గత కొంత కాలంగా దేశానికి ఒక మూలనున్న ప్రధానమైన భూభాగం నుండి...400 కిలోమీటర్ల దూరంలో వున్న...అందమైన లక్షద్వీప్ గురించి జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరుగుతున్నది. నిజానికి దేశవ్యాపితంగా ఈ చర్చ జనం మధ్యకు ఈపాటికే వచ్చేయాలి. ఎందుకంటే బిజెపి రూపంలో పచ్చి మితవాద హిందూత్వ శక్తులు గుజరాత్, కాశ్మీర్ లోయలో మాదిరిగానే దీనిని కూడా తమ మతోన్మాద రాజకీయాలకు అడ్డాగా మారుస్తున్నారు. ఈ దాడి లక్షద్వీప్‌తో ఆగదు. అండమాన్ నికోబార్, డయ్యూ డామన్ వంటి ఇతర ద్వీపాలకు కూడా విస్తరించనున్నది. కాశ్మీర్ లాగా లక్షద్వీప్ కూడా భారత రాజ్యాంగం (370 అధికరణం) ధృవీకరించే లౌకిక, సమాఖ్య, ప్రజాతంత్ర విలువలకు ప్రతిరూపం. వీటిని ఒక్కొక్కటిగా ధ్వంసం చేయడం ద్వారా ఆర్.ఎస్.ఎస్ అసలు లక్ష్యమైన రాజ్యాంగ విధ్వంసం పూర్తవుతుందని అనేకమంది మేధావులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు గట్టిగా వాదిస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్షద్వీప్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
సహజంగానే ద్వీపాలు ప్రకృతి అందాలకు నిలయంగా ఉంటాయి. ఈ అందాలతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు అవసరమైన అనేక ప్రకృతి రహస్యాలు వీటిలో ఇమిడి వుంటాయి. సహజంగానే లాభాపేక్షతో నడిచే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రకృతి అందాలను, మానవాళికి అవసరమైన ప్రకృతి లోని అనేక ప్రక్రియలను కూడా వ్యాపారమయం చేస్తుంది. ఇప్పుడు లక్షద్వీప్‌ను బిజెపి సర్కార్ లక్ష్యంగా ఎంచుకోవడంలో ఇది ఒక కీలక అంశం. అయితే దానిని మించి వారి హిందూత్వ ఎజెండాలో కాశ్మీర్ లోయ తరువాత లక్షద్వీప్ సరిగ్గా సరిపోతుంది. లక్షద్వీప్ అనేది 36 చిన్న చిన్న ద్వీపాల కలయిక. కేవలం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. జనాభా 70 వేల లోపు. ఇది అరేబియా మహా సముద్రంలో కేరళ లోని కొచ్చిన్ ఓడరేవుకి దగ్గరలో వుండే ద్వీపం. తరతరాలుగా కేరళ రాష్ట్రానికి ఈ ద్వీపంతో చారిత్రక, సామాజిక, వ్యాపార పరమైన బలమైన బంధాలు వున్నాయి. అత్యధికులు మాట్లాడే భాష మళయాళం. ఈ ద్వీపం కేరళ హైకోర్టు పరిధిలో వుంది. జనాభాలో 96 శాతం ముస్లింలు, పైగా వీరందరూ ఎస్.టి కేటగిరీలో వున్నారు. చేపలతో పాటుగా అనాదిగా గొడ్డుమాంసం వీరి ప్రధాన ఆహారం. అత్యధికుల వృత్తి చేపల వేట. ఇక్కడ ఒకే ఒక్క ప్రభుత్వ డెయిరీ నడుస్తున్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ద్వీపానికి అడ్మినిస్ట్రేటర్‌గా మొట్టమొదటసారి ఐ.ఎ.ఎస్. అధికారి కానటువంటి 'ప్రఫుల్ ఖోడా పటేల్'ను 2020 డిసెంబర్‌లో పంపింది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈయన హోం మంత్రిగా పనిచేశారు. ఈయన తండ్రి గుజరాత్‌లో ప్రముఖ ఆర్.ఎస్.ఎస్ నాయకుడు. దాద్రా నగర్ హవేలికి ఏడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మోహన్ దేల్కర్ తన ఆత్మహత్యా నోట్ (సూసైడ్ నోట్)లో తన మరణానికి కారణంగా పేర్కొన్న 15 మందిలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న ఈ పటేల్ ఒకరు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన 'సిట్' విచారణ జరుపుతున్నది. డయ్యూ డామన్‌కి కూడా అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నారు. ఈయన అడుగు పెట్టిన వెంటనే హిందూత్వ ఎజెండాను ముందుకు తెచ్చారు.
ముప్పేట దాడి
సరిగ్గా కాశ్మీర్ ప్రత్యేక హోదాని రద్దుచేసిన పద్ధతిలోనే లక్షద్వీప్‌లో ఉన్న ప్రజల చారిత్రక, సాంస్కృతిక పునాదులపైనే దాడి ప్రారంభించారు. లక్షద్వీప్ డెవలప్‌మెంటు అధారిటీ రెగ్యులేషన్ చట్టం 2021, అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం 2021 (గూండా యాక్ట్), జంతు సంరక్షణ చట్టం 2021 వంటివి రూపొందించారు. వీటితో పాటుగా సున్నితమైన పర్యావరణాన్ని నాశనం చేసే...గనులు తవ్వకం, ఖనిజాలను భూగర్భం నుండి తోడేయటం వంటి పనులకు అనుమతులు ఇవ్వనారంభించారు. ఎక్కడా 5 కిలోమీటర్లు నిడివి రోడ్డు లేని ఈ చిన్న ద్వీపంలో పర్యాటకుల కోసం రోడ్లు వెడల్పు చేయనున్నారు. హైవేలు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. అందుకు స్థానిక ప్రజల నివాసాలు కూల్చి వారిని తరిమివేయటం ఖాయం. అలాగే భూములను ఆదివాసీ చట్టం నుండి బయటకు లాగి ప్రయివేటు కార్పొరేట్ శక్తులకు కుదవబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. పక్కనే ఉన్న చిన్న దేశం మాల్దీవులు మాదిరిగా లక్షద్వీప్‌ని పర్యాటక స్వర్గంగా మారుస్తామంటున్నారు. అంటే పర్యావరణం గుల్లయిపోతుంది. వీటికి తోడు గొడ్డు మాంసం అమ్మటం, నిల్వ చేయడం, తినటం వంటి వాటిని చట్టరీత్యా నేరంగా మారుస్తూ కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలలో లాగా చట్టాలను తెచ్చారు. బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూ నుండి మాంసం, గొడ్డు మాంసం, చికెన్ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దశాబ్దాలుగా ఈ ద్వీపంలో కొనసాగుతున్న మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. సముద్రతీర పరిరక్షణ చట్టం పేరిట మత్స్యకారులు చేపల వేట కోసం ఏర్పరచుకున్న కట్టడాలన్నీ కూల్చివేశారు. ఉన్న ఒక్క ప్రభుత్వ డెయిరీ ఫామ్‌ని ఎత్తివేసి గుజరాత్‌లోని అమూల్ డెయిరీ నుండి పాలు, పాల ఉత్పత్తులు కొనాలని ఆదేశించారు. వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులను అర్ధంతరంగా తొలగించేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేశారు. కేరళ (మళయాళ సమాజం) నుండి లక్షద్వీప్ ప్రజలను, వారి బంధాలను విడగొట్టడానికిగాను వ్యాపార లావాదేవీలను కొచ్చి లోని 'బైపోర్' ఓడరేవు నుండి కాకుండా బిజెపి పాలిత కర్నాటక రాష్ట్రం లోని మంగుళూరు పోర్ట్ నుండి జరగాలని ఆదేశించారు. అలాగే లక్షద్వీప్‌ను కేరళ హైకోర్టు పరిధి నుండి తొలగించి కర్నాటక హైకోర్టు పరిధి లోకి మారుస్తున్నారు. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్నవారు పంచాయతీ ఎన్నికలకు అనర్హులని చట్టం చేశారు. దేశంలోనే అతి తక్కువ జననాల రేటు (1.6 శాతం) ఉన్న ప్రాంతమిదే. కాశ్మీర్ లోనే కాదు. దేశ వ్యాపితంగా గిరిజన ప్రాంతాలలో ఆదివాసీలు కానివారికి భూములు కొనే హక్కు వుండదు. లక్షద్వీప్‌లో ప్రజలు తమ భూమిపై ఉన్న యాజమాన్య హక్కును 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలని, లేకుంటే భారీ మొత్తంలో అపరాధ రుసుం చెల్లించాలని, లేదా శాశ్వతంగా యాజమాన్య హక్కు కూడా కోల్పోవాల్సి వుంటుందని ఇప్పుడు పటేల్ ఆదేశాలిస్తున్నారు. వెరసి ఈ అడ్మినిస్ట్రేటర్‌కు కేంద్ర ప్రభుత్వం సర్వాధికారాలను కట్టబెట్టినట్టు కనబడుతున్నది. స్థానిక ప్రజలతో కాని, స్థానిక సంస్థలతో కాని ఏ విషయమూ చర్చించాల్సిన అవసరం లేకుండా చట్టాలను సవరిస్తున్నారు. ఈ తతంగమంతా 'నీతి ఆయోగ్'కి అప్పగించారు. ప్రస్తుతం పది వేలుగా ఉన్న పర్యాటకుల సంఖ్యను రానున్న కాలంలో 10 లక్షలకు పెంచుతామనినీతి ఆయోగ్ ప్రకటిస్తున్నది. అంటే ఇక లక్షద్వీప్ అనేది ధ్వంసమైపోతుంది.
రేగుతున్న ఉద్యమం
''లక్షద్వీప్‌ను రక్షించండి'', ''ఖోడా పటేల్‌ను తొలగించాలి'', ''ప్రజా వ్యతిరేక, పర్యావరణ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి'' అన్న నినాదాలు లక్షద్వీప్‌లో మార్మోగుతున్నాయి. బిజెపి మినహాయించి మిగిలిన అన్ని పార్టీలతో ఏర్పడ్డ ''సేవ్ లక్షద్వీప్'' పేరిట ఉద్యమం రోజురోజుకు బలపడుతున్నది. ఈ రోజు లక్షద్వీపాన్ని ఖోడా పటేల్ వైరస్ ఆవహించిందని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. వీటి ప్రకంపనాలు కేరళలో విస్తరిస్తున్నాయి. తమిళనాడులో కూడా సంఘీభావ కార్యక్రమాలు మొదలయ్యాయి. దేశం లోనే నేరాల పట్టికలో అతి తక్కువ స్థాయిలో వున్న ఆ ద్వీపంలో పటేల్ గారు అడుగుపెట్టిన నాటి నుండి గూండా యాక్ట్ కింద అనేకమందిని కనీస విచారణ లేకుండా అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా...లక్షద్వీప్‌లో ప్రారంభమైన ప్రజా పోరాటాన్ని అణచడానికి ఆందోళనకారులను ఈ గూండా యాక్ట్ కిందే నిర్బంధిస్తున్నారు. పటేల్ కు బహిరంగంగా లేఖ రాశారన్న నెపంతో ముగ్గురు బడిపిల్లలను అరెస్టు చేశారు. నీతి ఆయోగ్ పెద్దలు, స్థానిక కలెక్టర్ తాజాగా లక్షద్వీప్ లోని ఆందోళనకారుల పైన, వారికి మద్దతుగా కేరళ, తమిళనాడులలో జరుగుతున్న ఆందోళనల పైన విషంగక్కుతూ ప్రకటనలు చేస్తున్నారు. 70 యేళ్లగా అభివృద్ధికి నోచని లక్షద్వీప్‌ను బిజెపి ప్రభుత్వం పథకం ప్రకారం అభివృద్ధి చేయబూనుకుంటే దాన్ని అడ్డుకుంటున్నారని శాపనార్ధాలు పెడుతున్నారు. కాని మరో పక్క అనేకమంది మేధావులు, రచయితలు ఈ వాదనలను తిప్పికొడుతున్నారు. కేరళ ప్రముఖ నటి గీతు మోహన్‌దాస్ ''లక్షద్వీప్ ప్రజల ఆక్రందనలు, మనోవ్యధను వాస్తవికంగా అర్ధం చేసుకోవాలి'' అని కోరారు. ఇలా వుండగా లక్షద్వీప్ ప్రజల జీవితంపై ''ఫ్లష్'' వంటి చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ చిత్ర దర్శకురాలు ఆయేషా సుల్తానా పై రాజద్రోహం కేసు పెట్టారు. లక్షద్వీప్ లోని సర్పంచ్ డా|| మునీర్ ''కేంద్ర ప్రభుత్వానికి మేం అక్కరలేదుగాని...మా భూమి మాత్రం కావాలా?'' అని ప్రశ్నిస్తూ... ''ఇది ఒక రకంగా ఆంతరంగిక వలస వాదంగా తయారయింది'' అంటున్నారు. లక్షద్వీప్ విధ్వంసానికి కారకుడైన ప్రఫుల్ల పటేల్‌ని తొలగించాలని కేరళ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. తమిళనాడు ముఖ్యమంత్రి సైతం తీవ్ర పదజాలంతో ప్రకటన చేశారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు తీవ్రమైన చర్చ చేయడమే కాకుండా ప్రధానికి ఉత్తరం రాశాయి. 93 మంది మాజీ ఐఎఎస్ అధికారులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతూ ప్రధానికి లేఖ రాశారు. తాజాగా లక్షద్వీప్ బిజెపి లోనూ ముసలం పుట్టింది. బిజెపి కి చెందిన 15 మంది నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అందులో లక్షద్వీప్ శాఖ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హమీద్, వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు ఉముల్ ఖులూస్ వంటి ప్రముఖులున్నారు. ఆఖరికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కూడా ''ద్వీపవాసుల ఆవేదన లోని నిజాన్ని వాళ్ల నుండి, వారి ప్రజా ప్రతినిధుల నుండి తెలుసుకున్నాక ఏ నిర్ణయమైనా చేయడం మంచిది. కాని అలా జరగకపోవడం దురదృష్టకరం'' అని ప్రకటించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధానమంత్రి గానీ ఏమీ పట్టనట్టు నోరు మెదపడంలేదు. ఈ తంతు అంతా చూస్తుంటే కాశ్మీర్‌లో 370 అధికరణం రద్దు సమయంలో మాదిరిగానే కనబడుతోంది. లక్షద్వీప్ మీద దాడి ద్వారా మొత్తం మైనారిటీల మనోభావాలను, ఆదివాసుల భూ హక్కులను కాలరాచే ప్రక్రియ మరింత ముమ్మరం అయింది. ఇది అక్కడతో ఆగుతుందనుకోవడం తెలివితక్కువతనం. స్థానిక సంస్థలను, ప్రజాత్రినిధులను ఒక్క మాటలో చెప్పాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నే హిందూత్వ ఫాసిస్టు శక్తులు అపహాస్యం చేస్తున్నాయి. 1935లో జర్మనీలో ఫాసిస్టు నాజీలు 'లెబర్ స్రౌమ్ (నివశించడానికి జాగా) పేరిట జర్మనేతరులపై మారణకాండ సృష్టించారు. ఈరోజు అదే పద్ధతి లక్షద్వీప్‌లో కనపడుతోందని అనేకమంది హెచ్చరిస్తున్నారు. లక్షద్వీప్‌లో స్థానిక ప్రజలు...ఈ మతోన్మాద నయా ఉదారవాద పాలనకు వ్యతిరేకంగా సల్పుతున్న పోరాటానికి మద్దతుగా... కేరళ, తమిళనాడుల లోనే కాదు. దేశవ్యాపితంగా ప్రజలందరూ గొంతు కలపాల్సిన సమయమిది.
ఆర్. రఘు - వ్యాసకర్త సిపిెఎం తూర్పు కృష్ణా జిల్లా కార్యదర్శి










