ప్రజాశక్తి - పల్నాడు జిల్లాకరస్పాండెంట్ : కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యాశాఖాధికారులు తనిఖీలు చేసి నిబంధనలు పాటించని పాఠశాలలను సీజ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక మోర్ సెంటర్‌లోని జిల్లా విద్యా శాఖ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోటా సాయికుమార్, ఎస్.రాజు మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు సొంతంగా ముద్రించిన పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నాయని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్యా కానుక కిట్లు అందించాలని, ప్రతి ఒక్కరికీ అమ్మఒడిని వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆయా సమస్యలపై డిఇఒ స్పందిస్తూ ఎంఇఒలతో మాట్లాడి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు నవితా, రమా, అమూల్య, జిల్లా కమిటీ సభ్యులు జ్యోతిష్, రాఘవ, సిద్ధు పాల్గొన్నారు.










