Dec 21,2022 00:46

మృతిచెందిన బాలుడు

ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌లోని డిపాల్‌ స్కూల్లో చదువుతున్న ఏడేళ్ల బాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మంగళవారం ఉదయం తల్లితో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నసమయంలో ఇందిరా పార్క్‌ సమీపంలో యూటర్న్‌ తీసుకుంటుండగా ఫార్మా బస్సు ఢకొీంది. ఈ ఘటనలో ఎలిజ (9) తలపై నుంచి ఫార్మా కంపెనీకి చెందిన బస్సు చక్రాలు వెళ్లడంలో తల నుజ్జయి అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు. బాలుడి తాత చిట్టిబాబు స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌ విభాగంలో పనిచేసి విరమణ పొందారు. బాలుడి తండ్రి అమెరికాలో ఉంటున్నారు. అగనంపూడి అభిరామి అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు పాఠశాలకు ద్విచక్ర వాహనంపై తల్లి తీసుకువెళ్లి వస్తుంటారు. ఉక్కునగరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు వివరాలను నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
బాలుని మృతదేహంతో ధర్నా
ఫార్మా కంపెనీ బస్సులను ఈ రహదారిలో నిషేధించాలని గత కొంతకాలంగా పాఠశాల యాజమాన్యాలకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు. బాలుని మృతదేహంతో పిల్లల తల్లిదండ్రులు, ఉక్కు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కేవలం టోల్‌చార్జి ఎగ్గొట్టడానికి ఫార్మా బస్సులను ఉక్కునగరం వైపు మళ్లిస్తున్నారని ఆరోపించారు.
విద్యార్థి మతి చెందిన సందర్భంగా పాఠశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి 9:00 వరకు విపరీతమైన రద్దీ ఉండే ఈ ప్రాంతంలో కనీసం ఒక్క ట్రాఫిక్‌ పోలీసును కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఉక్కు ఉద్యోగులు విమర్శలు చేస్తున్నారు. అటు యాజమాన్యం కానీ ఇటు ట్రాఫిక్‌ పోలీసులు కానీ పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
ఆర్‌ లైఫ్‌ సైన్స్‌ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు పెట్టాలి : గంగారావు
ప్రజాశక్తి-ఉక్కునగరం :
ఉక్కునగరం రోడ్డులో 3వ తరగతి విద్యార్థి మృతికి కారణమైన ఆర్‌ లైఫ్‌ సైన్స్‌ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి గంగారావు డిమాండ్‌ చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. స్టీల్‌ యాజమాన్యం స్కూల్‌ సమయంలో ప్రైవేట్‌ వాహనాలకు ఆ మార్గం గుండా అనుమతులు లేనప్పటికీ వారు ఆ మార్గంలోనే ప్రయాణించడం ద్వారా ప్రమాదం సంభవించిందన్నారు. స్టీల్‌ యాజమాన్యం స్పందించి సర్కులర్లను ఇవ్వడంతో చేతులు దులుపుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే దగ్గర ఉండి బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.