
ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫార్మసీ విభాగంలో ఐదుగురు సిబ్బంది ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారు. దీంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల డి-ఫార్మాసి చదువుతూ అసుపత్రిలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు ఉద్యోగుల్లా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్యులు రాసిన మందులు కాకుండా వేరే మందులు శిక్షణ విద్యార్థులు రోగులకు ఇస్తే దానికి భాధ్యత ఎవరు తీసుకుంటారన్నది జిల్లా అసుపత్రిలో అందరి నోట వినిపిస్తున్నమాట...
శ్రీ సత్య సాయి జిల్లాలో జిల్లా స్థాయి హోదా హిందూపురం ప్రభుత్వ అసుపత్రికి ఉంది. అయితే హోదాకు తగ్గట్టు సిబ్బంది లేకపోవటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ అసుపత్రికి హిందూపురం పట్టణ ప్రజలే కాకుండా మడకశిర, పెనుకొండ, గోరంట్ల తదితర ప్రాంతాలతో పాటు కర్నాటక రాష్ట్రం నుంచి సైతం ఇక్కడి వైద్య సేవల కోసం వస్తుంటారు. రోజుకు కనీసం 800 నుంచి వెయ్యిమంది వరకు రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులను రాసి ఇస్తారు. ఈ మందుల పంపిణీ కోసం ప్రభుత్వం ఒక ఫార్మసీ సూపర్‌వైజర్, ఒక గ్రేడ్1 ఫార్మాసిస్టు, ముగ్గురు గ్రేడ్-2 ఫార్మాసిస్టులు మొత్తం ఐదుగురిని కేటాయించింది. అయితే ఇక్కడ ఫార్మసి సూపర్‌వైజర్ మాత్రమే ఉన్నారు. గ్రేడ్-1 ఫార్మాసిస్టు పోస్టు ఖాళీగా ఉంది. ముగురు గ్రేడ్-2 ఫార్మాసిస్టులు ఉండాల్సుండగా కాంట్రాక్టు పద్దతిన ఒకరిని నియమించారు. ఇంత పెద్ద అసుపత్రికి కేవలం ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరే అసుపత్రిలో 7 వార్డులకు, సిఒటికి అవసరమైన మందులను అందిచాల్సుంది. దీంతో పాటు ఇచ్చిన ఇండెంట్ మేరకు మందులు వచ్చాయాలేదా అని చూసుకోవాల్సుంది. మందులు తక్కువ వస్తే చుట్టు పక్కన ఉన్న ఏరియా, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల నుంచి అవసరమైన మందులను తెప్పించుకుని, వీరికి సరఫరా అయిన వెంటనే వారికి ఆ మందులను పంపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైద్యులు పరీక్షలు నిర్వహించి రాసి ఇచ్చిన మందులను రోగులకు ఇవ్వాల్సిన బాధ్యతను శిక్షణ విద్యార్థులకు అప్పగించారు. శిక్షణ కోసం వచ్చిన విద్యార్థులు వైద్యులు రాసిన మందులు అర్థం కాక ఇతర మందులను రోగులకు ఇస్తే దాని భాధ్యత ఎవరు తీసుకోంటారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలకులు, అధికారులు స్పందించి ఆసుపత్రిలోని ఫార్మసీి విభాగానికి వెంటనే పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి, శిక్షణ కోసం వస్తున్నా విద్యార్థులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు వచ్చే రోగులకు నాణ్యమైన మందులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అన్నింలా విద్యార్థులే : హిందూపురం పట్టణంలో బాలికల పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఈ కళాశాలలో రెండు సంవత్సరాల కాల వ్యవదితో డి-ఫార్మసీ కోర్సు ఉంది. ఆ విభాగంలో 55 మంది విద్యార్థులకు గాను ప్రస్తుతం 42 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చదువుతున్నారు. రెండు సంవత్సరాలు పూర్తి అయిన విద్యార్థులకు ఫార్మసి కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఫార్మసి కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు మూడు నెలల పాటు వివిధ ప్రభుత్వ అసుపత్రుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అలా శిక్షణ కోసం వచ్చిన విద్యార్థులను పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సిన ఫార్మసి విభాగం వారు అన్నింటా విద్యార్థులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. శిక్షణలో ఉన్న విద్యార్థుల పక్కన ఫార్మసిస్టులు ఉండి మందులకు సంబందించి సమగ్రంగా వివరించాల్సిన అవసరం ఉంది. అయితే సిబ్బంది పూర్తి స్థాయిలో లేక పోవడంతో శిక్షణ విద్యార్థులనే అన్నింట వినియోగించుకుంటున్నారు.