ప్రజాశక్తి - బుట్టాయగూడెం
జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజర్ కడలి శ్రీవాణిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ 2021లో లక్ష్ముడుగూడెం పంచాయతీ బూసరాజుపల్లి గ్రామానికి చెందిన తొమ్మిది గిరిజన కుటుంబాలకు ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. గిరిజనులు తమకు ఇచ్చిన పట్టా భూముల్లోకి వ్యవసాయ సాగు చేయకుండా జంగారెడ్డిగూడెం రేంజర్ శ్రీవాణి అడ్డు పడుతున్నారన్నారు. ఈ భూముల్లో వ్యవసాయం చేసేందుకొస్తే మీపై కేసులు నమోదు చేస్తామని గిరిజనులను భయబ్రాంతులకు గురి చేయడం దారుణమన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఆర్‌డిఒ, ఐటిడిఎ పిఒకు ఫిర్యాదు చేసినా శ్రీవాణి తీరు మారలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే శ్రీవాణిపై తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవాణి వేధింపులు ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు నాగేశ్వరరావు, గిరిజనులు మడకం శారద, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తామా ముత్యాలమ్మ, సిఐటియు నాయకులు నాగమణి, బుల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు.










