Mar 07,2023 01:15
వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోన

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: జగన్నామ సంక్షేమ సంవత్సరం పేరుతో బజరంగ్‌ ఫౌండేషన్‌ చేస్తున్న సేవలు నిరుపమానమని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బాపట్ల మండలం ముత్తాయ పాలెం గ్రామంలో బజరంగ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ఎమ్మెల్యే కోన రఘుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని అవయవాల్లో కళ్లు పధానమైనవని పేర్కొన్నారు. బజరంగ్‌ నేత్ర జ్యోతి వైద్య శిబిరంలో ప్రజలకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లజోళ్లు అందించే కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బజరంగ్‌ ఫౌండేషన్‌ సీఈవో అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. జగనన్న సంక్షేమ పాలన స్ఫూర్తిదాయకమని, చారిత్రాత్మకమైన ప్రజా సంక్షేమం కార్యక్రమాలను అందిస్తున్న జగనన్న పాలనకు సంఘీభావంగా, ఓ అనిర్వచనీయమైన భావోద్వేగంతో ఈ జగన్నామ సంక్షేమ సేవా సంవత్సరాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆరు శిబిరాలను ఏర్పాటు చేసి, సుమారు 6000 మందికి నేత్ర వైద్య సేవలను అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి అనుసంధానంగా ముత్తాయపాలెం పరిసర ప్రాంతాలలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను బజరంగ్‌ ఫౌండేషన్‌ సీఈవో అంబటి మురళీకృష్ణ అందజేశారు. నారీ రుతువు కార్యక్రమంలో భాగంగా ఆయా పాఠశాలల్లోని కిశోర బాలికలకు శానిటరీ నాప్‌కిన్‌లను ఫౌండేషన్‌ తరపున అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీపీ చిన్న పోతుల హరిబాబు, సీనియర్‌ వైసీపీ నాయకులు, ప్రముఖ న్యాయవాది కళ్లం హరినాథరెడ్డి పాల్గొన్నారు.