ఫాసిజం మీద తిరుగులేని విజయాన్ని సోవియట్ రెడార్మీ సాధించి బెర్లిన్ రీచ్‌స్టాగ్ భవనంపై ఎర్ర జెండా ఎగరేసి నేటికి 76 సంవత్సరాలు! అత్యంత పాశవికంగా, నిరంకుశంగా ఇతర దేశాల స్వాతంత్య్రాన్ని, స్వంత దేశాలలో సైతం ప్రజాస్వామ్యాన్ని అణచివేసి ప్రపంచ మానవాళికే పెను సవాలుగా హిట్లర్ ఫాసిజం పరిణమించింది. హిట్లర్ తో చేతులు కలిపి ఇటలీ అధినేత ముసోలినీ, జపాన్ ప్రభువు టోజో అక్షరాజ్య కూటమిగా ఏర్పడ్డారు. యావత్ ప్రపంచాన్నీ తమ కైవసం చేసుకోవాలని మారణహోమం తలపెట్టారు. సోవియట్ సేనలు కామ్రేడ్ స్టాలిన్ నేతృత్వంలో, ఆ మహానేత రచించిన అపూర్వమైన వ్యూహాన్ని దిగ్విజయంగా అమలు చేశాయి. యుద్ధం మొదలైన తొలి నాళ్ళలో పొందిన విజయాలను చూసుకుని తమకీ ప్రపంచంలో ఎదురే లేదని విర్రవీగిన హిట్లర్ సైన్యాలను మట్టి కరిపించాయి. ప్రపంచానికి పట్టిన ఫాసిస్టు చీడను వదిలించాయి. ఆ విజయ స్ఫూర్తితో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా లలో శతాబ్దాల వలస పాలనకు వ్యతిరేకంగా జాతీయోద్యమాలు వెల్లువెత్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలు నెలకొన్నాయి.
ఒకే జాతికి ప్రపంచాన్ని ఏలే అర్హత ఉందన్న జాతి దురహంకారం ఫాసిజం ప్రధాన లక్షణం. ఆ ఫాసిజం ఓడిపోవడంతో, ప్రపంచం అంతటా అసంఖ్యాకంగా ఉన్న జాతులు, వాటి వాటి భిన్న, విశిష్ట సంస్కృతులు, స్వేచ్ఛా గానాలు చేయగలిగాయి. భారతదేశంలో సైతం జాతుల స్వయం నిర్ణయాధికార హక్కుల కోసం వీర తెలంగాణ సాయుధ పోరాటం, ఐక్య కేరళ, సంయుక్త మహారాష్ట్ర, కాశ్మీర్ తదితర ప్రాంతాలలో ఉవ్వెత్తున జరిగిన ప్రజా ఉద్యమాలే నేటి భారత దేశపు ఫెడరల్ వ్యవస్థకు ప్రాతిపదికనేర్పరిచాయి. ఆ ఉద్యమాలు దేశ వ్యాప్తంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న జాతీయోద్యమానికి సంపూర్ణత్వాన్ని కల్పించాయి.
1930 దశకంలో ఏర్పడిన పెట్టుబడిదారీ సార్వత్రిక సంక్షోభం ఫాసిస్టు శక్తులు తలెత్తడానికి దోహదం చేసినట్టే 2008 నుండి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పెట్టుబడిదారీ సంక్షోభం ఆయా దేశాలలో నయా ఫాసిస్టు లక్షణాలున్న పార్టీలను, అధినేతలను అధికారంలో కూచోబెట్టడానికి దోహదం చేసింది. డొనాల్డ్ ట్రంప్, బోల్సనారో, పుతిన్, మక్రాన్, ఎర్డొగన్, డ్యుటుర్టె వంటి వారంతా ఆ కోవలోనివారే. వారి సరసన మోడీ కూడా నిలుస్తాడు.
ఆనాడు ఫాసిస్టు ప్రమాదం గురించి ముందు నుంచే ప్రపంచాన్ని స్టాలిన్ హెచ్చరించాడు. కాని తమ అతితెలివి రాజకీయాలతో బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి పెట్టుబడిదారీ దేశాలన్నీ ఆ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడమేగాక, హిట్లర్ పట్ల సానుకూలంగాను, మెతకగాను వ్యవహరించాయి. అదే హిట్లర్ కు కొమ్ములు తెచ్చింది. అదే విధంగా మన దేశంలో బిజెపి హిందూత్వ రాజకీయాల ప్రమాదం గురించి సిపిఎం, ఇతర వామపక్షాలు అద్వానీ రథయాత్ర నాటి నుండీ హెచ్చరిస్తూనే వున్నాయి. కాని కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు ఆ హెచ్చరికలను తోసిపుచ్చాయి. కేవలం బిజెపి పట్ల మెతకగా వ్యవహరించడమే గాక, తాను కూడా హిందూత్వ వాదినేనని చెప్పుకోడానికి కాంగ్రెస్ తాపత్రయ పడుతూనే వుంది. ఇక ప్రాంతీయ పార్టీలన్నీ దాదాపుగా బిజెపితో ఎప్పుడో ఒకప్పుడు అంటకాగినవే.
ఇప్పుడు తమ పార్టీకే స్వంతంగా లోక్‌సభలో మెజారిటీ రావడంతో తన అసలు రూపం బైట పెట్టింది బిజెపి. అన్ని విధాలా దేశాన్ని, ప్రజల జీవితాలను, ప్రజాస్వామ్య వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోంది. ఈ కరోనా మహమ్మారి సృష్టించిన విలయంలో ప్రజలను ఆదుకునే మాట అటుంచి ప్రత్యక్ష నరకం చూపిస్తోంది.
బిజెపి అసలు స్వరూపం స్పష్టంగా బైటపడిన తర్వాతనైనా కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు ఇన్నాళ్ళూ తామనుసరించిన వైఖరులు ఎంత నష్టదాయకమో గ్రహించాలి. దేశంలో తిరిగి జాతీయోద్యమ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని బలంగా నెలకొల్పడానికి కలిసిరావాలి. ఆ విధంగా వాటిలో మార్పు వస్తుందా, రాదా అన్నది కాలం నిర్ణయిస్తుంది. కాని ఒకటి మాత్రం స్పష్టం. ఆనాడు ఏవిధంగా హిట్లర్ ఫాసిస్టు మూకల్ని సోవియట్ ప్రజాసైన్యం మట్టిగరిపించిందో, రానున్న కాలంలో మన దేశంలో కూడా బిజెపి ఫాసిస్టు విధానాల భరతం పట్టబోయేది ప్రజా పోరాటాలే. అప్రతిహతంగా కొనసాగుతున్న రైతన్నల ఆందోళన రాబోయే పరిణామాలకు సంకేతం.










