Jul 22,2021 11:05

రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేసే చట్టాలు చెల్లవంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగింది. రాజ్యాంగ ఫెడరల్‌ స్ఫూర్తిని బలోపేతం చేసింది. సహకార సంఘాల నిర్వహణ విషయంలో యుపిఎ ప్రభుత్వం తీసుకువచ్చిన 97వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఈ మేరకు గుజరాత్‌ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్ధించింది. రాష్ట్రాల పరిధిలోకి వచ్చే వివిధ అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరింత దూకుడుగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా రైతాంగం వ్యతిరేకిస్తున్న వ్యవసాయ చట్టాల నుండి రోజువారి ఆర్థిక వ్యవహారాల వరకూ మోడీ సర్కారుది ఇదే తీరు! రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని సాకుగా చూపి కాలువలు, పిల్లకాలువల వరకు పెత్తనం చేయడానికి ఎలా తెగబడుతోందో తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. వ్యవసాయ చట్టాలను అమలు చేసేది లేదంటూ అనేక రాష్ట్రాలు శాసనసభల్లో తీర్మానాలు చేసి పంపినా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న రీతిల్లో మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజల కళ్ల ముందరే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో!
గతంలో ఎన్నడూ లేనివిధంగా సహకారం కోసమంటూ కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు, చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత నంతరించుకున్నాయి. సహకారమనే అంశమే కేంద్ర పరిధిలోకి రాదని, పూర్తిగా రాష్ట్రాల వ్యవహారమని సుప్రీం తేల్చివేయడం మోడీ సర్కారుకు చెంపపెట్టు లాంటది. తన పరిధిలోనే లేని అంశానికి సంబంధించి మోడీ ప్రభుత్వం మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి, రాష్ట్రాల వ్యవహారాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నట్టు ఇప్పుడు దేశ ప్రజలకు తేటతెల్లమైంది. నిజానికి సహకార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే దానిపై వచ్చిన విమర్శలను మోడీ ప్రభుత్వం బేఖాతరు చేసింది. ప్రతిపక్ష పార్టీలతో పాటు, పలువురు ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ నిపుణులు ఈ విషయమై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తినా అటు ప్రధానమంత్రి మోడీ కానీ, ఆ శాఖకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్‌షా కానీ నామమాత్రంగా కూడా స్పందించలేదు. తాజా తీర్పులో ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించే సహకార సంఘాలు రాజ్యాంగ సవరణ పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అది కూడా మెజార్టీ తీర్పు! దీనిని పరిగణనలోకి తీసుకున్నా దేశ వ్యాప్తంగా అటువంటి సహకార సంఘాల సంఖ్య దేశమంతటా కలిపితే కొన్ని వందలు మాత్రమే! అవి నిర్వహించే ఆర్థిక కార్యకలాపాల మొత్తం కూడా చాలా పరిమితమే! వీటికోసమే ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను నిర్వహిస్తారా? లేక వేరే ఉద్దేశ్యాలు, లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? రాజ్యాంగం మీద, న్యాయవ్యవస్థ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సహకార మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తి అదే! రాష్ట్రాలకే పరిమితమైన సహకార సంఘాలకు సంబంధించి ఆయా ప్రభుత్వాలు తగిన నిర్ణయాలు తీసుకోవచ్చని, చట్టాలు చేసుకోవచ్చని ధర్మాసనం ఏకగ్రీవంగా పేర్కొనడమే దీనికి నిదర్శనం. ఇంత స్పష్టంగా చెప్పిన తీర్పును కేంద్రం ఆచరిస్తుందా? లేక పెడచెవినపెడుతుందా?
దేశ ద్రోహ చట్టంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాలు దాని దుర్వినియోగం ఆపడం లేదు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తున్న రైతులపై హర్యానా ప్రభుత్వం ఇటీవల పెట్టిన కేసులే దీనికి నిదర్శనం. అన్నదాతల పట్లే ఇంత నిర్దయగా వ్యవహరిస్తూ సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నప్పుడు మిగిలిన అంశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పటికైనా ఇటువంటి ఏకపక్ష వైఖరిని కేంద్రం మానుకోవాలి. లేని పక్షంలో రాజ్యాంగ ఫెడరల్‌ స్ఫూర్తిని, రాష్ట్రాల హక్కులను కాపాడుకోవడానికి రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటిత ప్రతిఘటన నిర్మించాలి.