కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాల హక్కులను ఒక్కొక్కటి కబళిస్తున్నది. జిఎస్‌టి కావచ్చు, నూతన విద్యా విధానం కావచ్చు, విద్యుత్ చట్ట సవరణలు కావచ్చు. సహకార చట్టంలో మార్పులు కావచ్చు, ఇలా ప్రతి అంశంలోను రాష్ట్రాల అధికారాలకు గండి కొట్టి, కేంద్రం తన పెత్తనాన్ని పెంచుకోజూస్తున్నది. తాజాగా బిఎస్‌ఎఫ్ అధికార పరిధిని విస్తరిస్తూ కేంద్ర హోం శాఖ ఏకపక్షంగా జారీ చేసిన ఆదేశాల్లో ఇది మరింత స్పష్టంగా అగుపిస్తోంది. భారత్-పాకిస్తాన్ యుద్ధం తరువాత తీసుకొచ్చిన బిఎస్‌ఎఫ్ యాక్ట్-1968 కింద 2014లో జారీ చేసిన ఆదేశాలను సవరిస్తూ కేంద్రం తాజా నోటిఫికేషన్‌ను విడుదలజేసింది. పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ వంటి రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, లడఖ్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లో బోర్డర్ నుంచి 50 కి.మీ పరిధిలో ఎవరినైనా సోదా చేయడానికి, అరెస్టు చేయడానికి లేదా వేటినైనా స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర భద్రతా బలగాలకు ఇది పూర్తి అధికారమిస్తుంది. ఇంతకుముందు ఈ పరిధి 15 కి.మీ.గా ఉండేది. రాజస్థాన్, గుజరాత్ లో 80 కి.మీ.గా ఉన్న పరిధిని ఇప్పుడు 50కి. మీ. కి తగ్గించింది. పంజాబ్‌లో సగభాగం బిఎస్‌ఎఫ్ పరిధిలోకి వెళ్లిపోతుంది. అస్సాంలోనూ ఇదే పరిస్థితి. భద్రత పేరుతో రాష్ట్రాల హక్కులను కబళించే కేంద్ర ప్రభుత్వ చర్యను పంజాబ్, పశ్చిమ బెంగాల్ తీవ్రంగా నిరసించాయి. అస్సాం ప్రజలు వ్యతిరేకిస్తున్నా, అక్కడి బిజెపి ప్రభుత్వం మాత్రం గమ్మున కూర్చొంది. ఈ ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేసింది. కాంగ్రెస్, టిఎంసి తదితర పార్టీలు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. సమాజంపై తీవ్ర ప్రభావం చూపే ఇటువంటి నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత రాష్ట్రాలను సంప్రదించడం కానీ, రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవడం కానీ జరగలేదు. ఇది మోడీ ప్రభుత్వ ఫెడరల్ వ్యతిరేక, నిరంకుశ పోకడలకు మరో తార్కాణం. శాంతి భద్రతలు అనేవి రాష్ట్రాల పరిధికి సంబంధించిన అంశం. భద్రత పేరుతోనో, మరో కారణం తోనో రాష్ట్రాల హక్కులను కాలరాయడం అనుమతించరానిది. దేశ భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు, తీవ్ర కల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే కేంద్రం జోక్యానికి అవకాశముంది. అప్పుడు కూడా రాష్ట్రాలను సంప్రదించాలని రాజ్యాంగ నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఏ విధంగా చూసినా కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఫెడరల్ సూత్రాలకే విరుద్ధం. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఉగ్రవాద ప్రమాదం పెరిగిపోతోందని, హెరాయిన్ వంటి డ్రగ్స్ దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, విదేశీయులు చొరబడుతున్నారని, వీటిని నివారించేందుకే బిఎస్‌ఎఫ్ బలగాలకు అధిక అధికారాలిచ్చామని కేంద్రం చెప్పడం చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ మేతకు అన్న చందంగా ఉంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డాగా ఉన్న గుజరాత్‌లో బిఎస్‌ఎఫ్ పరిధిని ఎందుకు తగ్గించినట్లు? ఇటీవల 3,200 కిలోల హెరాయిన్ కంటైెనర్ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడింది. 2019-20లో యు.పి, మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధికంగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 2018-19లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లలో పట్టుబడ్డాయి. పంజాబ్, బెంగాల్, అస్సాం అందులో ఎక్కడా లేవు. కేంద్రంలో యుపిఏ-2 ప్రభుత్వం బిఎస్‌ఎఫ్ పరిధిని విస్తరిస్తామన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోడీ ఆనాడు దానిని వ్యతిరేకించారు. ఇప్పుడదే వ్యక్తి సరిహద్దుల్లో విధులు నిర్వర్తించాల్సిన భద్రతా దళాలను జనావాసాల తనిఖీలకు, అనుమానం ఉన్న వ్యక్తులను నిర్బంధించేందుకు, ప్రాథమిక హక్కులను హరించేందుకు వినియోగించాలంటున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం కోసమే ప్రత్యేకంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉంది. ఆ సంస్థ సరిగా పని చేయకపోతే దానిని సమీక్షించాలి. అంతేకానీ, కేంద్ర దర్యాప్తు సంస్థలను, భద్రతాదళాలను అన్నిటిని కలగాపులగం చేసి రాష్ట్రాల అధికారాలను కబళించాలని చూడడం రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికే విరుద్ధం. ఫెడరలిజాన్ని దెబ్బతీసే ఈ చర్యను మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.










