గుంటూరు: నగరంలో ప్రకటనల బోర్డులకు సంబంధించిన ఫీజుల బకాయిల వసూలుకు ఈ నెల 25న ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో బకాయిలు చెల్లించిన ప్రకటనల బోర్డులకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని, ఈనెల 25న మీడియా డివైజ్ ఫీజుల బకాయిదార్ల నుండి ఫీజుల వసూలు చెల్లించనివారిపై చట్టపర చర్యలు తీసుకోవడానికి కార్యాచరణ సిద్దం చేయాలన్నారు. రోడ్ల విస్తరణ జరిగిన ప్రాంతాల్లో టిడిఆర్ బాండ్లు ఇచ్చేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్లు మూర్తి, కోటయ్య, ఏసిపిలు కాలేష, బాబురావు, అజరు కుమార్, అశోక్‌కుమార్, సర్వేయర్లు సునీల్ కుమార్, హరికృష్ణ, టిపిఎస్‌లు పాల్గొన్నారు.










