Jul 31,2021 22:31

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతాంగ పోరాట సమయంలో వందలాది మంది రైతుల మరణాలపై ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)ని ఏర్పాటు చేయడంతో పాటు రైతుల సమస్యలు, పెగాసస్‌ నిఘాపై పార్లమెంట్‌లో చర్చ జరిగేలా జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ప్రతిపక్ష పార్టీలు కోరాయి. శిరోమణి అకాలీదళ్‌, బిఎస్‌పి, ఎన్‌సిపి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను శనివారం కలిసి ఈ మేరకు ఒక వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంపై సంతకం చేసినవారిలో ఎస్‌ఎడి, ఎన్‌సిపి, బిఎస్‌పి, సిపిఎం, సిపిఐ, నేషనల్‌ కాన్ఫరెన్సు, ఆర్‌ఎల్‌పి, శివసేన పార్టీల నేతలు ఉన్నారు. రైతు ఉద్యమంలో రైతుల మరణాలను నిర్ధారించేందుకు జెపిసి వేయాలని, అదేవిధంగా రైతు సమస్యలపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే పెగాసస్‌ నిఘా వ్యవహారంపై కూడా చర్చకు కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మాజీ కేంద్ర మంత్రి, ఎస్‌ఎడి ఎంపి హర్‌సిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రజాసమస్యలపై పార్లమెంట్‌లో చర్చకు ప్రతిపక్షాలు పట్టుపడుతున్నా ప్రభుత్వం తప్పించుకుంటోందని విమర్శించారు. ఉద్యమంలో మరణించిన రైతులకు పార్లమెంట్‌లో నివాళులు అర్పించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్‌ చేశారని తెలిపారు. ''ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. పార్లమెంటు సభ్యుల గొంతును ప్రభుత్వం నొక్కేస్తోందని రాష్ట్రపతికి చెప్పేందుకు మేం ఇక్కడకు వచ్చాం'' అని పేర్కొన్నారు. దాదాపు గత ఎనిమిది నెలలుగా సాగుతున్న రైతాంగ ఉద్యమంలో 500 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఒక్క రైతు కూడా చనిపోలేదని వ్యవసాయ మంత్రి చెప్పడం దారుణమని, అది రైతుల కోపాన్ని మరింత పెంచుతుందని బాదల్‌ అన్నారు. ప్రభుత్వం చెబుతున్న విధంగా ఇది ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీలు, ఎంపిలు, ప్రజలు రైతాంగ ఉద్యమానికి మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు.

అదేవిధంగా పెగాసస్‌ నిఘా చర్చకు అంగీకరించకుండా ప్రభుత్వం ఎందుకు పారిపోతోందని ప్రశ్నించారు. దేశ భద్రతకు సంబంధించి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపి హుస్నేన్‌ మసూది మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కూడా తాము రాష్ట్రపతిని కోరామని అన్నారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో మహమ్మద్‌ ఫైజల్‌ (ఎన్‌సిపి), హుస్నేన్‌ మసూది (జెకెఎన్‌సి), రితేష్‌ పాండే (బిఎస్‌పి), బల్వీందర్‌ సింగ్‌ భుందర్‌ (ఎస్‌ఎడి) ఉన్నారు.