
ప్రజాశక్తి-అనకాపల్లి
టిఎన్‌ఎస్‌ఎఫ్ ముద్రించిన 'ఫీజు ఎక్కడ కంస మామ? పోస్టర్‌ను టిడిపి అనకాపల్లి పార్లమెంట్ నియోజవర్గ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బుద్ద నాగజగదీశ్వరరావు, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రతి విద్యార్థికి విద్యాదీవెన సకాలంలో ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అనేకమైన కుంటి సాకులతో జిల్లాలో సుమారు 4,200 మంది విద్యార్థులకు ఫీజులు ఎగనామం పెట్టాడని ఆరోపించారు. కళాశాల యాజమాన్యాన్ని టీసీలను ఇవ్వాలని మొర పెట్టుకుంటే ప్రభుత్వం నుండి తమకు విద్య దీవెన సొమ్ము జమకాలేదని వారు చెబుతున్నారని తెలిపారు. ఇంట్లో ప్రతి విద్యార్థికి ''అమ్మ ఒడి'' ఇస్తానని చెప్పి కేవలం కుటుంబానికి ఒక్కరికీ మాత్రమే ఇచ్చి జగన్ రెడ్డి మోసం చేశాడన్నారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి నాగ వెంకటరమణ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచలేదన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవర శివ యాదవ్, నాయకులు పిట్ల హరీష్, సింగంపల్లి ప్రసాద్, ప్రగడ తేజ, గొసల కిషోర్, సంకర్ల సాయిదీప్, వరదా మోహన్ కాంత్, కసిరెడ్డి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.