ప్రజాశక్తి - గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ఫిజియోథెరపిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్‌విఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ నంబూరు ఎం.ఎస్.కె క్రికెట్ మైదానంలో ఐదు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫిజియో క్రికెట్ లీగ్ టి20 విజేతగా విశాఖపట్నంకు చెందిన మార్వెల్ టీం నిలిచింది. రన్నరప్‌ను విజయవాడుకు చెందిన బిబిసి - ఎస్‌జిఎస్ సూపర్‌కింగ్స్ జట్టు సాధించింది. ఆయా జట్లకు రూ.లక్ష, రూ.50 వేలు చొప్పున నగదు బహుమతులు, షీల్డ్‌లను మంగళవారం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హారిక ఫిజియో విద్యా సంస్థల అధినేత షేక్ సుభాని మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో దశాబ్ద కాలం క్రితం ఏర్పడిన ఫిజియోథెరపీ ఫెడరేషన్ ఫిజియోథెరపీ రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుతోపాటు సభ్యుల సహకారంతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ ఫెడరేషన్ కమిటీ సభ్యులు, క్రికెట్ టోర్నీ విజయవంతంగా నిర్వహించడంలో ఫెడరేషన్ నాయకులు డాక్టర్ ఎన్.శరత్ చంద్రకుమార్, డాక్టర్ నాగసతీష్, డాక్టర్ బివి హరికృష్ణ ఇతర సభ్యులు, సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్వెల్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అధినేత ముప్పరాజు వెంకట్రావు, తులసి సర్జికల్స్ సంజీవ్ కుమార్, డాక్టర్ దయాకర్, డాక్టర్ ఏడుకొండలు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.










