Aug 04,2023 00:38

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న అతిథులు

ప్రజాశక్తి - గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ఫిజియోథెరపిస్ట్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించే రాష్ట్రస్థాయి 'ఫిజియో లీగ్‌ టి20' క్రికెట్‌ పోటీలు స్థానిక చౌడవరం ఆర్‌విఆర్‌ - జెసి ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో, నంబూరు ఎమ్మెస్‌కె క్రీడా మైదానాల్లో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ ఎన్‌.శరత్‌చంద్ర మాట్లాడుతూ గ్లోబలీకరణ నేపథ్యంలో ప్రపంచ మానవజాతిని క్రికెట్‌ ఒకచోటకు చేర్చి సుహృద్‌భావ వాతావరణంలో క్రీడా స్ఫూర్తిని అందిస్తోందని చెప్పారు. ఫిజియో లీగ్‌ టి20 చైర్మన్‌ డాక్టర్‌ ఎమ్‌డి ఇమ్రాన్‌ మాట్లాడుతూ కేవలం ఫిజియోథెరపీ డాక్టర్లతో 8 జట్లతో ఐదు రోజులు పాటు టోర్నీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు రూ.లక్ష నగదు బహుమతి, రోలింగ్‌ ట్రోఫీ, రన్నర్స్‌కు రూ.50 వేల నగదు బహుమతి, షీల్డ్‌ అందిస్తామని తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే లీగ్‌ క్రికెట్‌ పోటీలను టీవీ 2 ఛానల్‌ ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు. తొలుత క్రీడాజ్యోతిని వెలిగించి బెలూన్లను ఎగరవేశారు. 8 జట్ల కెప్టెన్లను అతిధులకు పరిచయం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు శివప్రసాద్‌, ముప్పరాజు వెంకట్రావు, డాక్టర్‌ షేక్‌ సుభాని, డాక్టర్‌ ఏడుకొండలు, రాజేష్‌ రోషన్‌, డాక్టర్‌ రాజేంద్ర, డాక్టర్‌ జోత్స్న తేజ తదితరులు పాల్గొన్నారు.