Jul 19,2023 23:10

కిట్లను అందజేస్తున్న మీనాక్షి

- డిఎంహెచ్‌ఒ మీనాక్షి
ప్రజాశక్తి- లావేరు: 
దోమకాటుతో వచ్చే వ్యాధుల్లో బోదకాలు (పైలేరియా) ఒకటని, బోదకాలు నివారణకు చర్యలు చేపడుతున్నామని డిఎంహెచ్‌ఒ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. మండలంలోని అదపాకలో బోదకాలు నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం అవగాహన కల్పించారు. గ్రామంలో ఉన్న 48 మంది బాధితులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రెండేళ్లగా బోదకాలు (పైలేరియా) వ్యాధి కొత్త కేసులు నమోదు కాలేదన్నారు. ప్రస్తుతం జిల్లాలో 2616 కేసులు ఉన్నాయని తెలిపారు. వీరందరికీ వ్యాధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. వ్యాధి సోకిన వారు తమ కాళ్లలను ఏలా శుభ్రం చేసుకోవాలి అన్నదానిపై వైద్య సిబ్బంది చేసి చూపించారు. వ్యాధి నివారణకు ముఖ్యంగా గ్రామాల్లో దోమల లార్వా నివారణకు సంబంధించిన మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి మండలంలోని ఎంపిడిఒ కార్యాలయంలో మందులు అందుబాటులో ఉన్నాయిని పేర్కొన్నారు. దీంతో పాటు గ్రామాల్లో పాంగింగ్‌ చేయాలన్నారు. జిల్లాలో జూలై నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 6 మలేరియా, రెండు డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. జిల్లా అంతటా యాంటీబార్వా ద్రావణం పంపిణీ చేస్తున్నామని వివరించారు. జిల్లాలో 504 వైఎస్‌ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ ఆధ్వర్యాన ఫీవర్‌ సర్వే చేయించామన్నారు. ప్రతి క్లినిక్‌లోనూ డెంగీ, మలేరియా కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాలనుగుణంగా వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం అన్ని పిహెచ్‌సిల్లో మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణ అధికారి వి.వి.సత్యనారాయణ, మురపాక వైద్యాధికారి వైద్యాధికారిణి సౌమ్య, వైద్య సిబ్బంది శ్యామసుందర్‌ పాల్గొన్నారు.