కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించాలని, లేనిపక్షంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట కమిటీ కన్వీనర్ సిద్ధిక్ హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం డిఆర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గత ఏడాది ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 6,100 కానిస్టేబుల్స్, 411 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఏడాది జనవరి 22న ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించిందని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఫిజికల్ ఈవెంట్స్ మాత్రమే నిర్వహించలేదన్నారు వాస్తవానికి మార్చి 14న నిర్వహించాల్సి ఉండగా అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో వాయిదా వేశారన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఆరు నెలలు గడుస్తున్న వాయిదా వేస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నోటిఫికేషన్‌లో జైల్ వార్డెన్ పోస్టుల ప్రస్తావనే లేదన్నారు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత పోస్టులతో నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనయ్యారని పేర్కొన్నారు. ఇప్పుడు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించకుండా జాప్యం చేస్తూ నిరుద్యోగులను మరింత మోసం చేస్తున్నారన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ నరసింహులు, విజరు, యూసఫ్, సురేంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజేంద్ర, నగర అధ్యక్షులు సురేష్ పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు, నిరుద్యోగ అభ్యర్థులు










