ప్రజాశక్తి -తగరపువలస : ఫార్మసీ రంగంలో అపారంగా ఉపాధి అవకాశాలున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక అవంతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో శనివారం 'ఎపోథెకె-2 కె 23' పేరిట ఏర్పాటుచేసిన సదస్సును అవంతి విద్యా సంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.ప్రియాంక ప్రారంభించారు. చిప్పాడ దివీస్ లేబొరేటరీస్ జనరల్ మేనేజర్ వైఎస్.కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫార్మసీ రంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూనే అందుకు అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. గౌరవ అతిథి, విశాఖ ఐఆర్‌ఎస్ ఫార్మా డైరెక్టర్ ఐ.రాజ్‌గోపాల్ మాట్లాడుతూ, ఫార్మసీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ఎయు ఎఐపిఎస్ విశ్రాంత ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ, ఫార్మసీ రంగంలో వస్తున్న మార్పులు, ప్రాధాన్యతను వివరించారు. ఎయు కాలేజీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.ఈశ్వర్‌కుమార్ మాట్లాడుతూ, ఎంచుకున్న రంగంలో పట్టు సాధించాలని విద్యార్థులకు స్పష్టం చేశారు. అవంతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎంబి.వెంకటపతిరాజు, వైస్ ప్రిన్సిపల్ వి.ఉమాశంకర్, అవంతి విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎ.చంద్రశేఖర్, పరిపాలనాధికారి ఎం.సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులకు అవంతి విద్యా సంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.ప్రియాంక తదితరులు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.










