ డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ ఆర్‌.రాహుల్‌ పర్యవేక్షణలో పరీక్ష సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు, పోస్టల్‌ శాఖలో రకరకాల స్టాంపులుపై అవగాహన కల్పించేందుకు ఫిలాటెలీ క్విజ్‌ పేరిట పరీక్షలు దేశం మొత్తం నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు 428 మందికి అవకాశం కల్పించామని చెప్పారు. ప్రస్తుతం జరిగిన లెవెల్‌ -1 పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికైన వారిలో 160 మందిని ఎంపిక చేసి లెవెల్‌ -2కు పంపిస్తామని వెల్లడించారు. లెవెల్‌-2లో 16 రకాల పోస్టల్‌ స్టాంపులపై నాలుగైదు పేజీలు మించకుండా వాటి వివరాలను చక్కగా రాసిన వారిలో తరగతికి 10 మందిని చొప్పున 40 మందిని ఎంపిక చేస్తామని చెప్పారు. వీరికి ప్రోత్సాహంగా నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేలు స్కాలర్‌షిప్‌ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ డివిజన్‌ పోస్టల్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌, పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్లు, పోస్టు మాస్టర్లు, సబ్‌ పోస్టు మాస్టర్లు పాల్గొన్నారు.