Jun 20,2023 00:16

రాంకీ తవ్విన చెరువు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - పరవాడ
ఫార్మాసిటీలో రాంకీ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా తానాం సమీపంలో వ్యర్థ జలాల కోసం నిర్మించిన పాండ్‌పై సోమవారం పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇఇ నాగేంద్ర రెడ్డి విచారణ చేపట్టారు. రాంకీ నిర్మించిన పాండ్‌పై గతంలో స్పందనలో కలెక్టర్‌కు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ పిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ పాండ్‌ను పూడ్చి వేయాలని కలెక్టర్‌, రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఆర్డర్‌ ఇచ్చినా సంబంధించిన అధికారులుగాని, రాంకీ యాజమాన్యం కాని పూడ్చి వేయలేదని నాడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సోమవారం పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ నాగేంద్రరెడ్డి, ఏఈ శ్రీనివాసరావు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ సైంటిస్ట్‌ శ్రీరామ్‌ సంబంధిత ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా పరిశ్రమల రసాయనిక వ్యర్థ జలాలు కాలువలో వస్తున్నాయని గుర్తించినట్లు ఈఈ తెలిపారు. పది రోజుల్లో రాంకీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ చేసి సమగ్రంగా చర్యలు చేపడతానని ఈఈ హామీ ఇచ్చారు. కొత్తగా బాధ్యతలు చేపట్టానని, వీటిపై పూర్తిగా అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి పైల జగన్నాథరావు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.