May 19,2023 19:41

సౌకర్యాలను పరిశీలిస్తున్న డిఎంహెచ్‌ఒ రామ గిడ్డయ్య

ప్రజాశక్తి - ఆదోని
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫెర్టిలిటీ కేంద్రాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ రామగిడ్డయ్య సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఆదిత్య నర్సింగ్‌ హోమ్‌లోని టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌ను ఎఆర్‌టి ఇన్‌స్పెక్షన్‌ టీం మెంబర్స్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసిస్టెండ్‌ రీ ప్రోడక్టివ్‌ టెక్నాలజీ అండ్‌ సిరోగసీ యాక్ట్‌-2021 నిబంధన ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లా స్థాయి ఎఆర్‌టి కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తామని వివరించారు. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను ఐదేళ్లకోసారి రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రేడియాలజీ హెచ్‌ఒడి డాక్టర్‌ రాధా రాణి, సోషియాలజిస్ట్‌ భారతి, డెమో శ్రీనివాసులు, పిసి అండ్‌ యాక్ట్‌ జిల్లా మానిటరింగ్‌ సుమలత, ఆదిత్య నర్సింగ్‌ హోమ్‌ డాక్టర్లు శ్రీనివాస్‌, జానకి, ఆదిత్య ఉన్నారు.
దోమలు వృద్ధి చెందకుండా అవగాహన కల్పించాలి
ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారమూ ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి నీటి నిల్వ లేకుండా, దోమలు వృద్ధి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.రామగిడ్డయ్య ఆదేశించారు. పట్టణంలోని యుపిహెచ్‌సి ఇందిరా నగర్‌లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా తనిఖీ చేశారు. వివరాలను ఫ్రైడే డ్రైడే యాప్‌లో క్రమం తప్పకుండా పొందపరచాలన్నారు. నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించినట్లయితే వివరాలను కంట్రోల్‌ హైజిన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసి సంబంధిత సచివాలయ సెక్రటరీ ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. యుపిహెచ్‌సి ఇందిరా నగర్‌ వైద్యాధికారి ఈశ్వర్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ వెంకటేశులు ఉన్నారు.

నీటి తొట్టెలను పరిశీలిస్తున్న వైద్యులు